Monday, April 13, 2026
E-PAPER
Homeఆటలుబెంగళూరు జోరు

బెంగళూరు జోరు

- Advertisement -

ముంబయి ఇండియన్స్‌పై 18 పరుగులతో గెలుపు
ఫిల్‌ సాల్ట్‌, కోహ్లి అర్థ సెంచరీలు
బెంగళూరు 240/4, ముంబయి 222/5

నవతెలంగాణ-ముంబయి
డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జోరందుకుంది. రాయల్స్‌ చేతిలో ఓటమి నుంచి కోలుకుని ముంబయి ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆదివారం వాంఖడెలో అదరగొట్టిన ఆర్‌సీబీ.. ముంబయి ఇండియన్స్‌ను బ్యాట్‌తో, బంతితో ఆడుకుంది. 241 పరుగుల భారీ ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులే చేసింది. రికెల్టన్‌ (37), రోహిత్‌ శర్మ (19) క్రీజులో ఉండగా రేసులో నిలిచిన ముంబయి ఇండియన్స్‌.. ఆ తర్వాత గతి తప్పింది. సూర్యకుమార్‌ (33), తిలక్‌ వర్మ (1), హార్దిక్‌ పాండ్య (40) అవసరానికి తగినట్టు ఆడలేదు. ఇంపాక్ట్‌ ఆటగాడు రూథర్‌ఫోర్డ్‌ (71 నాటౌట్‌, 31 బంతుల్లో 1 ఫోర్‌, 9 సిక్స్‌లు) ధనాధన్‌తో ముంబయి ఓటమి అంతరాన్ని కుదించుకుంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (78, 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), రజత్‌ పాటిదార్‌ (53, 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (50, 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. టిమ్‌ డెవిడ్‌ (34 నాటౌట్‌) సైతం ఆకట్టుకున్నాడు. ముంబయి పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (0/35) మరోసారి వికెట్ల వేటలో నిరాశపరిచాడు. ఆర్‌సీబీ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. 4 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి ఇది మూడో విజయం కాగా.. ముంబయి ఇండియన్స్‌కు 4 మ్యాచ్‌ల్లో మూడో పరాజయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -