Monday, June 15, 2026
E-PAPER
Homeజాతీయంగుండెకు ముందస్తు వృద్ధాప్యం

గుండెకు ముందస్తు వృద్ధాప్యం

- Advertisement -

నియంత్రించకపోతే చిన్న వయస్సులోనే గుండె జబ్బుల ప్రమాదం
ఆందోళన కలిగిస్తున్న ఎన్‌ఎఫ్‌‌హెచ్‌ఎస్‌-6 గణాంకాలు
హెచ్చరిస్తున్న వైద్య, 
ఆరోగ్యనిపుణులు

ఊబకాయంతో పెరుగుతున్న హార్ట్‌ ఏజ్‌

​న్యూఢిల్లీ : భారత్‌లోని ప్రజల్లో ఊబకాయం (ఒబెసిటీ) వేగంగా పెరుగుతోంది. ఇది గుండెను వృద్ధాప్యంలోకి నెడుతోంది. అంటే.. కోట్లాది మంది భారతీయుల గుండెలు వారి అసలు వయస్సుకంటే ఎక్కువ వయస్సు కలిగినవిగా మారుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఊహించిన దానికంటే చాలా ముందుగానే వచ్చే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 (ఎన్‌ఎఫ్‌‌హెచ్‌ఎస్‌-6) తాజా గణాంకాలు దేశంలో ఊబకాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించాయి. ఈ ధోరణి కొనసాగితే గుండె జబ్బుల భారం మరింత పెరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​భయపెడుతున్న ఊబకాయం గణాంకాలు
ఎన్‌ఎఫ్‌‌హెచ్‌ఎస్‌-6 ‌ప్రకారం… 2023-24 నాటికి 15-49 ఏండ్ల వయసు గల మహిళల్లో 30.7 శాతం మంది అధిక బరువు(ఊబకాయం)తో బాధపడుతున్నారు. ఎన్ఎఫ్‌‌హెచ్‌ఎస్‌-5(2019-21)లో ఇది 24 శాతమే. అదే విధంగా పురుషుల్లో అధిక బరువు కలిగిన వారి శాతం 22.9 నుంచి 27.3 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదలకు మధుమేహం, రక్తపోటు కేసులు తోడవడంతో దేశంలో గుండె జబ్బుల ప్రమాదం మరింత ఎక్కువవుతోందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

​‘హార్ట్ ఏజ్’ అంటే?
ఢిల్లీ ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ మాట్లాడుతూ… ప్రస్తుతం గుండె ఆరోగ్య ప్రమాదాలను సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించేందుకు ‘కార్డియాక్ ఏజ్(హార్ట్ ఏజ్)’ అనే భావనను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒక వ్యక్తి అసలు వయస్సు (క్రోనాలజికల్ ఏజ్) ఎంత ఉన్నా, ఆయన గుండె ఆరోగ్యం అదే స్థాయిలో ఉండకపోవచ్చు. గుండె, రక్తనాళాల పరిస్థితిని బట్టి నిర్ణయించే వయస్సునే ‘హార్ట్ ఏజ్’ అంటారు. ఉదాహరణకు 35 ఏండ్ల వ్యక్తికి ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, శారీరక శ్రమ లేని జీవనశైలి ఉంటే… ఆయన గుండె ఆరోగ్యం 55 లేదా 60 ఏండ్ల వ్యక్తి స్థాయిలో ఉండే అవకాశం ఉందని ఆయన వివరించారు.

​ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ఊబకాయం అనేది అంటువ్యాధులు కాని వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకం. ముఖ్యంగా గుండె జబ్బులకు ఇది కారణంగా నిలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు గుండె సంబంధిత వ్యాధులే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంటున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

​ఊబకాయం గుండెను ఎలా వృద్ధాప్యంలోకి నెడుతుంది?
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్, లంగ్ డిసీజెస్ రీసెర్చ్ సెంటర్ చైర్మెన్, గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ రాహుల్ చందోలా ప్రకారం… గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించే ప్రధాన అంశాల్లో ఊబకాయం అత్యంత కీలకమైనది. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి అంశాలు ఊబకాయానికి దారితీస్తున్నాయి. గుండె వయస్సు అంటే వ్యక్తి ఎంతకాలం జీవించాడన్నది కాదు.. గుండె, రక్తనాళాల జీవశాస్త్రీయ (బయోలాజికల్) ఆరోగ్య స్థితిని ప్రతిబింబించే సూచిక. అందువల్ల 70 లేదా 80 ఏండ్ల వ్యక్తికీ గుండె చాలా ఆరోగ్యంగా ఉంటే ఆయన హార్ట్ ఏజ్ తక్కువగా ఉండొచ్చు. అదే సమయంలో యువకుడికి అనేక ప్రమాద కారకాలు ఉంటే ఆయన హార్ట్ ఏజ్ ఎక్కువగా ఉండొచ్చు.

​హార్ట్ ఏజ్‌ను ఎలా అంచనా వేస్తారు?
రక్తపోటు, గుండె స్పందన రేటు, ఈసీజీ ఫలితాలు, హార్ట్ రేట్ వేరియబిలిటీ, రక్తంలో చక్కెర నియంత్రణ, వ్యాయామ స్థాయి, మొత్తం గుండె ఆరోగ్య పరిస్థితి వంటి అనేక అంశాలను పరిగణ నలోకి తీసుకుని హార్ట్ ఏజ్‌ను అంచనా వేస్తారు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికతల వల్ల ప్రస్తుతం హార్ట్ ఏజ్‌ను మరింత ఖచ్చితంగా లెక్కించ డం సాధ్యమవుతోందని డాక్టర్ చందోలా తెలిపారు.

​లక్షణాలు కనిపించేలోపే నష్టం
చాలా మంది భారతీయులు గుండెకు నష్టం చాలాకాలం ముందే ప్రారంభమవుతుందని గుర్తించరని డాక్టర్ నితీష్ నాయక్ చెప్పారు. చాలామంది కేవలం బరువుపైనే దృష్టి పెడతారనీ, కానీ జీవక్రియల ఆరోగ్యం (మెటబాలిక్ హెల్త్) కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. ఊబకా యం రక్తనాళాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రక్తపోటును అధికం చేస్తుంది. లక్షణాలు బయటపడే సమయానికి గుండెకు గణనీయమైన నష్టం జరిగి ఉండవచ్చని ఆయన హెచ్చరించారు.

​ఉదర భాగంలోని కొవ్వు మరింత ప్రమాదకరం
సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ హెచ్.ఎస్. ఇస్సర్ ప్రకారం… ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు శరీరంలో దీర్ఘకాలిక వాపును (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్) పెంచుతుంది. అది రక్తపోటును పెంచడమే కాకుండా, కొలెస్ట్రాల్ స్థాయిలను దెబ్బతీసి, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఫలితంగా రక్తనాళాలు దెబ్బతిని గుండెపై అదనపు భారం పడుతుంది. ఊబకాయం అనేది మధుమేహం, అధిక రక్తపోటు, అసాధారణ కొవ్వు స్థాయిలు వంటి జీవక్రియల సమస్యల సమూహంతో కలిసి వస్తుంది. ఈ పరిస్థితులు కలిసివస్తే కరోనరీ ఆర్టరీ వ్యాధులు, గుండె వైఫల్యం, స్ట్రోక్ ప్రమాదం భారీగా పెరుగుతుందని ఆయన హెచ్చరించారు.

​బరువు తక్కువగా కనిపించినా ప్రమాదం ఉండొచ్చు
పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు (అబ్డామినల్ ఒబెసిటీ) అత్యంత ప్రమాదకరమని డాక్టర్ ఇస్సర్ తెలిపారు. కేవలం శరీర బరువును చూసి ఆరోగ్యాన్ని అంచనా వేయలేమని, నడుము చుట్టుకొలత, అంతర్గత కొవ్వు (విసెరల్ ఫ్యాట్) కూడా అంతే ముఖ్యమని చెప్పారు. కొంతమంది బాహ్యంగా సన్నగా కనిపించినప్పటికీ, అంతర్గతంగా అధిక కొవ్వు ఉండి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చని వివరించారు. భారతీయుల్లో చిన్న వయసులోనే గుండె జబ్బులు పెరగడానికి ఇదీ ఒక ప్రధాన కారణమని తెలిపారు.

జీవనశైలి మార్పుతోనే గుండెను 
యవ్వనంగా కాపాడుకోవచ్చు
​వైద్య, ఆరోగ్య నిపుణులు
భారత్‌లో పెరుగుతున్న ఊబకాయం కేవలం అందచందాల సమస్య కాదనీ, అది గుండెను వేగంగా వృద్ధాప్యంలోకి నెట్టే ప్రజారోగ్య సంక్షోభమని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాహ్యంగా ఆరోగ్యంగా కనిపించే లక్షలాది మంది భారతీయుల గుండెలు వారి అసలు వయసుకంటే దశాబ్దాల ముందే వృద్ధాప్య లక్షణాలు చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి జీవనశైలిని మార్చుకోవడం ద్వారానే రేపటి గుండెను యవ్వనంగా కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

​దక్ష‍ిణాసియాలో ఆందోళనకర పరిస్థితులు
సీతారాం భార్టియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ గుర్టూ మాట్లాడుతూ… ‘‘క్యాలెండర్ ప్రకారం మన వయస్సు 40 ఏండ్లు కావొచ్చు. కానీ మన గుండె వయసు 60 దాటిపోయి ఉండొచ్చు” అని వ్యాఖ్యానించారు. ‘యంగ్-ఓల్డ్’ (వయసులో యువకులు, ఆరోగ్యంలో వృద్ధులు), ‘తిన్-ఫ్యాట్’ (సన్నగా కనిపించినా అంతర్గతంగా కొవ్వు ఎక్కువగా ఉండటం) అనే విరుద్ధ పరిస్థితి దక్షిణాసియా దేశాల్లో వేగంగా పెరుగుతోందని చెప్పారు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయుల్లో తక్కువ బరువు ఉన్నప్పటికీ, చిన్న వయసులోనే మధుమేహం, గుండెపోటు వంటి కార్డియో-మెటబాలిక్ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -