Sunday, December 14, 2025
E-PAPER
Homeప్రత్యేకంతెలుగుతనానికి వన్నెలద్దిన కొంటె బొమ్మల బాపు

తెలుగుతనానికి వన్నెలద్దిన కొంటె బొమ్మల బాపు

- Advertisement -

తెలుగుతనానికి వన్నెలద్ది.. తన కొంటె బొమ్మలతో తెలుగు సంస్కతిలో భాగమైన చిత్రకారుడాయన. ప్రత్యేక శైలితో బొమ్మలు గీయడంలో తనకంటూ ఇమేజ్‌ను సాధించుకున్నారు. ఆయనే తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజాశాలి బాపు. చిత్రకారుడిగా, సినీ దర్శకుడిగా, తెలుగు రచయితగా, కార్టూనిస్ట్‌గా గుర్తింపు పొందిన బాపు.. గీత, రాత, తెలుగువారి సంస్కతిలో భాగమయ్యాయి. ఆయన గీసిన బొమ్మలు ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖ చిత్రాలూ లెక్కకు మించి ఉంటాయి. ఈ నెల 15న ఆయన 92వ జయంతి సందర్భంగా బాపు జ్ఞాపకాలు కొన్ని మీకోసం..

బాపు 1933లో డిసెంబరు 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లా పట్టా పుచ్చుకున్నారు. అదే ఏడాది ఆంధ్ర పత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు.

కార్టూన్‌ రంగం
కార్టూన్‌ రంగంలో బాపు ముట్టుకోని అంశం గానీ, చూడని కోణం గానీ లేదు. బాపు ఎవరితోనైనా మాట్లాడుతుంటే వారు అడిగిన ప్రశ్నకి రెండు మూడు భావాలు జవాబులుగా పుట్టుకొస్తాయి. వాటిని అణచుకొని అవసరమైన ఒక్క భావాన్నే పైకి ప్రకటించేవారు. మిగిలిన రెండూ వెటకారమో చమత్కారమో అయి ఉంటాయి. అంత స్పాంటేనియస్‌గా జోకులు ఆయనకి బుర్రలో ఎలా తట్టేస్తుంటాయో ఆశ్చర్యం. బాపు ఒకసారి వేసిన బొమ్మ నచ్చక మళ్లీ మళ్లీ వేస్తుంటారు. వేగంగా వచ్చే గీతని కూడా శ్రద్ధగా జారవిడుస్తారు. బొమ్మంతా అద్భుతంగా పూర్తి చేసినా అసంతప్తిగా ‘ఇంతకన్నా రాదు’ అని కాంప్రమైజ్‌ అవుతారు. అలా ‘బుడుగు’ ప్రతి ఎడిషన్‌కి బొమ్మలు మారుస్తూ మూడు నాలుగుసార్లు వేశారు. బాపుగారు బ్రష్‌ని ఎంత అందంగా నడిపిస్తారో కలంతో కూడా అంత కళనీ కురిపిస్తారు. అడిగినవారికి బొమ్మ వేసి పోస్ట్‌ చేసేసినా మర్నాడు మరో బొమ్మ వేసి ‘నిన్న వేసిన బొమ్మ బాగోలేదు ఇది వేసుకోండి’ అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

చిత్రకళ
బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితంకాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా వేశాడు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ – అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్‌ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు. బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్‌) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.

బాపు కొతకాలం జె.వాల్టర్‌ థామ్సన్‌ సంస్థలోనూ, ఎఫిషియెంట్‌ పబ్లికేషన్స్‌లోనూ, ఎఫ్‌.డి. స్టీవార్ట్స్‌ సంస్థలోనూ పనిచేశాడు. ఆయన కషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణ రూపొందించిన ‘బుడుగు’ పుస్తకం ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి. ఆంధ్ర పత్రిక రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తుల పేర నిర్వహించిన శీర్షికకు రేఖా చిత్రాలను బాపునే గీసారు. మరో పత్రిక బాపు గీసిన బొమ్మకు కథను రాసే పోటీని నిర్వహించింది. 1974లో ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలో పిల్లల కోసం రామాయణాన్ని తనదైన శైలిలో బొమ్మలతో చెప్పారు. దీనికి కొనసాగింపుగా మహాభారతంను, శ్రీకష్ట్ణలీలలను కూడా తయారు చేసారు.

