మన చుట్టూ అంతా బాగుందనే అనుకుంటాం… అందరూ మంచి వాళ్లే అనే భావనలో ఉంటాం. అయితే ఒక్కోసారి సమస్యలు చాపకింద నీరులా వచ్చి పడతాయి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. అలా తెలుసుకోకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతాం. మన ముందు మంచిగా నటిస్తూ వెనక గోతులు తవ్వేవారు కొంత మంది ఉంటారు. అలాంటి వారే ఇందుకు కారణం. అంతెందుకు మన ప్రాణ స్నేహితులు అనుకునే వారే మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల గుర్తించి జాగ్రత్త పడకపోతే సమస్యలు తప్పవు.
స్నేహమంటే ఓ నమ్మకం. అందుకే మన విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా మన ప్రాణ స్నేహితులతో పంచుకుంటాం. కష్టాలొస్తే చెప్పుకుంటాం. దీని వల్ల మన మనసుకు కాస్త ఊరట కలుగుతుందని భావిస్తాం. అయితే మనకు తెలియకుండా మన గురించి నలుగురికీ చెడుగా చెప్పే స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు మోసగాళ్లని తెలిసిన తర్వాత సాధ్యమైనంత వరకు వాళ్లను దూరం పెట్టడమే మంచిది. మరీ ముఖ్యంగా వాళ్లతో పంచుకునే విషయాలను తగ్గించడం ఉత్తమం. ఒకవేళ మన ఆఫీస్ కొలీగ్స్ ఇలా చేస్తున్నారనుకుంటే వాళ్లతో పనికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో మన వ్యక్తిగత విషయాలు పంచుకోకూడదు. పని ప్రదేశంలో వారితో ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే మన ప్రైవసీని మనం కాపాడుకున్న వారవుతాం. తద్వారా మన గురించి నలుగురితో చెడుగా చెప్పే అవకాశం వారికి ఉండదు.
నిజం చెప్పాలంటే చిన్న చిన్న అపార్థాలే అప్పుడప్పుడూ అనుబంధాలను దెబ్బతీస్తాయి. అందుకే వాటిలో నిజమెంతో తెలుసుకున్నాకే ఎదుటి వారి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉదాహరణకు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకరు మీకూ, మీ ప్రాణ స్నేహితురాలికి మధ్య అనుబంధాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారనుకోండి. మీ గురించి వారికి, వారి గురించి మీకు చెడుగా చెప్పారనుకోండి. అలాంటప్పుడు క్షణికావేశంలో కోపంతో వాళ్ల దగ్గరికెళ్లి నిలదీయడం, కోప్పడడం వంటివి చేస్తే మీ స్నేహానికే ముప్పు వాటిల్లుతుంది. మీరు ఇలా చేయడం వల్ల మీ మధ్య సమస్య సృష్టించిన వారు మీ వెనక ఎంతో సంతోష పడతారు. అదే మీరు ఒక్క క్షణం ఆలోచించి ఇందులో నిజమెంతో తెలుసుకోవడానికి మీ ప్రాణ స్నేహితురాలితో మాట్లాడితే తప్పెవరిదో అర్థమైపోతుంది. దీని వల్ల మీ వెనక గోతులు తవ్వాలనుకునే వారి స్వభావమేంటో ఇతర స్నేహితులందరికీ అర్థమవుతుంది. దీనివల్ల వాళ్లూ అలాంటి వారితో ఇకపై జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
మనమంటే గిట్టని వారు, మన వెనక గోతులు తవ్వే వారు సృష్టించే వదంతుల వల్ల మానసికంగా ఎంతో బాధ కలుగుతుంది. కొంత మంది వాటిని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేక ఒత్తిడి, డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదమూ లేకపోలేదు. మీ జీవితంలో అలా జరగకుండా ఉండాలంటే అలాంటి విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండండి. మీకు నచ్చిన వారికి మాత్రమే దగ్గరవడం మంచిది. మీ బాధను దూరం చేసి పాజిటివిటీని దగ్గర చేసే వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే ఆ నెగెటివిటీ నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. దీనికోసం అవసరమైతే నిపుణుల సలహాలు, సైకాలజిస్టుల వద్ద కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.
వారితో జాగ్రత్త
- Advertisement -
- Advertisement -