ఫ్రీ బస్సులతో నష్టపోతున్న ఆటో వాలలు
గిరాకీల్లేక.. ఈఎంఐలు కట్టలేక అవస్థలు
భారంగా కుటుంబ పోషణ
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ మల్హర్ రావు:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోవాలాల బతుకులపై గట్టి దెబ్బ కొట్టింది. కోవిడ్-19 వ్యాప్తి క్రమంలో ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి ప్రయాణం చేయడంతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆటో కార్మికులకు, ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలుతో మరింతగా ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడ్డట్టయింది. కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నారు.
ఆటో స్టాండ్లు ఇవే…
మండలంలో మొత్తం 40 ఆటోలున్నాయి. తాడిచెర్ల, కొయ్యుర్, వళ్లెంకుంట,మల్లారం గ్రామాల్లో ఆటో స్టాండ్లున్నాయి. ఒక్క మండలకేంద్రంలోనే నాలుగు చోట్ల ఆటో స్టాండ్ లున్నాయి. ఇక్కడ నుండి మంథని,కోయ్యుర్,రుద్రారం,వళ్లెంకుంట గ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ప్రతి ఆటో స్టాండ్లో పదుల సంఖ్యలో ఆటో కార్మికులుంటారు.
గిరాకీల్లేక.. ఈఎంఐ కట్టలేక..
తెలంగాణలో ఏ మూలకెళ్లినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో ఆటోల్లో ప్రయాణం చేసే వారు గణనీయంగా తగ్గిపోయారు.దీంతో ఆర్థికంగా వారి జీవితాలు చితికిపోతున్నాయి. లక్ష లు పెట్టి ఆటోలను ఫైనాన్స్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసిన ఆటో యజమానులు వాటికి ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఆటో కార్మికులు కొంత మంది పాలాల్లో కూలీలకు కూడా వెళ్తున్నారు.మరికొంతమంది అమ్మేస్తున్నారు.
నెరవేర్చని ప్రభుత్వ హామీ..
ఆటో కార్మికులను ఆదుకుంటామని సంవత్సరానికి రూ.12వేల నగదు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం నేటికి చిల్లిగవ్వ ఇవ్వ లేదు. భరోసా ఇచ్చిన ప్రభుత్వం నేడు ఆర్ధిక సాయం ఊసే ఎత్తడం లేదని ఆటో కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమను పాలకులు ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆటోలు ఎక్కడం లేదు…
ఫిరోజ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు
కొయ్యుర్ టు తాడిచెర్ల, తాడిచెర్ల టు మంథని ఆటోలు నిత్యం నడుపుతున్నాం.ఉచిత బస్సు ప్రయాణంలో గతంలా ఇప్పుడు ఆటోలు ఎక్కడం లేదు.ప్రతి గంటకు బస్సు సర్వీస్ ఉండడంతో మహిళలు ఆటోలు ఎక్కేoదుకు మొగ్గు చూపడం లేదు.కొన్ని సార్లు ఖాళీ జేబులతో ఇంటికెళ్ళాల్సి వస్తోంది.ప్రభుత్వం సాయమందిస్తే బాగుంటుంది.