‘హై నూన్‌’ తో సినీరంగంలోకి..
50వ దశకంలో బాపు రమణతో కలిసి రోజూ సినిమాలు చూసేవారు. తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, మైళ్ల కొద్దీ నడుస్తూ ఇల్లు చేరేలోగా ఆ సినిమాల్లో ఎన్ని తప్పులునాయో వెదికేవాళ్ళు. ‘మనమే సినిమా తీస్తే’ అనే ఆలోచనలు వచ్చేవి. ఆ ఆలోచనలకు కథలల్లి, బొమ్మలతో స్కీన్ర్‌ ప్లే రాసేవాళ్ళు. 1952లో ‘హై నూన్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమా వచ్చింది. ఆ చిత్ర ప్రభావంతో రమణ.. 1959 ప్రాంతంలో ఆంధ్రపత్రికలో ‘సాక్షి’ అనే కథను రాశారు. ఆ కథనే మరికొన్ని మార్పులతో సినిమాగా తీస్తే బాగుంటుందని ప్రయత్నించారు. కష్ణ హీరోగా రెండులక్షలు పెట్టుబడితో పాతికరోజుల్లో ఒకటే షెడ్యూలుతో పూర్తి అవుట్‌ డోర్‌లో సినిమా నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మాత శ్రీనివాసరావుకు చెపితే, ఆయన ఇది నమ్మశక్యంలేదు. కానీ బాపు, రమణలు కష్ణార్జునులు కదా. వారికి సాధ్యం కానిదంటూ ఉండదని ఓకే చెప్పారట. సమాజంలో వేళ్లూనిన అరాచకాలను, అన్యాయాలను అణచివేసే నేపథ్యంతో గ్రామీణ వాతావరణంలో 1967లో ‘సాక్షి’ సినిమా నిర్మాణం చేసి పాతిక రోజుల్లో తొలి కాపీ తీసుకొచ్చి తమ సత్తాను చాటారు. అలా ‘సాక్షి’ నామ సంవత్సరానికి బాపు,రమణలు బాటలు వేశారు. అలా గంటన్నరలో జరిగే ఒక కథను సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు చూపాలని బాపు చేసిన ప్రయోగమే ‘సాక్షి’. దర్శకత్వ శాఖలో ఎలాంటి అనుభవం లేకున్నా దర్శకుడిగా మొదటి సినిమాతోనే సక్సెస్‌ అందుకున్నారు.

ఇది బాపు సినిమా..
1969లో బాపు-రమణలు భారీ తారాగణంతో ‘బుద్ధిమంతుడు’ సినిమా తీశారు. కథ విన్నాక అక్కినేని రెండు పాత్రల్నీ తనే వేస్తానన్నారు. అక్కినేని నటిస్తున్నారని తెలిసి రమణకు భానుమతి కబురంపింది. కథ విని మైమరచి తనుకూడా అందులో నటిస్తానంది. నిజానికి విజయనిర్మలను అక్కినేనికి జంటగా అనుకున్నారు బాపు-రమణలిద్దరూ. అదే విషయాన్ని భానుమతికి చెబితే, ఏదో ఒక చిన్న వేషమైనా ఇమ్మంది. అందులో గుమ్మడి నటించిన స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేషాన్ని రమణ ఆఫర్‌ చేయగా.., ‘ఈ సినిమాలో పాటలెన్ని’ అని అడిగింది భానుమతి. ‘ఎనిమిది’ అని చెప్పారు రమణ. అందులో తనకెన్నని అడిగితే, ‘నిల్‌’ అని సమాధానమిచ్చారు రమణ. ‘కనీసం స్కూలు పిల్లని ఉత్సాహపరుస్తూ పాడేలా ఒక పాటైనా పెట్టండి’ అని భానుమతి అడిగింది. అంతా ఫిక్సయిపోయింది, కుదరదని రమణ చెప్పారు. ఆ మాటకు భానుమతి కోపంతో ఊగిపోతూ ‘షూటింగు చేయకుండానే అంతా ఫిక్సై పోయిందా, ఇదేమన్నా కె.వి.రెడ్డి సినిమానా’ అంటూ దెప్పిపొడిచింది. అందుకు సమాధానంగా ‘ఇది బాపు గారి సినిమా’ అని కూల్‌గా చెప్పి బయటికొచ్చేశారు. ఈ ఒక్క సంఘటన చాలు బాపు గొప్పతనం చెప్పడానికి.

తెరమీద రంగుల కలబోత
కుంచేతోనే కాదు సెల్యులాయిడ్‌ మీద రంగులు ముంచి అందాలను ఆవిష్కరింపజేసిన బాపు సంచిలో ఎన్ని ఆణిముత్యాలున్నాయో లెక్క పెట్టడం అసాధ్యం. 1976లో పింజల సుబ్బారావు బాపుతో తీసిన ‘సీతా కల్యాణం’ ఓ కళాఖండం. బాపు దర్శకత్వంలో వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఇది ఒకటి. 1976లోనే మరొక కళాఖండం ప్రదర్శనకు నోచుకుంది. అదే ‘భక్త కన్నప్ప’. వాణిశ్రీ బాపుతో పని చెయ్యడం మొదటిసారి. భారత కథను సోషలైజ్‌ చేసి జయకష్ణ నిర్మాతగా బాపు నిర్మించిన ‘మనవూరి పాండవులు’ మరో కొత్త కోణాన్ని చూపించింది. కష్ణంరాజు పాత్ర గొప్పగా అమరింది. అంతేకాదు చిరంజీవి, భానుచందర్‌ వంటి వర్ధమాన నటుల ఎదుగుదలకు సోపానమైంది. ఇక ‘గోరంత దీపం’ విషయానికొస్తే, వాణిశ్రీ మేకప్‌ లేకుండా నటించటం బాపు గొప్పతనం. బాపుకు గజల్స్‌ అంటే ఇష్టం. నిమిషంలోపు వ్యవధి వుండే కవితల్ని గజల్స్‌గా మలిచి పి.బి.శ్రీనివాస్‌ తియ్యనిగొంతులో వినిపింపజేసిన ఘనత బాపూదే. రాజమండ్రి పరిసరాల్లోనే తీసిన మరో చిత్రం ‘తూర్పు వెళ్ళే రైలు’లో బాలు చేత సంగీత దర్శకత్వం నిర్వహింపజేసారు. పాటలన్నీ అద్భుతంగా వుంటాయి. మధ్యలో మరికొన్ని బాపు సినిమాలు వచ్చినా, ‘పెళ్లిపుస్తకం’ సినిమా వచ్చి బాపు పనితనాన్ని మరోసారి ఎలుగెత్తి చూపింది. 1991లో బాపు ‘మిస్టర్‌ పెళ్లాం’ తీశారు. ఉత్తమ చిత్రంగా నంది బహుమతి వచ్చింది. పిల్లల కోసం వీడియో పాఠాలు రూపొందించారు ఇద్దరూ. అందుకే బాపును గురించి రాయాలంటే రమణ గురించి చెప్పాల్సి వుంటుంది. రమణ గురించి రాయాలంటే బాపు ప్రస్తావన లేకుండా అది అసమగ్ర రచన అవుతుంది. బాపు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ముత్యాల ముగ్గు’. ఈ సినిమా ఒక అణిముత్యం. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. బాపు మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆయన తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా (స్టోరీబోర్డు) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కించేవాడు. ఈ విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటాడో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించేవాడు.

బాలీవుడ్‌లో
బాపు తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా సత్తా చాటారు.. ‘ప్యార్‌ కా సింధూర్‌, దిల్‌ జలా, మేరా దరమ్‌, ప్యారీ బేహన, బేజుబాన్‌’ లాంటి సినిమాలు తీసి హిందీ ప్రేక్షకులను అకట్టుకున్నారు. బాలీవుడ్‌లో తన కంటూ స్థానం సంపాదించుకున్నారు.

భక్తి రస చిత్రాలు
సాంఘిక చిత్రాలే కాకుండా భక్తి రస చిత్రాలనూ తీసి ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు. ‘భక్త కన్నప్ప’, ‘సీతా కళ్యాణం’, ‘సంపూర్ణ రామయణం’, ‘శ్రీ రామాంజనేయ యుద్దం’ , ‘శ్రీ రామ రాజ్యం’ లాంటి సినిమాలు ఆ కోవలోనివే. ‘శ్రీ రామ రాజ్యం’ సినిమా బాపు చేసిన చివరి చిత్రం. వెండితెర అద్భుతాలతో పాటు స్మాల్‌ స్క్రీన్‌ మీదా అద్భుతాలు చేశారు బాపు. భాగవతం ధారావాహికతో ఇంటింటికీ చేరుకున్నారు. ప్రతిఒక్కరికీ దగ్గరయ్యారు. తెలుగుబొమ్మకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సౌమ్యత్వం, పసితనపు చాయలు పోని చిరునవ్వు, నిబద్దత, ఆప్యాయ పలకరింపు ఆయన నైజాలు. 2014 ఆగస్ట్‌ 31న బాపు మనందరినీ వదిలి వెళ్లారు. బాపు భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన వేసిన బొమ్మలో, సినిమాలో, ఆయన చేసిన ప్రతి పనిలోనూ మనతో ఉంటారు.

పురస్కారాలు
బాపును ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌ పురస్కారం, రాష్ట ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులతో పాటు ‘కళా ప్రపూర్ణ, పద్మశ్రీ’ లాంటి ఎన్నో అవార్డులు ఆయన కళకు దాసోహమన్నాయి. బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి. ఆయన తీసిన ‘సీతాకళ్యాణం’ సినిమా లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

బాపు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్‌ గురించి, హీరోయిన్‌ను బాపు చూపించినంత అందంగా, పద్ధతిగా, విభిన్నంగా మరే దర్శకుడు చూపించలేదు. తెలుగు తనం ఉట్టిపడుతు, ఆకట్టుకునే హవాభావాలతో, వాలుజడతో, ప్రేక్షకులను కట్టి పాడేస్తుంది బాపు హీరోయిన్‌. బాపు హిరోయిన్స్‌ కేవలం అందగత్తెలే కాదు గడుసైసవారు, తెలివైన వారు కూడా. బాపు సినిమా అనగానే హీరోయిన్‌ ఎవరా అని చూస్తారు ప్రేక్షకులు. అందుకే బాపు సినిమాలో నటించడానికి ఇండిస్టీలోని ప్రతీ హీరోయిన్‌ తహతహలాడేది.

బాపు గురించి చెప్పుకునేటప్పుడు తప్పకుండా గుర్తు చెసుకోవాల్సిన పేరు ముళ్ళ పూడి వెంకట రమణది. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సాక్షి’ సినిమా నుండి బాపు సినిమాలకు రచయితగా పని చేసారు రమణ. తెలుగుతనం చూడాలంటే బాపు, తెలుగు వినాలంటే ముళ్ళపూడి వెంకటరమణ అని వీరిద్దరూ పేరుపడ్డారు. అంతేకాదు బాపు ఇంటి పేరు రమణ, రమణ ఇంటి పేరు బాపు అనేంతగా వీరిద్దరి బందం ముడిపడిపోయింది. ముళ్ళపూడి రచించిన బుడుగుకు తన బొమ్మలతో సోగసులద్దారు బాపు…

తెలుగు సినీ పరిశ్రమలో కుంచెతో బొమ్మలు వేసి.. వాటి ఆధారంగా అద్భుతమైన చిత్రాలు తీసి.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు బాపు. చిత్రకారులెవరైనా కుంచెతో బొమ్మలు వేస్తారు. కానీ ఆయన అదే కుంచెతో వెండితెరపై బొమ్మలు గీశారు. ఆ బొమ్మలన్నీ కదిలి ఒయ్యారాలు పోయి, గిలిగింతలు పెట్టి ప్రేక్షకుల గుండెల్లో అపురూప చిత్రాలుగా కొలువుండిపోయాయి. అందుకే ఆయన చలన ‘చిత్ర’కారుడు!

అందమైన అమ్మాయికి మారుపేరు ‘బాపు బొమ్మ’. బాపు రమణతో కలిసి సష్టించిన ”బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ…” వీరంతా గుర్తుకు వస్తే మనసు ఎంతగా నవ్వుకుంటుందో! ఆరుద్ర అందుకే అన్నారు… ‘కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గుండె ఊయల లూపు, ఓ కూనలమ్మా’ అని. సష్టిలో తీయనిది స్నేహమే అంటే స్నేహం మధురమైనదని అర్థం… అంతేకాని తీయలేక పోయినదని మాత్రం కాదని భాష్యం చెప్పిన ముళ్ళపూడి వెంకట రమణ ఆయన చెలికాడు. బాపు-రమణలవి అవిభాజ్య శరీరాలు. ఒకరిది లేఖాచిత్రమైతే, మరొకరిది రేఖాచిత్రం. రెండూ కలిస్తే మనోహర చిత్రం. అదే చలనచిత్రం.

– డా. పొన్నం రవిచంద్ర, సీనియర్‌ జర్నలిస్టు, సినీ విమర్శకులు
9440077499

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -