Tuesday, November 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమన రైతుకు ద్రోహం!

మన రైతుకు ద్రోహం!

- Advertisement -

ట్రంప్‌నకు తలొగ్గిన మోడీ సర్కార్‌
మొక్కజొన్న, సోయాబిన్‌ దిగుమతులకు అంగీకారం
పాల ఉత్పత్తులకు ఆమోదం
చివరి దశలో యూఎస్‌, ఇండియా వాణిజ్య ఒప్పందం
నవంబర్‌ ఆఖరికి ప్రకటన
వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
ఇక అమెరికా ఎల్పీజీ గ్యాస్‌..!

నవ తెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌
భారత రైతులను వెన్నుపోటు పొడవడానికి అమెరికా చేసిన ఒత్తిడిలకు మోడీ సర్కార్‌ తలొగ్గింది. పన్నులు లేకుండా యూఎస్‌ సోయాబిన్‌, మొక్కజొన్న తదితర జన్యు మార్పిడి జెనిటిక్‌ మాడిఫైడ్‌ (జీఎం) విత్తనాలను భారత్‌లోకి అనుమతించడానికిి కేంద్రం అంగీకరించడం ద్వారా కర్షకుడి వీపు మీద కత్తి పెట్టింది. అదే విధంగా పాల ఉత్పత్తుల అమ్మకాలకు ట్రంప్‌ పెట్టిన షరతులకు కేంద్రం తలాడించిందని స్పష్టమైన రిపోర్టులు వస్తోన్నాయి. వీటికి సంబంధించి ఇరు దేశాల మధ్య నవంబర్‌ చివరి వారంలోనే కీలక ఒప్పందం జరగనుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్‌, యూఎస్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ సెక్రెటరీ రాజేశ్‌ అగర్వాల్‌ సోమవారం వెల్లడించారు.

నవంబర్‌ చివరి నాటికి ఈ తొలిదశ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ”ఇరు దేశాల మధ్య నెలల తరబడి వర్చువల్‌ చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందంలో రెండు భాగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని దీర్ఘకాలం సమయం తీసుకోవచ్చు. మరొకటి టారిఫ్‌ సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించే మొదటి దశ చర్చలు. ఈ దశలో భారత్‌పై విధించిన 25 శాతం పరస్పర టారిఫ్‌లు, 25 శాతం చమురు టారిఫ్‌లు రెండింటిపై స్పష్టత వస్తాయి. పరస్పర సుంకాలు, అమెరికా మార్కెట్‌కు అవకాశాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించే మరో అంశం చర్చలో చివరి దశలో ఉంది.” అని రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు.

”భారత్‌తో మాకు నాణ్యమైన, ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం సాధ్యమవుతోంది. ఇది గతంలో ఉన్న ఒప్పందాల కంటే చాలా భిన్నంగా, మరింత బలమైనదిగా ఉంటుంది” అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు, మూడు రోజుల క్రితం పేర్కొన్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆర్థిక, భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా అమెరికా ఎగుమతులు, ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులకు కూడా దోహదపడనుందని యూఎస్‌ వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాలతో యూఎస్‌ డిమాండ్లకు భారత్‌ అంగీకరించిందని రిపోర్టులు వస్తోన్నాయి. సుంకాలు లేకుండా అమెరికా సోయాబీన్‌, మొక్కజొన్న, కొన్ని డైరీ ఉత్పత్తుల దిగుమతులకు మోడీ సర్కార్‌ అంగీకరించిందని స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్య పరస్పర టారిఫ్‌ రేట్లను 12 శాతం -15 శాతం లేదా 15 శాతం-19 శాతం మధ్య ఒక శ్రేణిలో నిర్ణయించే పని చివరి దశలో ఉందని తెలుస్తోంది.

8 కోట్ల పాడి రైతులపై కత్తి..
అమెరికా ఉత్పత్తులతో భారత రైతులు ధరల పోటీని తట్టుకోలేరు. స్థానిక రైతుల మార్కెట్‌ వాటా తగ్గుతుంది. 8 కోట్ల పాడి రైతుల జీవనాదాయాలు ప్రమాదంలో పడొచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీన పడటం ద్వారా ఉపాధి, అవకాశాలు దెబ్బతిననున్నాయనే తీవ్ర ఆందోళనల మధ్య మోడీ అమెరికాకు తలొగ్గడం గమనార్హం.

వంటగదిలో అమెరికా మంట..
అమెరికా నుంచి ఎల్పీజీ గ్యాస్‌ దిగుమతికి భారత్‌ అంగీకరించిందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. దీనికి సంబంధించిన భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏడాది కాలానికి గాను దిగుమతి ఒప్పందంపై సంతకాలు చేశాయని మంత్రి సోషల్‌ మీడియా వేదికగా సోమవారం తెలిపారు. ”ఇది చారిత్రాత్మక ఒప్పందం. భారత ప్రజలకు సురక్షితమైన, చవకైన ఎల్పీజీ సరఫరాను అందించే ప్రయత్నంలో యూఎస్‌కు ఎల్పీజీలో తలుపులు తెరిచాము. భారత చమురు కంపెనీలు ప్రతీ సంవత్సరానికి 22 లక్షల మిలియన్‌ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకోనున్నాయి. ఇది ఒక మైలురాయిగా నిలువనుంది.’ అని మంత్రి తెలిపారు.

డొంక తిరుగుడు!
మొక్కజోన్నలు ఇథనాల్‌ ఉత్పత్తికి ఉపయోగపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ జీఎం విత్తనాలను క్రమంగా పశుగ్రాసంగా ఇతర ఉత్పత్తుల్లోకి తేవడానికి ఇది ఒక అత్యంత అనుకూలమైన అవకాశంగా మారనుంది. డైరీ ఉత్పత్తులపై కఠిన రక్షణలతో పరిమిత దిగుమతులకు అనుమతి ఇవ్వబడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటునప్పటికీ.. ఈ డొంక తిరుగుడు
వ్యవహారం దొంగచాటు దెబ్బకు దారితీయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.’అమెరికా జీఎం పంటలతో మట్టి, జీవవైవిధ్యం దెబ్బతిననుంది. పురుగుమందుల ప్రభావం, దీర్ఘకాలిక వ్యాధులపై ఆందోళనలు ఉన్నాయి. యూఎస్‌ పేటెంట్‌లతో రైతులు తమ స్వేచ్ఛను కోల్పోనున్నారు. భారత సాంప్రదాయ వ్యవసాయం ప్రమాదంలో పడనుంది. సేంద్రీయ వ్యవసాయం పూర్తిగా దెబ్బతిననుంది. భారత్‌లోని మొక్కజొన్న, సోయాబీన్‌ తదితర సాంప్రదాయ విత్తనాలు, పంటలు పూర్తిగా కనుమరుగు అవుతాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థానిక విత్తనాలను భద్రపరచడం, సేంద్రీయ వ్యవసాయం కనుమరుగు కావడంతో తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి.” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -