Monday, September 29, 2025
E-PAPER
Homeజాతీయంరోడ్లపై ప్రచారాన్ని నిషేధించండి

రోడ్లపై ప్రచారాన్ని నిషేధించండి

- Advertisement -

తమిళనాడులో సీపీఐ(ఎం) నేతల డిమాండ్‌
బాధితులకు పరామర్శ
40కు చేరిన కరూర్‌ తొక్కిసలాట మృతుల సంఖ్య

కరూర్‌ : తమిళనాడులోని కరూర్‌లో సినీనటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజరు నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కు చేరుకున్నది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఆదివారం మరొకరు మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడగా.. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట ఘటన బాధితుల్ని ఆదివారం సీపీఐ(ఎం) నాయకులు పరామర్శించారు. పార్టీ ఎంపీ ఆర్‌. సచ్చిదానందం, పార్టీ ఎమ్మెల్యే ఎం. చిన్నదురై, ఇతర నాయకులతో కలిసి ఘటనా స్థలాన్ని పొలిట్‌ బ్యూరో సభ్యులు కె. బాలకృష్ణన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణన్‌ మాట్లాడుతూ రోడ్లపై ప్రచారాలను తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.

ఇలాంటి ప్రచారాలపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయ చరిత్రలో విషాదకరమని తెలిపారు. గతంలో ప్రముఖ రాజకీయ ర్యాలీల కోసం 30 నుంచి 40 లక్షల మంది గుమిగూడినప్పటికీ, ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. ప్రచారాల కోసం ప్రజా రహదారులను అడ్డుకునే పద్ధతిని బాలకృష్ణన్‌ ఖండించారు. ”ప్రధాన రహదారులను అడ్డుకోని ర్యాలీలు నిర్వహించడం ఈ సంఘటనకు ప్రాథమిక కారణం. కూర్చోవడానికి, నీరు, ఆహారం కోసం సరైన ఏర్పాట్లు ఉన్న ప్రదేశాలకు మాత్రమే రాజకీయ పార్టీలు ప్రచారానికి అనుమతి తీసుకోవాలి” అని అన్నారు. రోడ్లపై రాజకీయ ప్రచారాలను వెంటనే నిషేధించాలని, అలాగే ఈ ఘటనపై ఏడాదిలోపు విచారణను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

ఊపిరాడక 40 మంది మృతి
తొక్కిసలాట ఘటనలో ఊపిరాడకపోవడం వలనే 40 మంది మరణించారని తమిళనాడు వైద్య విద్య డైరెక్టర్‌ రాజకుమారి ధ్రువీకరించారు. మృతుల్లో 10 మంది పిల్లలు, 14 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు.

విచారణ తర్వాతే నిజాలు వెల్లడి : తమిళనాడు సీఎం స్టాలిన్‌
కరూర్‌ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ విచారణ అనంతరమే ఘటన వెనుక నిజానిజాలు బయటపడతాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ అన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ”కరూర్‌లో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు మరణించడం ఇదే తొలిసారి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు. ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తాం” అని స్టాలిన్‌ చెప్పారు.

అలాగే ఈ ఘటనపై విచారణకు రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్‌ను నియమించినట్టు తెలిపారు. రాజకీయ ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. విచారణలో నిజాలు బయటకు వచ్చాక.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తన దుబారు పర్యటనను రద్దు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చారు. సేలం, ఈరోడ్‌, మధురై నుంచి వైద్య బృందాలు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారికి సహాయం చేయడానికి తరలివచ్చాయి.

రూ. 20 లక్షల పరిహారం : విజయ్
కరూర్‌ ఘటనపై టీవీకే అధికారిక ఎక్స్‌ ఖాతాలో విజయ్ మరోసారి స్పందించారు. తన హృదయం ఇంకా భారంగానే ఉందని పేర్కొన్నారు. తనను ఇష్టపడే వారిని కోల్పోయిన బాధను చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదని వివరించారు. ఇది తమకు కోలుకోలేని నష్టమని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున అందిస్తామని విజయ్ వివరించారు. ఈ డబ్బు బాధిత కుటుంబాల బాధను తీర్చదు కానీ, వారిలో ఒకడిగా అండగా నిలబడటం తన కర్తవ్యమని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అలాగే, ఘటనపై సినీ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -