Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రేమపెండ్లికి అడ్డుపడుతున్నారని..

ప్రేమపెండ్లికి అడ్డుపడుతున్నారని..

- Advertisement -

తల్లిదండ్రులను కడతేర్చిన కూతురు
మత్తు ఇంజక్షన్‌తో ప్రాణాలు తీసిన వైనం : డీఎస్పీ
వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం యాచారంలో ఘటన


నవతెలంగాణ-బంట్వారం
ప్రేమించిన యువకున్ని పెండ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉన్నారని కన్న తల్లిదండ్రులనే ఓ కూతురు కిరాతకంగా చంపిన ఘటన వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథ(58), లక్ష్మి(54) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇద్దరు కుమార్తెలు, కుమారుడికి వివాహమైంది. ఉన్నట్టుండి శనివారం రాత్రి దశరథ, లకిë మృతి చెందారు. దీనిపై వారి కుమారుడు నక్కల అశోక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం ధరూర్‌ సీఐ రఘురాములు, బంట్వారం ఎస్‌ఐ విమల ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ రక్తంతో కూడిన రెండు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చిన్న కుమార్తె సురేఖ ప్రవర్తన పట్ల అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. సురేఖ సంగారెడ్డిలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా చేస్తోంది. అక్కడుండగానే ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. విషయం సురేఖ ఇంట్లో చెప్పగా కులం వేరు కావడంతో పెండ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో వారిపై కోపం పెంచుకున్న ఆమె శనివారం సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఆస్పత్రి నుంచి మత్తు ఇంజక్షన్లు తీసుకొచ్చింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులతో ముచ్చటించి ముగ్గురు కలిసి భోజనం చేశారు. అమ్మ నీకు ఒళ్లు నొప్పులు ఉన్నాయి కాదా డాక్టర్‌ను అడిగి ఇంజక్షన్‌ తెచ్చాను అని నమ్మబలికి.. తల్లికి విషం ఇంజక్షన్‌ వేసింది. ఇంటి బయట చలిమంట కాచుకున్న తండ్రి కొద్ది సేపటి తర్వాత లోపలికి వచ్చి.. భార్య లక్ష్మి స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించి కూతురిని ప్రశ్నించాడు. ఒళ్లు నొప్పులు తగ్గడానికి ఇంజక్షన్‌ ఇచ్చానని, నీ కోసం కూడా తెచ్చానని అతనికీ వేసింది.

ఇద్దరూ మృతి చెందారని నిర్ధారించుకున్న సురేఖ తన అన్నకు ఫోన్‌ చేసి.. అమ్మానాన్నకు ఏమైందో స్పృహ కోల్పోయారని, త్వరగా రావాలని చెప్పింది. ఆ తర్వాత ఏడవడంతో ఇంటి చుట్టుపక్కల వారు వచ్చారు. ఇంటికి వచ్చిన కుమారుడు తల్లిదండ్రుల ను మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు చెప్పారు. తొలుత అప్పుల బాధతో మృతిచెంది ఉంటా రని అందరూ భావించారు. కానీ, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేఖ ప్రవర్తనపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. మూడ్రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూతురి సురేఖను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -