‘మొక్కేకదా అని పీకేస్తే.. పీక కోస్తా…’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో. ఇప్పుడు బంతిపువ్వు కూడా… ‘పువ్వే కదా.. అని నన్ను చిన్నచూపు చూస్తే, ధరల రూపంలో మీకు చుక్కలు చూపిస్తా…’ అంటూ హెచ్చరిస్తోంది. నిజమే మరి.. తెలంగాణలో పెద్ద పండుగ దసరాకు బంతిపువ్వు చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఒకవైపు దుర్గా నవరాత్రుల సందడి.. మరోవైపు బతుకమ్మ ఆట పాటల సవ్వడి… వెరసి ఈ పది రోజులూ ధూంధామే. ఈ రెండింటిలోనూ బంతిపువ్వు ఉండాల్సిందే కదా… ఒకప్పుడు పెరట్లోనూ, ఇంటి ఆవరణలోనూ మనం పెంచుకునే బంతిపూల చెట్లకు ఇప్పుడు పట్టణీకరణ, నగరీకరణ పెరిగిన తర్వాత చోటే లేకుండా పోతోంది. దీంతో పల్లెటూళ్లలో ఉచితంగా, తక్కువ ధరకు వచ్చే బంతిపూలు… పట్టణాల్లో మాత్రం… ‘నేను రాను.. తక్కువ ధరకు అసలే రాను…’ అంటూ బుంగ మూతి పెడుతున్నాయి. కానీ పండుగ సీజన్‌లో మాత్రం అవి లేకపోతే పని నడవదు. అందుకే మార్కెట్లో కిలోకి వంద రూపాయలు, ఆపైన ధర చెల్లించి వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందంటున్నారు వినియోగదారులు. ఏదేమైనా ఒకప్పుడు పొలం గట్ల మీద, ఇంటి గేట్ల పక్కన హాయిగా పెరిగే బంతి చెట్లు… ఇప్పుడు గులాబీ తరహాలో చుట్టూ కాంపౌండ్ వాల్స్ మధ్య గార్డెన్లలోనే పెరగాల్సి వస్తోంది. ఓ ఇరవై ఏండ్ల క్రితం ఎక్కడ పడితే అక్కడ దొరికే గరికె (పూజాధికాల్లో వాడేది) సైతం ఇప్పుడు ఎంతో క్లాస్టీ అయిపోయింది. నగరీకరణ, పట్టణీకరణ క్రమంలో మున్ముందు మనం ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందో…
-బి.వి.యన్.పద్మరాజు
బంతి.. గిరాకీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES