Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం

తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం

- Advertisement -

రాష్ట్ర బంద్‌తో చరిత్ర సృష్టించాలి : పలువురు వక్తలు
బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి బీసీ మహా ర్యాలీ

నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించే వరకు బీసీల పోరాటం ఆగదని, తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం కొనసాగిస్తామని పలువురు వక్తలు స్పష్టం చేశారు. శనివారం(నేడు) బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర బంద్‌లో సబ్బండ సామాజిక తరగతు లంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ లోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ హిమాయత్‌ నగర్‌ లిబర్టీలోని డా.బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వరకు సాగింది. ఈ ర్యాలీకి బీసీ జేఏసీ చైర్మెన్‌ ఆర్‌.కృష్ణయ్య, వర్కింగ్‌ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌ చైర్మెన్‌ విజిఆర్‌.నారగోని, కో-చైర్మెన్‌ దాసు సురేశ్‌, రాజారాం యాదవ్‌ నేతృత్వం వహించారు. టీజేఎస్‌ అధ్య క్షులు, ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షులు సంజీవ నాయక్‌, ఆమ్‌ఆద్మీ రాష్ట్ర కన్వీ నర్‌ డా.దిడ్డి సుధాకర్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. శనివారం వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూసివేసి బీసీ బంద్‌కు సహకరించాలని కోరారు. ఎం.కోదండరామ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామికమైన డిమాండ్‌ కోసం బీసీలు చేపట్టే రాష్ట్ర బంద్‌కు తెలంగాణ సమాజం సహక రించాలని, సామాజిక న్యాయానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే, డీప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా బీసీల హక్కుల సాధన కోసం ఏకమై పోరాడే సమయం ఆసన్నమైందని, ఈ రాష్ట్ర బంద్‌ ద్వారా బీసీల ఐక్యతను నిరూపించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. బీసీ సమాజానికి అండగా యావత్‌ దళిత, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ ప్రజలు అండగా ఉండాలని, అందరూ ఒకటేనని, రాష్ట్ర బంద్‌లో పాల్గొని బహుజన రాజకీయ చైతన్యాన్ని నిరూపించాలని కోరారు.

జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలందరూ బీసీ రిజర్వేషన్ల బంద్‌కు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు దక్కాలంటే ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడూ అవకాశం రాదని, బీసీలందర్నీ కలుపుకొని శాంతియుతంగా బంద్‌ను విజయవంతం చేసి తమ గళాన్ని బలంగా వినిపించాలని కోరారు. విజిఆర్‌ నారగోని మాట్లాడుతూ.. ఈ బంద్‌ సెగ ఢిల్లీ పెద్దలకు తగిలేలా విజయవంతం చేయాలని కోరారు. దాసు సురేష్‌ మాట్లాడుతూ.. జనాభాలో అధిక భాగం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఒక్కటై రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని, ఈ ఐక్యత భవిష్యత్‌లో బహుజన రాజ్యాధికారానికి బాటలు వేస్తుందని అన్నారు. రాజారాం యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ కో-ఆర్డినేటర్‌ గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌ సంఘని మల్లేశ్వర్‌, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్‌ కుందారం గణేష్‌చారి, బి.మణి మంజరి, కనకాల శ్యామ్‌ కుర్మా, మాల మహానాడు నాయకులు మందల భాస్కర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -