Saturday, August 15, 2026
E-PAPER
Homeజాతీయంసమాచార హక్కుకు తాళం!

సమాచార హక్కుకు తాళం!

- Advertisement -

సీఐసీలో 40 వేలకుపైగా ఆర్టీఐ కేసులు పెండింగ్
పూర్తి స్థాయి కమిషనర్లు ఉన్నా తగ్గని కేసుల భారం
ఆగస్టులో అప్పీల్స్ పరిష్కారంలో దాదాపు శూన్య పురోగతి
ఈ ఏడాది 20 వేలకుపైగా అప్పీల్స్.. పరిష్కారమైనవి 11,903 మాత్రమే!
హక్కు నిర్వీర్యమవుతోందంటూ సామాజిక కార్యకర్తల ఆందోళన

​సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ను ప్రజాస్వామ్యంలో పారదర్శక పాలనకు కీలక ఆయుధంగా భావిస్తారు. అయితే కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)లో 40 వేలకుపైగా కేసులు పేరుకుపోవడం, పూర్తి స్థాయి కమిషనర్లు ఉన్నప్పటికీ కేసుల పరిష్కారంలో ఆశించిన వేగం కనిపించక పోవడం ఆర్టీఐ వ్యవస్థ పనితీరుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు నెలలో దాదాపు అన్ని కమిషనర్ల వద్ద కేసుల పరిష్కారంలో శూన్య పురోగతి నమోదవడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ఈ విషయంలో సమాచార హక్కు కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ‘తెలుసుకునే హక్కు’ను నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

న్యూఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)లో సమాచార హక్కు (ఆర్టీఐ) కేసుల పెండింగ్ ఆందోళనకర స్థాయికి చేరింది. కమిషన్ పూర్తి స్థాయి సిబ్బంది, 10 మంది సమాచార కమిషనర్లు, ఒక ప్రధాన సమాచార కమిషనర్‌తో పనిచేస్తున్నప్పటికీ… ఆగస్టు 12 నాటికి మొత్తం 40,083 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సీఐసీ అధికారిక పోర్టల్ వెల్లడించింది. ఈ పెండింగ్ కేసుల్లో 3,733 ఫిర్యాదులు, 36,350 అప్పీల్స్ ఉన్నాయి. ప్రధాన సమాచార కమిషనర్ రాజ్‌కుమార్ గోయల్ ఒక్కరి వద్దే 5,317 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 522 ఫిర్యాదులు, 4,795 అప్పీల్స్ ఉన్నాయి.

​ఆగస్టులో దాదాపు నిలిచిపోయిన వైనం
సీఐసీ నివేదిక ప్రకారం… ఆగస్టులో ఇప్పటివరకు ఇద్దరు సమాచార కమిషనర్లు మాత్రమే మూడు అప్పీల్స్‌ను పరిష్కరించారు. వినోద్ కుమార్ తివారీ ఒక కేసు, స్వాగత్ దాస్ రెండు కేసులను మాత్రమే పరిష్కరించారు. మిగిలిన ఎనిమిది మంది సమాచార కమిషనర్లు ఒక్క అప్పీల్‌ను కూడా పరిష్కరించకపోవడం గమనార్హం.

​​హక్కును కట్టడి చేస్తున్నారా?
సామాజిక కార్యకర్త, రిటైర్డ్ కమోడోర్ లోకేశ్ బాత్రా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2015లో కూడా ప్రధాన సమాచార కమిషనర్ లేక, ముగ్గురు కమిషనర్ల కొరత కారణంగా 40 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండేవని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి కమిషనర్లు ఉన్నప్పటికీ అదే స్థాయిలో పెండింగ్ కొనసాగడం మరింత ఆందోళనకరమని అన్నారు. ‘‘సమాచారం తెలుసుకునే ప్రజల హక్కును నిరుత్సాహపరిచేందుకు కమిషనర్లు ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా పనిచేస్తున్నారా? ఈ పరిస్థితి ఆర్టీఐ చట్టాన్నే నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది’’ అని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ కేసులను తగ్గించాలంటే కేంద్ర సమాచార కమిషన్‌లో సమూల సంస్కరణలు అవసరమనీ, అవసరమైతే ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు కమిషనర్లు శనివారాల్లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని బాత్రా సూచించారు.

పరిష్కారమైన కేసుల సంఖ్య తక్కువే!
ఈ ఏడాదిలో ఇప్పటివరకు సీఐసీకి 20,163 అప్పీల్స్ అందగా… వాటిలో 11,903 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ప్రధాన సమాచార కమిషనర్ రాజ్‌కుమార్ గోయల్ జనవరి నుంచి జులై మధ్య తన వద్దకు వచ్చిన 2,541 అప్పీల్స్‌లో 1,180 కేసులను మాత్రమే పరిష్కరించారు. అంటే ఆయన పరిష్కార శాతం సుమారు 46 మాత్రమే కావడం గమనార్హం. ఆగస్టులో ఆయన వద్ద కొత్తగా వచ్చిన, పరిష్కరించిన అప్పీల్స్ ఏవీ నమోదు కాలేదని నివేదిక వెల్లడించింది. అలాగే సమాచార కమిషనర్ల వద్ద కూడా ఆగస్టు తొలి 12 రోజుల్లో కేసుల పరిష్కారంలో ఎలాంటి పురోగతీ కనిపించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -