Monday, October 20, 2025
E-PAPER
Homeమానవిఅందమే ఆనందం ఆరోగ్యం!

అందమే ఆనందం ఆరోగ్యం!

- Advertisement -

‘అమ్మాయి అప్సరసలా ఎంతందంగా ఉందో బంగారు వర్చస్సు!’, ‘నవ్వితే పలు వరస తళుక్కుమంది!’, ‘జుట్టు పొడవుగా, వంకీలు తిరిగి మెరిసిపోతూ ఉంది!’ ఎన్నో సార్లు ఇలా వర్ణనలు వినీ, చదివీ, ఊహించుకొని, సినిమాల్లో, మీడియాలో చూసీ.. అలా వారందరూ అన్ని వేళలా నిజంగానే ఆ విధంగానే ఉంటారనుకొని నమ్మేసి, వాళ్లతో పోల్చుకోవడాలు, కుటుంబంలో, స్నేహితుల్లో, ఎవరెవర్నో, మనకన్నా చూడడానికి బాగున్నారని అందరూ అంటున్నారని అనుకోవటమే కాదు, మనం వారిలా లేమని న్యూనతాభావం పెంచేసుకోవడం, ఆ విధంగా ఎన్నటికీ కాలేమని నిస్పృహ చెందటం, అప్పుడప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం అన్నీ చకచకా జరిగిపోయి. వాస్తవాలను గ్రహించే విజ్ఞత కూడా కోల్పోయే పరిస్థితికి చేరుకొంటాం.

అందం కోసం అమాయక యువత బ్యూటీ పార్లర్లకు క్యూలు కట్టేయడమే కాకుండా ఆన్లైన్‌ కాస్మెటిక్స్‌ కొనుగోలు, వాడడం, వాటిలో వారి చర్మానికి అనుకూలం కాని రసాయనాలుండటం వల్లనో, తెలియని కారణాల వల్లనో కోరుకున్న లుక్కు రాదు సరికదా, చర్మం పాడైపోయి, జుట్టు రాలిపోయి అదివరకున్న అందం కూడా పోయి కష్టాల ఊబిలో దిగిపోతుంటారు. ఆర్థికంగానూ ఎంతగానో నష్టపోతుంటారు. సెలిబ్రిటీస్‌ అందరూ చూడడానికి అందంగా ఉన్నారనేది వాస్తవమే కావచ్చు. కానీ అలా లేనందుకు మనపట్ల మనకే చిన్న చూపు మొదలైతే మాత్రం ఎనలేని స్వీయహాని కలిగించుకోవడం ఆరంభమైనట్టే! అందంగా కనిపించాలనే కోరిక ఎవరికి ఉండదు? దీనికి ఆడ మగ తేడాలేవీ ఉండవు. ఇంకా చెప్పాలంటే ఇందులో కూడా పోటీ ఉంటుంది.

అందమంటే ఏమిటి?
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అందంగా కనిపించడం, అందంగా ఉండటం, రెండూ వేరు! ‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం’ అని ఒక కవి అంటారు. ‘బ్యూటీ లైస్‌ ఇన్‌ ది అయిస్‌ అఫ్‌ ది బెహోల్డర్‌ (అందం చూసే వారి కళ్ళల్లో ఉంటుంది)’ అన్నారు ఇంకొక మహాకవి. ఈ రెండు వ్యాఖ్యలని జోడించి, లోతుగా విశ్లేషిస్తే మనసు ఉల్లాసంగా ఉంటే ప్రపంచమంతా అందంగా ఉంటుందని అర్థమౌతుంది. ఆనందం మనిషిలో ఉల్లాసాన్ని తేజస్సుని వృద్ధి చేసే డోపమిన్‌-సిరోటినిన్‌ వంటి పలు హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. తద్వారా ముఖం, శరీరం, హావభావాలు అన్నీ ఆకర్షణీయంగా రూపాంతరం చెందుతాయి. అలా వచ్చే అందం ఎంతో సహజంగా ఉంటుంది.

మంచి ఆలోచనలతో…
మరొక మహాకవి ‘ఏ థింగ్‌ అఫ్‌ బ్యూటీ ఈస్‌ ఏ జారు ఫర్‌ ఎవర్‌(అందమైనది ఏదైనా ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది)’ అంటూ వివరించారు. అందమంటే అంత సహజమైనది, స్వచ్ఛమైనదై ఉండాలి. మానసికంగా మంచి ఆలోచనలతో కూడిన ప్రవృత్తి, ప్రవర్తన ఉన్న వ్యక్తులు అందరికీ నచ్చుతారు. క్రమేణా వారి సాంగత్యంలో ఉన్నవారికి వారు అందంగా కనిపించడం మొదలుపెడతారు. అదే విధంగా చెడు ప్రవర్తన ఉన్నవారెవరైనా సరే ఎంత అందంగా ఉన్నా కొంత కాలానికి వారి పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. వారిలోని చెడు అందర్నీ వారికి దూరం చేస్తుంది. మానసిక ఆనందం ఉన్నవారు ఏ విధమైన బాహ్య సౌందర్య ఉపకరణాలు లేకుండానే ఆకర్షణీయంగా ఉంటారు.

సౌందర్య సాధనాలు హాని చేస్తాయా?
అందంగా కనిపించాలనే తాపత్రయంతో మహిళలు రకరకాల రసాయనాలతో కూడిన క్రీములు, జెల్స్‌, లోషన్స్‌, హెయిర్‌ కాస్మెటిక్స్‌, లిప్‌ మేకప్‌ వగైరా వాడటం, వాటితో వారి సమయం, ధనం వృథా చేసుకోవడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా హాని చేసుకొంటున్నారు. లిప్‌స్టిక్‌ లోని లెడ్‌ అనే మెటల్‌ వాడకం వల్ల హార్మోన్లలో మార్పులు, నరాల, సంతానోత్పత్తి సంబంధిత సమస్యలు కలుగవచ్చునని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. చర్మం సున్నితంగా అవడానికి, వర్చస్సు పెంపొందించడానికి వాడే రసాయనాలు దుర్గంధాలను దూరం చేసి, శరీరం నుండి సౌరభాలు వెదజల్లేట్టు స్ప్రేలు, జుట్టు పెరగడానికి, కాంతివంతమ వ్వడానికి, స్టైలింగ్‌ కొరకు వాడే జెల్స్‌, సుగంధ పూరితమైన రకరకాల నూనెలు, శరీర సౌష్టవం కొరకు రసాయనాలతో మస్సాజులు, ఫేషియల్స్‌ ఇలా విరివిగా ఏవంటే అవి, ప్రకటనల ప్రభావంలో పడి, ఎక్కడంటే అక్కడ, సరైన శిక్షణ పొందని వారితో చేయించుకొని, కష్టాలపాలు అవుతుంటారు.

పలు రకాల సమస్యలు
వీటిల్లో వాడే కెమికల్స్‌ వల్ల స్కిన్‌ రియాక్షన్లు, ఎలర్జీ, ఎర్రబడడం, దురద, వాపు, జుట్టు చిట్లిపోవడం, మొరటుగా అయిపోవడం, రాలిపోవడం, గోళ్లు గరుకుగా మారడం, తెల్ల మచ్చలు రావడం, చర్మం నల్లబడడం లేక పాలిపోవడం వంటివి జరగొచ్చు. కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌ వంటి చర్మ వ్యాధులు, అరుదుగా కాన్సర్‌, కాలేయ, థైరాయిడ్‌, నరాల, కిడ్నీ సంబంధిత వ్యాధులు, పుట్టే బిడ్డకు జన్యు సంబంధ జబ్బులు, జన్మత: లోపాలతో పుట్టడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. లావు, పొట్ట తగ్గడానికి, ముఖ కవళికలు, కను ముక్కు తీరు, శరీరాకృతి మార్పుల కొరకు రకరకాల కాస్మటిక్‌ సర్జరీలు చేయించుకుం టూ ఉంటారు. వాటి వల్ల ఇన్ఫెక్షన్‌, లోతైన మచ్చలు (స్కారింగ్‌), వాపు, రక్తపు గడ్డలు, కాళ్లల్లో, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, నరాలకు నరాలు దెబ్బతినడం, చర్మం కింద నీరు చేరడం వంటి సమస్యలే కాకుండా ఆశించిన ఫలితాలు కనిపించక పోవచ్చు. అరుదుగా సర్జరీ వికటించి, రూపం అందవిహీనంగా కూడా అయిపోవచ్చు.

మరి ఏం చేయాలి?
ముందు మనసును అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. సహజంగా సౌందర్యాన్ని వశం చేసుకొనే సాధనలపై దృష్టి పెట్టాలి. ముఖానికి చిన్న చిరునవ్వు ఎంతో అందాన్ని తెచ్చిపెడు తుంది. చర్మాన్ని యూవీ రేస్‌ నుండి నాణ్యమైన సన్‌స్క్రీన్‌ లోషన్లతో కాపాడు కోవాలి. జుట్టును గాలికి వదిలితే చిట్లిపో తాయి. స్ట్రైటనర్స్‌ వాడకూడదు. ఎప్పటి కప్పుడు దువ్వుకొని చక్కగా క్లిప్‌ లేదా బ్యాండ్‌ వేసుకోవాలి. గోళ్లు, కళ్ళు, పళ్ళు, హావభావాలు, కదలికలు, మాటతీరు, వ్యక్తిగత పరిశుభ్రత, శ్వాస, బాడీ ఓడోర్స్‌ వంటి వాటిపైన శ్రద్ధ వహించాలి. ఇంట్లోనే మనం వాడే ప్రకృతిపరమైన ముడిసరుకులతో తయారుచేసుకున్న సాధనాలతో అందాన్ని మెరుగుపరుచుకోవాలి. నీరు ఎక్కువగా తాగుతుండాలి. తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, మంచి అలవాట్లు, వ్యాయామం, ఫాస్ట్‌ ఫుడ్‌కి దూరం, లిమిటెడ్‌ స్క్రీన్‌ టైం, ఒత్తిడికి దూరం, కాన్ఫిడెన్స్‌తో కూడిన డిసిప్లిన్డ్‌ పోశ్చర్‌. ఇవి అలవర్చుకొన్నారంటే సహజమైన, స్థిరమైన, ఆరోగ్యకరమైన, అందం మీ సొంతం!

డా|| మీరా
ఎం.డి. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -