ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ పతకం సేవ, 10 మందికి మెరిటోరియన్ సర్వీస్ మెడల్స్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్
విధినిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన తెలంగాణ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్‌లో తెలంగాణకు చెందిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ విభాగాల్లో పతకాలకు ఎంపిక య్యారు. వారిలో ముగ్గురికి గ్యాలంట్రీ మెడల్స్ , ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ పతకం సేవ, పది మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ లభించాయి. తెలంగాణ పోలీసు శాఖలో సుదీర్ఘకాలం అంకితభా వంతో సేవలందిస్తున్న అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సయ్య జోగుల, ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆర్. జగదీశ్వర్‌రెడ్డి లకు ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ పతకం సేవ లభించింది. గ్యాలంట్రీ మెడల్ అందుకున్న వారిలో గ్రేహౌండ్స్‌కు చెందిన కానిస్టేబుళ్లు బి.సత్యారావు, కె.సందీప్‌కుమార్, జె.వంశిక్రిష్ణ ఉన్నారు. మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్‌కు కరీంనగర్ అదనపు డీసీపీ పి.వెంకటరమణ, సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్.జి.శివమారుతి, సీటీసీ ఏసీపీ ఎ.గంగారాం, విజిలెన్స్ డీఎస్‌పీ బి.రవికుమార్‌రెడ్డి, ఈగల్ ఫోర్స్ డీఎస్‌పీ బి.శ్రీనివాస్‌రావు, ఎనిమిదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ డి.సత్యనారాయణ, ఇఒడబ్ల్యూ పి.జగదీశ్వర్, అక్టోపస్ సి.రాములు,పిటిఓ హెడ్‌కానిస్టేబుల్ కూరపాటి తిరుపతిరాజుకు ఎంపికయ్యారు.
35 ఏండ్ల పోలీస్ ప్రస్థానానికి నర్సయ్యకు అరుదైన గౌరవం..
పోలీస్ శాఖలో 35 ఏండ్లుగా అంకితభావంతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సికింద్రాబాద్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోగుల నర్సయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన అత్యంత కీలకమైన ఆపరేషన్లు, సంచలన కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో చేసిన సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు. ఎస్‌ఐగా ఆయన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా పనిచేశారు. పలు ఆపరేషన్లలో మిలిటెంట్లు, నక్సల్ సానుభూతిపరులను పట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు అధికారిక ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. 2010లో హైదరాబాద్ పాతబస్తీలో సున్నితమైన ప్రాంతాల్లో చోటుచేసుకున్న మతపరమైన ఉద్రిక్తతలను సమర్థవంతంగా ఎదుర్కొని శాంతిభద్రతలను పునరుద్ధరించడంలో నర్సయ్య కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో పలు హత్య కేసులను ఛేదించడంతో పాటు సామాజిక సామరస్యాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేశారు.2012లో డిఆర్‌డిఎల్ శాస్త్రవేత్త కుమారుడు, పదేండ్ల బాలుడు ప్రణవ్ హత్య కేసు పోలీస్ శాఖను తీవ్రంగా కలచివేసింది.
అత్యంత సంచలనంగా మారిన ఈ కేసును ఛేదించడంలో నర్సయ్య కీలక పాత్ర పోషించారు. దర్యాప్తులో ఆయన చూపిన నైపుణ్యం కేసు ఛేదనకు దోహదపడింది. హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన సమయంలో నర్సయ్య నకిలీ కరెన్సీ ముఠాపై దాడి చేసి, పాకిస్థాన్‌లో ముద్రించిన రూ.6.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందంతో కలిసి పనిచేసిన నర్సయ్య ఓడియన్ థియేటర్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు జియావుల్ హక్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. నర్సయ్య సేవలకు పోలీసు శాఖాపరంగా 16 నగదు రివార్డులు, 261 జీఎస్‌ఈలు, 32 ఎమ్‌ఎస్‌ఈలు, 20 ప్రశంసా పత్రాలు, 18 అభినందనలు లభించాయి. నగదు రివార్డుల రూపంలో మొత్తం రూ.13,700 అందుకున్నట్లు అధికారిక రికార్డులో పేర్కొన్నారు.
ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆర్. జగదీశ్వర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ పతకం..
తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ రేగట్టె జగదీశ్వర్‌రెడ్డికి విశిష్ట సేవలకుగాను ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ పతకం లభించింది. ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, పోలీస్ శాఖకు అందించిన సుదీర్ఘ సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది. జగదీశ్వర్‌రెడ్డి 2005లో కఠిన సేవా పతకం, 2009లో ఉత్తమ సేవా పతకం, 2011లో ముఖ్యమంత్రి గ్యాలంట్రీ మెడల్, 2014లో అంతరిక్ సురక్షా పతకం, 2017లో ఇండియన్ పోలీస్ మెడల్, 2021లో మహోన్నత సేవా పతకం అందుకున్నారు. 2006లో ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకు సిబిఐ నుంచి కూడా ఆయన ప్రశంసలు, పురస్కారం అందుకున్నారు. జగదీశ్వర్‌రెడ్డి సేవా రికార్డులో ఇప్పటివరకు 85 ప్రశంసా ఎంట్రీలు, 8 ప్రశంసాపత్రాలు, 2 ప్రత్యేక అభినందనలు ఉండటం ఆయన విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.
తెలంగాణ పోలీసులకు15 జాతీయ పతకాలు
- Advertisement -
- Advertisement -



