డీఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు
తాడ్వాయి పి హెచ్ సి వైద్యాధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ – తాడ్వాయి
వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా వైద్యాధికారి (డిఎం అండ్ హెచ్ ఓ) గోపాల్ రావు అన్నారు. సోమవారం ఏటూర్ నాగారం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కోరం క్రాంతి కుమార్ తో కలిసి, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారులు సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ యాక్షన్ టీం ను ఏర్పాటు చేసుకోవాలని, గుత్తి కోయగూడాలలో ఫీవర్ సర్వే, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు.
అంతేకాకుండా వైద్యాధికారులు సిబ్బంది, సమయపాలన పాటించి వైద్యానికి వచ్చే రోగులకు అన్ని ఆరోగ్య పరీక్షలు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు వారానికి రెండు రోజులు వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ఇంటింటి సర్వేను నిర్వహించి, నీటి నిల్వల పై మూతలు పెట్టుకోవాలని, వారానికి ఒకసారి కంటైనర్లలోని నీటిని తొలగించి శుభ్రపరుచుకోవాలని శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని, తప్పనిసరిగా దోమతెరలు వాడాలని మొదలగు విషయాలపై గుత్తి కోయగూడాలలో ఇతర గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. జ్వరం వచ్చినచో ఆరోగ్య కార్యకర్త లేదా ఆశా కార్యకర్త జ్వరానికి సంబంధించిన మందులను ఇవ్వాలని ఒకటి రెండు రోజులలో తక్కువ కాకపోయినాచో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలని సూచించారు.
ప్రతి గర్భిణీ స్త్రీ ని మొదటి రెండు పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పరీక్షించాలని, మండలంలోని అన్ని హాస్టల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ ఉన్న గడ్డి మొక్కలను తొలగించి, ఆరోగ్య కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఎటునాగారం డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ క్రాంతి కుమార్, కీటక జనతా నియంత్రణ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్, ఐటిడిఏ ఎన్ హెచ్ ఎం మేనేజర్ మహేందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి మరియు ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.