ఓరి మల్లిగా… పొద్దు బారెడు ఎక్కొచ్చింది ఇంక పక్క దిగకపోతివి’ అన్నడు మా నాయిన. తెల్లారితే ఆయితారం, జీవాల కాడికి నీనే పోవాలని నాకు మా తెలిసు, అందుకే సందకాడనే నడిజాము వరకు సదివి పండిన. పొద్దుగాల లేసుడుతోనే నా ఈడు పోరలంత బజారు పొంట ఆటలాడుతుంటె నీను గొర్లమందల పొరక బట్టి ఎరువు ఊకి ఎత్తాలె. ఇగ ఈ ఆనాకాలం అచ్చిందంటె బలె గోస ఉంటది. ఎడ్లు ఒడ్ల కల్లంల బంతి తొక్కినట్టు జీవాలు ఎరువలనే తొక్కి తొంబర్లాడుతరు. అల్కగ అత్తలేదని ఎరువ అట్లనే వదిలిపెడితే లేనిపోని రోగాలు అంటుకోని జివాలు ఆగమైతరు.
నీను పొద్దుగాల నా పండ్లు అన్న సక్కగ రుద్దుడో లేదో గాని… ఎరువు మాత్రం మా ఊరి మంగళి మల్సూర్ నున్నగ నెత్తికొరిగినట్టె ఎత్తి పొయ్యాలె. ఎంతైన పొద్దుగాల లేవంగనే మందలకు పోవుడు అంటె నాకు బలె కాయిశి ఉండే. ఆనకాలం అయినా! సందకాడ మబ్బు తేటగ ఉంటె నీను మందల్నే పండేది. నా చుట్టూ జీవాలు, ‘మధ్యల నీను’, చుట్టూ చుక్కలు ‘మధ్యల చందమామ’. ఇద్దరం పోటీపడ్డటే ఉండేది పైకి చూస్తే. మా ఊళ్ళే నా తోటి పోరలకు గొంగడి వాసనే తెలవకపోతుండే. నాకు మాత్రం నడిమందల గొంగడి ముడుసుకోని పంటే, మా అవ్వ ఒడిల పన్నంత ఎచ్చగ ఉండేది. మందల ఉన్న ముసలి గొర్రె తొవ్వపొంటి మందతోని నడవలేక ఎనుకెనక ఉండి నన్ను రుద్దుకుంటనే నడిసేది. నీను సంద కావలి పంతే నా చూట్టే తిరిగేది. ఇప్పటికది అయిదు ఈతలు అయింది. ఇప్పుడు మళ్ళ కట్టె ఉన్నది కాని దానికొచ్చిన రోగం తగ్గక మందతోని ఇప్పుడసలే నడుస్తలేదు. మా నాయిన దాన్ని అమ్ముతననప్పడు నీనె అడ్డంపడ్డ. ఎందుకో నాకది మందకు పెద్దతల్లి లాగ కొడ్తది. తొలిసూరి కొదమలకు పాలు పడకపోయిన ఈ పెద్దతల్లె పాలిచ్చి బిడ్డల్ని కాపాడి నా మందను పెద్దచేస్తది.
ఇయ్యాల నా మందలున్న ఇత్తనం పోతు ఈ తల్లి పాలు తాగి బతికిందే. ఇగ ఎర్ర జాలపిల్ల అయితే నా మంచమెక్కి కాల్లల్లనే పంతది. నార మంచంల పట్టెడు జాగకోసం గెట్లకాడ అన్నదమ్ములు కొట్టుకునట్టే ఉంటది మా ఇద్దరిది. దాని తల్లి అది పుట్టిన రెండు రోజులకే కుక్కలకు బలైంది. ఆ కుక్కలకు అగ్గితగల! వాటికి తల్లిపిల్లలను ఎడబాపే పాపం మూటగట్టుకునేది ఉన్నదేమో. అయినా ఆ దొరోనికి, వాని కుక్కలకు ఏ పాపం ఉండనట్టుంది. మమ్మల్ని పీక్క తినే వాని గడి అట్లనే ఉంటున్నది. మా జీవాలను పీక్క తినే వాని కుక్కలు అట్లనే ఉంటున్నరు.క ాని ఆ తల్లి లేని పిల్లను చూస్తే దుఃఖమాగద. జీవాలు మంద చేరంగనే లేపిల్లలన్ని వాటి తల్లి సంకన చేరి పాలు తాగుతుంటే, అది నడి మందల నిలబడి దాని తల్లి కొరకు బిక్క మొఖమేసుకోని చూసినప్పుడెల్ల నా గుండె చెరువైతది. ఆ పిల్ల మూడు గొర్ల పాలు తాగి పెరిగింది. కాని దానికి ఏనాడు ఏ తల్లి కాలుతో తన్నింది తెల్వదు. ఒకే కడుపుల పుట్టకపోయిన రెండు రొమ్ముల పాలు పంచుకొని తాగేది ఆ పిల్లలు. అది పుట్టిన్నాడే దానికి తోడుగ మందల ఇంక రెండు పిల్లలు పుట్టినరు. జీవాల మలుపుకుంట ఈ మూడు పిల్లలను నిలబెట్టి తల్లులకు పాలు మరిపించే వరకు నా పాణం గంగల పడ్డది. ఆరోజు నాకు దుఃఖం ఒకటే తక్కువ. అయినా పదిహేనేండ్లు నిండకముందే మూడు పిల్లలకు పురుడు పోసి గొంగట్లే మలుసుకోని మందకొచ్చిన రోజు, మా ఊరి దొరగానికంటె ఎక్కువ గర్వం నా నెత్తికెక్కింది. ఏ పిల్ల ముందు పుట్టుంది ఏది ఎనుక పుట్టుంది? తల్లి గొర్లు మాయలు ఎంత సేపటికి ఏసినయి? ఏ పిల్ల ఎంత సేపటికి నిలబడి ముర్రుపాలు తాగింది? ఏ పిల్ల గట్టిగుంటది ఏది మెత్తగ ఉంటదని ముందే చెప్పుకుంట మురిసిన మా అయ్యఅవ్వకి.
రోజూ బువ్వేళ్ళ అయ్యేవరకు మందల జీవాలన్నిటిని సవరియ్యాలె. నోరు లేని జీవాల రోగాలను కనిపెట్టుడు నాకు పెద్ద కష్టమేమి కాదు. ఇది నాకు మా తాతల తరాలు అందించిన శాస్త్రజ్ఞానమే. ఈ ఆనలకు జీవాల కాళ్ళు చెడి డెక్కల నుండి రక్తాలు కారుతయి. ముచ్చ పోతుపిల్ల వారం రోజులగ కుంటుతంది. కీలుకత్తి తోని డెక్క తొలిచి కడిగినా సక్కగ నడువలేదు. ఊళ్ళె అన్ని మందలల్ల ఉన్న తగర్లను ఒక్క తన్నుకే గెలవాలే అని దినాం మంద తావు చేరంగనే దానికి బియ్యం దాన పెడుతున్న. తరువాత మందల అదే ఇత్తనం పోతు. నిన్ననే డెక్క పురసత్గ తొలిచి వేడి నీళ్ళతోని కడిగి జీడిగింజ కాల్చి పెట్టిన. ఇయ్యాల జర నయంగానే నడుస్తుంది. నాకూ ఈ వైద్యం అంతా నేర్పింది మా తాత డా||యలమంచి. ఆయన ఈ డాక్టరేటు సదివి పైసలు పెట్టి కొనుకున్నది కాదు. ఊరి జనం ఆయన సేవలకు మెచ్చి ఇచ్చిన గౌరవం. మా తాత చెయ్యి పడితే ఏ మాయరోగమైన అట్లనే నయమయ్యదే. సుట్టూ ఏడూర్లపొంటి జనం మా తాత వైద్యం కొరకొద్దురు.
