Monday, June 15, 2026
E-PAPER
Homeఆటలుఆస్ర్టేలియా అదుర్స్‌

ఆస్ర్టేలియా అదుర్స్‌

- Advertisement -

2-0తో టర్కీపై ఘన విజయం
ఫిఫా 2026 ప్రపంచకప్‌

నవతెలంగాణ-వాంకోవర్‌ (‌కెనడా)
ఫిఫా ప్రపంచకప్‌‌లో ఆస్ర్టేలియా అదరగొట్టింది. గ్రూప్‌-‌డిలో ఆదివారం వాంకోవర్‌‌లో జరిగిన మ్యాచ్‌‌లో టర్కీపై ఆసీస్‌ అదిరే విజయం సాధించింది. నెస్టోరీ ఇరంకుంద, కానర్‌ ‌మెట్‌‌కాల్ఫె కండ్లుచెదిరే గోల్స్‌ ‌కొట్టగా ఆస్ర్టేలియా 2-0తో టర్కీపై ఘన విజయం సాధించింది. 2002 తర్వాత తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌‌లో ఆడుతున్న టర్కీకి కంగారూలు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. టర్కీ గోల్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగించినా.. ఊహించని విధంగా గ్లోవ్స్‌ అందుకున్న పాట్రిక్‌ ‌బీచ్‌ ‌సూపర్‌ ‌సేవ్‌‌లతో టర్కీకి భంగపాటు మిగిల్చాడు. ఆస్ర్టేలియా తర్వాతి మ్యాచ్‌‌లో ఆతిథ్య అమెరికాతో పోటీపడనుండగా.. పరాగ్వేతో టర్కీ ఢీకొట్టనుంది.

అదరగొట్టారు
2002 తర్వాత తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ ఆడుతున్నా.. ఆదివారం నాటి మ్యాచ్‌‌లో టర్కీ ఫేవరేట్‌‌గా బరిలోకి దిగింది. యువ జట్టుతో సాకర్‌ ‌గ్రౌండ్‌లో అడుగుపెట్టిన కంగారూలు గోల్స్‌ ‌మేనియాతో మెప్పించారు. ఆట మొదలైన ఆరంభంలోనే టర్కీ ఎదురుదాడి మొదలుపెట్టింది. కానీ ఆశ్చర్యకరంగా జట్టులో నిలిచిన గోల్‌ ‌కీపర్‌ ‌పాట్రిక్‌ ‌బీచ్‌ అద్భుతంగా గోల్‌ ‌ప్రయత్నాలను నిలువరించాడు. ఫ్రీ కిక్‌‌లు సహా ఎంతో దగ్గర నుంచి వచ్చిన టార్గెట్‌‌ను బీచ్‌ అడ్డుకున్నాడు. మైదానంలో వేగంగా కదులుతూ టర్కీ ఆటగాళ్లతో ఆడుకున్న 20 ఏండ్ల నెస్టోరీ ఇరాంకుంద 27వ నిమిషంలో కంగారూ శిబిరంలో జోష్‌ ‌తీసుకొచ్చాడు. సహచరుడు పాల్‌ ఓకాన్‌ అందించిన పాస్‌‌ను సమయోచితంగా గోల్‌ ‌పోస్ట్‌‌లోకి నెట్టాడు. దీంతో ఆస్ర్టేలియా 1-0తో ప్రథమార్థంలో ఆధిక్యంలో నిలిచింది. ఇదే సమయంలో టర్కీ ఆటగాడు ఆర్ద గులెర్‌ ‌ఫ్రీ కిక్‌‌ను, జెకీ సిలిక్‌ ‌మెరుపు కిక్‌‌ను పాట్రిక్‌ బీచ్‌ ‌సమర్థవంతంగా నిలువరించాడు.

75వ నిమిషంలో కానర్‌ ‌మెట్‌‌కాల్ఫె గోల్‌ సాధించాడు. దీంతో ఆస్ర్టేలియా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరి 15 నిమిషాల్లోనూ డిఫెన్స్‌ ‌చెక్కుచెదరలేదు. దీంతో ప్రపంచకప్‌‌లో కంగారూలు అదిరే బోణీ కొట్టారు. మ్యాచ్‌‌లో టర్కీ ఆధిపత్యం చెలాయించినా.. ఆసీస్‌ ‌విజయాన్ని అందుకుంది. టర్కీ 28 సార్లు గోల్‌ ప్రయత్నం చేయగా.. ఏడుసార్లు గోల్‌‌పోస్ట్‌‌పై ఎటాక్‌ ‌చేసింది. ఆస్ర్టేలియా 8 గోల్‌ ‌ప్రయత్నాల్లో 4 సార్లు గోల్‌ ‌పోస్ట్‌‌పై దండెత్తింది. అందులో రెండు సార్లు విజయవంతమైంది. టర్కీ బంతిని 63 శాతం నియంత్రణలో నిలుపుకుంది. పాస్‌‌ కచ్చితత్వంలో టర్కీ 91 శాతం మెరుగ్గా ఉండగా.. ఆసీస్‌ 75 ‌శాతం కచ్చితత్వంతోనే నెట్టుకొచ్చింది. టర్కీ ఆటగాళ్లు 679 పాసులు ఇవ్వగా.. ఆసీస్‌ ‌కేవలం 273 పాసులే ఇచ్చుకుంది. అయినా, రెండు అద్భుత గోల్స్‌‌తో ప్రపంచకప్‌‌లో టర్కీకి ఆసీస్‌ ‌గట్టి షాక్‌ ఇచ్చింది.

​స్కాట్లాండ్‌ ‌గెలుపు
బోస్టన్‌ ‌స్టేడియంలో జరిగిన గ్రూప్‌-‌సి మ్యాచ్‌‌లో హైతిపై స్కాట్లాండ్‌ ‌గెలుపొందింది. 1-0తో స్కాట్లాండ్‌ బోణీ కొట్టింది. స్కాట్లాండ్‌ ఆటగాడు జాన్‌ ‌మెక్‌‌జిన్‌ 28వ నిమిషంలో గోల్‌ ‌కొట్టి హైతికి షాక్‌ ఇచ్చాడు. హైతీ గణాంకాల పరంగా మెరుగ్గా కనిపించినా.. స్కాట్లాండ్‌ ‌గోల్‌ ‌కొట్టడంలో విజయవంతమైంది. గ్రూప్‌-‌సిలో మరో మ్యాచ్‌‌లో బ్రెజిల్‌, మొరాకో పాయింట్లు పంచుకున్నాయి. వినిసియస్‌ ‌జూనియర్‌ 32వ నిమిషంలో బ్రెజిల్‌‌కు గోల్‌ అందించగా.. 21వ నిమిషంలో ఇస్మాయిల్‌ ‌సాయిబరి మొరాకోను ముందంజలో నిలిపాడు. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్‌ ‌కొట్టడంలో విఫలం అయ్యాయి.

శరణార్థ శిబిరం నుంచి ఫిఫా ప్రపంచకప్‌
ఆస్ర్టేలియా యువ ఆటగాడు నెస్టోరీ ఇరాంకుంద శరణార్థ శిబిరం నుంచి ఫిఫా ప్రపంచకప్‌ ‌వరకు సాగించిన ప్రయాణం అసామాన్యం. బురుంది అంత్యరుద్ధం కారణంగా టాంజానియాలోని శరణార్థ శిబిరంలో 2006లో జన్మించాడు. నెస్టోరీ మూడు నెలల పసికందు వయసులో అతడి తల్లిదండ్రులు ఆడిలైడ్‌‌కు వలస వచ్చారు. ఆస్ర్టేలియా ఆడిలైడ్‌ ‌యునైటెడ్‌ ‌క్లబ్‌ ‌తరఫున ప్రొఫెషన్‌ ‌ఫుట్‌‌బాల్‌ ‌కెరీర్‌ ‌మొదలెట్టిన నెస్టోరీ.. తనదైన ప్రతిభతో యూరోపియన్‌ ‌క్లబ్‌‌లను ఆకర్షించాడు. జర్మన్‌‌ క్లబ్‌ ‌బేయర్న్‌ ‌మ్యూనిచ్‌ ‌క్లబ్‌ ‌కాంట్రాక్టు దక్కించుకోవటం నెస్టోరీ కెరీర్‌‌ను మలుపుతిప్పింది. మైదానంలో చిరుత పులి వేగంతో కదిలే నెస్టోరీ గోల్‌ ‌స్కోరింగ్‌ ‌నైపుణ్యం అమోఘం. ఆస్ర్టేలియా జాతీయ జట్టు తరఫున ఫార్వర్డ్‌‌గా ఆడుతున్న నెస్టోరీ.. గోల్‌ ‌చేసిన అనంతరం మైకల్‌ ‌జాక్సన్‌ ‌తరహాలో నృత్యం చేయటంతో అతడికి అభిమానుల ఫాలోయింగ్‌ ‌సైతం గణనీయంగా పెరిగింది. 20 ఏండ్ల 125 రోజుల వయసులో ఫిఫా ప్రపంచకప్‌ ‌గోల్‌ ‌కొట్టిన నెస్టోరీ ఇరాంకుంద.. బ్రెట్‌ ‌హాల్మోన్‌ (26 ఏండ్ల 84 రోజులు) యంగెస్ట్‌ ‌గోల్‌ ‌స్కోరర్‌ ‌రికార్డును బద్దలుకొట్టాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -