రాష్ట్రంలో పోలీసు నియామక పరీక్షల ముందు ఉద్రిక్తత
ఎగ్జామ్ సెంటర్స్‌కు వెళ్లే అభ్యర్థులకు తగిన సంఖ్యలో రైళ్లను ఏర్పాటు చేయని వైనం
ఆందోళనకు దిగిన అభ్యర్థులు.. రణరంగంగా మారిన పాటలీపుత్ర
రైల్వే స్టేషన్
టియర్ గ్యాస్ ప్రయోగం.. గాల్లో కాల్పులు
నిరసననకారులను చెదరగొట్టిన పోలీసులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై ప్రశ్నలు
పాట్నా : ప్రధాని మోడీ చెప్పే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో తెలియజేసే ఘటన ఇది. బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నిరసన పాట్నాలోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్ వద్ద హింసాత్మకంగా మారింది. రైళ్ల కొరత, ఉన్నవి కూడా సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వేలాదిమంది నిరసనకారులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. రైల్వే స్టేషన్‌లో గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో రైల్వే స్టేషన్‌లో రాత్రంతా తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. నిరసనకారులు రైళ్ల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించారు. వివరాళ్లోకెళ్తే.. బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ పరీక్షలు ఆదివారం (14న) జరగాల్సి ఉంది. ఇందుకోసం అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి రైళ్ల మీద ఆధారపడ్డారు.
దీంతో వందలాది మంది అభ్యర్థులు స్టేషన్ ప్రాంగణంలో గుమిగూడారు. సకాలంలో రైళ్లు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. రైల్వే ట్రాక్‌లపైకి వెళ్లారు. రైళ్లను నిలిపివేశారు. ట్రాక్‌లను బ్లాక్ చేశారు. రాళ్ల దాడికి దిగారు. వారిని అడ్డుకోవడానికి ఆర్పీఎఫ్, జీపీఎఫ్, పోలీసులు ప్రయత్నిచడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది ముందుగా నిరసనకారులను సముదాయించే ప్రయత్నం చేసినట్టు అధికారులు తెలిపారు. నిరసనకారులు ట్రాక్‌లపై కూర్చొని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో ఆర్పీఎఫ్, జీపీఎఫ్ సిబ్బంది వారిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహించిన నిరసనకారులు రాళ్ల దాడికి దిగారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.మొత్తానికి ఈ ఘటనతో పాటలీపుత్ర రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఈ ఘటన తర్వాత రైల్వే స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా భద్రతను పెంచినట్టు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా రైల్వే, పోలీసు అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై పాట్నా జిల్లా కలెక్టర్ త్యాగరాజన్ స్పందించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని, అప్పటికే రెండు రైళ్లు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. నిరసనకారుల మధ్య అసాంఘిక శక్తులు కలిసిపోయి రాళ్లు విసరడం ద్వారా హింసకు దారితీశాయని వ్యాఖ్యానించారు. రైల్వే స్టేషన్ వద్ద అల్లర్లు జరుగుతున్నాయనే సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను తరలించామని, పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని అన్నారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పే ‘డబుల్ ఇంజిన్’ సర్కారే బీహార్‌లో ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్రపక్షం ప్రభుత్వాలు ఉన్నప్పుడే అభివృద్ధి వేగంగా జరుగుతుందని బీజేపీ వాదన. అయితే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదమనేది బీజేపీకి ఉన్న అధికార దాహంలో భాగమే తప్పితే ప్రజలకు ఏ మాత్రమూ ఉపయోగం ఉండదనీ, ఇందకు తాజాగా బీహార్‌లో చోటు చేసుకున్న ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. తాజా ఘటన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తి చూపుతున్నదని ఆరోపిస్తున్నారు.