మా అవ్వ పొద్దుగాల ఎనిమిది గంట్లకే నాకు సద్ది పెట్టి దొరోని పొలంల నాటెయ్య పోయింది. మా నాయిన ఆయితారం వస్తే మల్లన్న పట్నాలేస్తడు. ఇగ జీవాలు తోల్కపోవుడు ఇయ్యాల నావంతే. రాత్రి ఎప్పుడు ఈనిందో బొల్లి కొదమ. పిల్లకు మరగలేదు. మా నాయిన పిల్లను తల్లి పొదిల ఏసి పోయిండు. పిల్లకు పాలు పట్టిచ్చి తల్లిని బయట ఏసిన. ఇంకో నాలుగు లేపిల్లలు ఉంటె పొదిలేసిన. పొది సుట్టు బరువులు పెట్టకపోతె మొన్ననే కుక్కలు ఆరు పిల్లలని పలగ చీరినరు. ఒక్క పాణమన్న దక్కలేదు. ఆరోజు మందల తల్లిగొర్లు నీను సద్దియిప్పే యాల్లనుండే ఊరి మొఖం పట్టినరు. ఒకటే అరుపులు. ఒక్క గడ్డి పోసైన ముట్టలేదు. కన్న పిల్లల పాణం తండ్లాడుతుంటే తల్లి కడుపుల పెగులు కదిలినట్టున్నరు. సందకాడ మందకొచ్చిన తల్లిగొర్లు అరుసుకుంట చచ్చిపోయిన పిల్లల పొది సుట్టు తిరుగుతుంటే నన్నూ, ఆ దేవున్ని ఎన్ని శాపాలు పెడుతున్నయో అనిపిచ్చింది. రెండు దినాలు బడికి పోయిన, ఆటలాడిన, బువ్వ తిన్న కండ్లల్ల నా లేపిల్లలే కనపడ్డరు. ఆ కుక్కల్ని నీను మా నాయిన పొడిచి సంపుతుంటే ఊరి జనమంత ఈ గొల్లోల్ల పోరనికి ఏ నాశనగాలం దాపురమైందో ఇట్ల సంపుతుండు అని దుమ్మెత్తి పోసిండ్రు. ఒకందుకు నాకు బాదనే. నోరు లేని జీవుల సంపుడంటే చేతులు ఊకనే రావు. కాని ఆ కుక్కలు నా లేపిల్లలని పట్టి చీల్చుకు తింటుంటే అవి ఎంత గోస పడ్డయో. మా గొల్ల బోయడు వచ్చి అడ్డంపడతడేమో అని అరిచి అరిచి ఏ దేవునికి ఎన్ని మొక్కులు పెట్టుకున్నయో. వాటి తల్లులే ఆ పిల్లల దగ్గర ఉండి ఉంటే ఆ ఊరి కుక్కల్ని దగ్గరకు రానిచ్చేవా.. పిల్లలను ముట్టనిచ్చేవా!
ఊరి మందలన్ని ఒకదాని ఎనుక ఒకటి బాట పడుతున్నరు. చేతుల దుడ్డుగర్ర, బుజాన గొంగడి, సంకకు సద్ది, కీలు కత్తి, నీళ్ళ తిత్తి, తోలు చెప్పుల యలమందనై పోతన్న మందెంట. వందల జీవాల ముందు నీను పోతుంటే ఎలిగేటి నా మొఖం చూసి పొడిసే పొద్దే ఈర్ష్య పడ్డది. ఇరవై ఎకరాల ప్రతాపరెడ్డి దొర బీడుభూమి మేతకు కౌలు పట్టినం కొమరయ్య మావ, మీము. మావ గొర్లు ముందే పోయినట్టున్నరు. పొద్దెక్కితె అత్త ఊకోదు. రోజు పోయే బాటనే! ఎందుకో ఇయ్యాల కొత్తగ కొడుతుంది. ముందు నడిసే నన్ను తొక్కుకొని పోయే జీవాలు ఇయ్యాల ఎనుకెనకనే మడుగులు తొక్కుతున్నరు. ముచ్చపోతు పిల్ల కల తప్పింది. మంద బెదురుకుంట బెదురుకుంటనే బీడు చేరింది. ఆయితారం అంగడి పోయే జీవాలు బీడు పక్కపొంటే పోతున్నరు. నడిబీట్లే నల్లగుండు మీద కుసోని కొమరయ్య మావ జకుముక కొడతుండు. ఊళ్ళే అప్పులోల్లతోని నెగులుడు అయితలేదు. ‘చిన్న దొరకు కట్టె రకం అట్టనే ఉండే. ఈ బీడుకు ఇప్పుడు కట్టకపోతె ప్రతాపరెడ్డి దొర ఊకుంటడా’ అని దగ్గరికొస్తున్న నన్ను చూసుకుంట వినపడేటట్టే గులుగుతున్నడు కొమరయ్య మావ. ‘మా ఇవరం గల్ల ఇంటిది అత్తె అంగడికన్న పోయి ఇరవై జీవాలు అయినా బేరం పెట్టాలి అనుకున్న. పొద్దు నడినెత్తికొచ్చిన మా ఇంటిది ఇంకా రాకపాయే’ అని పీల్చిన సుట్ట పొగ వదులుకుంట మల్లోసారి గులిగిండు. ‘ఏరా మల్లిగా ఏమన్న సదువుతన్నవా మీ అయ్య మూగజివాల పొంటే పెట్టిండా నిన్ను’ అనుకుంట అప్పుడే అక్కడికి వచ్చిండు ప్రతాపరెడ్డి దొరోడు.
‘చీశీష ఱ aఎ ర్‌బసyఱఅస్త్ర 8్‌ష్ట్ర షశ్రీaరర’ అని గట్టిగనే చెప్పిన పతాపరెడ్డికి. నీను ఇంగిలీసుల చెప్పింది విని వెయ్యి దీపాంతల వెలుగొచ్చింది మా కొమరయ్య మావ మొఖంల. మావకు బిడ్డ పుట్టినప్పుడే నాకు లగ్గం కట్టాలని పేరు పెట్టుకున్నడు. అప్పటికే మా అత్త కేతమ్మ మంద చేరచ్చింది. ఇగ మందను అంగడి మొఖాన మల్పిండ్రు. ఎందుకో ఎర్రజాల పిల్ల రెండు దమ్ముల మావ మందలకు ఉరికింది నన్ను కూడ రమ్మనట్టుగా. పోనుపోను మావ జీవాలు దూరమైనరు. ఎర్రగ మండే సూరున్ని నలమబ్బులు మింగినరు. ముసురు అలుముకున్నది. ఎవరో కూడగొట్టినట్టే జీవాలన్ని చెట్టుకిందికి చేరి తలలు నిక్కబెట్టి సూస్తున్నయి. తోడేళ్ళు లేకున్నా నక్కల భయం ఎక్కువనే ఉన్నది అక్కడ. నా ఒంట్లో ఎన్నడూ లేని అలజడి ఏదో పులుముకున్నది. అదే చెట్టుకింద గొంగడి కొప్పెరి తీసి కింద పరిసి సద్ది మూటిప్పిన. తొక్కు కలిపి కష్టంగ రెండు ముద్దలైన పెట్టలేదు… జీవాలు కదిలినరు. ఊరు బంజరు భూముల వైపు మల్లిపోతున్నరు. మందకు పెద్దతల్లి అనుకున్న ముసలి గొర్రె కనిపిస్తలేదు. అదే నల్లగుండు ఎక్కి కుడి చెయ్యి నుదుట చినుకులకు అడ్డంపెట్టి బీడుభూమి అంత దూరపార చూసిన. ఎక్కన్నో దూరంగ చెట్టుకుంద నిలబడి మూలుగుకుంట కనపడ్డది తల్లిగొర్రె. అప్పుడే బొంతు కొదమకు పుట్టిన పిల్లను సంకన పెట్టుకొని ఉరికిన గొర్రె దగ్గరికి. అది అసలు నడిసేటట్టు లేదు. నెట్టిన కొట్టిన కదలట్లేదు. పద్నాలుగేండ్ల నీను ఎత్తుకొని పోదామన్న ఆలోచన కూడ చేయలేకున్న. జీవి ఉండంగనే వదిలిపెట్టి పోతె నక్కలు ముక్కలు చేస్తరు. కండ్లు మూసుకోని బీరప్పని తల్సిన గొంగడి జోల చేసి పిల్లని జోలలేసి. అమాంతం పెద్దగొర్రెను భుజానికెత్తుకున్న. భుజంమీద ముందుకంటే గొర్రె వెనుకకాళ్ళు, వెనుకకంటే గొర్రె ముందుకాళ్ళు భూమిని తాకుతున్నరు. వర్రెలు, వాగులు పొంగేట్టట్టు ఆనకొడుతుంది. జివాలు బంజరు దాటుతున్నరు.
పొద్దు కడుపుల పడ్డది. మందని ఊరు మొఖాన మలిపిన. గొంగడిలో పసిపిల్ల, భుజాన గొర్రెను ఎత్తుకోని మందతోని నడవలేక పోతన్న. జోరు వానల లేపిల్లల తల్లులు ముందు ఉరుకుతున్నరు. అయినా మంద ఎందుకో ఇయ్యాల నన్ను వదిలిపెట్టి పోతలేదు. జాలపిల్ల నా చుట్టే తిరుగుతుంది. ముచ్చ పోతు తిరిగి తిరిగి నన్నే చూస్తుంది. మబ్బులు ఇడుస్తలేవు. ఇరాం లేకుండ వాన కొడుతుంది. జీవాలను ఊరి చివర మైసమ్మగడ్డకు ఆపిన. అప్పుడే అంగడికిపోయి తిరిగొస్తున్నడు కొమరయ్య మావ. మా నాయినకి చెప్పమని దూరం నుండే కూతేసిన. బొంతు కొదమ పిల్లకు గొంగడి కొప్పెరేసిన. పెద్దగొర్రె పాణం లేనట్టుగానే పడి ఉన్నది. మెరుపు మెరిసినప్పుడే మంద ఒక దగ్గర ఉన్నట్టు కనపడుతుంది. లేపిల్లల తల్లుల అరుపులు మాత్రమే వినపడుతున్నయి. ఆ అలికిడి వింటూనే చూట్టూ తిరుగుకుంటా మా నాయిన లేపిల్లలని పట్టుకొస్తడని ఊరి బాటకు సూస్తున్న.తల్లిగొర్రె ఇగ లేవదన్న బాద గుండెల్ని పిండుతుంది. నాలో, మందలో ఏదో తెలవని అలజడి. ఒకేసారి ఆన పురివిప్పింది. నల్లమబ్బులు ఎరుపెక్కుతున్నరు. దూరంగ ఉన్న మంద నా సుట్టు చేరింది. లేపిల్లల తల్లులతోపాటు జీవాలన్ని అరుసుడు మొదలు పెట్టినరు. అంతటి వర్షానికి కూడ నా శరీరానికి స్పర్శ తెలుస్తలేదు.
ఏదేమైనా బొంతు కొదమ పిల్లకు పాలు పట్టిచ్చిన. భయంభయంగనే గొంగడి కొప్పెర ఏసుకోని రెండు చేతులు దుడ్డుకర్ర మీద పెట్టి నిలబడ్డ. ఈ వానలప్పుడు చెట్లకింద ఉండొద్దని నాకు తెలుసు. నా సూపులన్ని ఊరి బాటకెయ్యే ఉన్నయి. నాకు కొద్ది దూరంలో తాడి చెట్టుంది. అటాత్తున చెట్టుమీద ఓ మెరుపు కనపడ్డది. నా పాణం అల్కగ అయింది. కండ్లు మూతలుపడ్డరు. అట్లనే కింద పడుతున్న. అది నాకు తెలుస్తున్నది. ఇగ నీను లేవనని కూడ మనుసున పడ్డది. ఒకేసారి నా వందేండ్ల జీవితం మదిల తిరిగింది. పొద్దన్నుంచి చేసిన ప్రకతి ఎచ్చరికలు, జీవాల మూగసైగలు అన్నీ ఏర్పడ్డయి. మా చెల్లె, మా అవ్వ కండ్లల్ల మెదిలిండ్రు. చివరగ మా నాయినా… ఆయిన మల్లన్న పట్నంల ఏసే బండారి కనపడ్డది. చేతులున్న దుడ్డుగర్ర అట్లనే పట్టుకోని నేలకొరిగిన. కింద పడంగనే నా తలకింద ఎదో మెత్తగా, ఎత్తుగ తగిలింది. బహుశా అది నా తల్లిగొర్రే కావచ్చు.
నూకల మధు యాదవ్, 6303343359