సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
నవతెలంగాణ – యాదగిరి గుట్ట
భగత్ సింగ్ ఆశయాలను యువత ముందుకు తీసుకుపోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు యాదగిరిగుట్ట పట్టణంలోని న్యూ గుండ్లపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతిని పురస్కరించుకొని రెండు రోజులుగా నిర్వహించిన వాలీబాల్ పోటీలు ముగింపు సందర్భంగా బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదుర్కొని, కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉరిశిక్షను చిరునవ్వుతో స్వీకరించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులని కొనియాడారు. నేటి యువత మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి, మంచి మార్గంలో నడిచి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
భగత్ సింగ్ వంటి మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు మాట్లాడుతూ “స్టాప్ డ్రగ్స్ – స్టార్ట్ స్పోర్ట్స్” అనే నినాదంతో అఖిల భారత యువజన సమాఖ్య యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా, ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తును సాధించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సుక్కల సత్యం యాదవ్, గౌడ సంఘం జిల్లా నాయకుడు బైరాగని జంగయ్య గౌడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కొల్లూరు రాజయ్య, బండి జంగమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెరబోయిన మహేందర్, సిపిఐ పట్టణ కార్యదర్శి కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు పెరబోయిన పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. *విజేత జట్లకు బహుమతులు ప్రదానం* బహుమతుల వివరాలు: మొదటి బహుమతి: మల్లాపురం టీం – నగదు బహుమతి (దాత: సుక్కల సత్యం) రెండో బహుమతి: న్యూ గుండ్లపల్లి టీం – నగదు బహుమతి (దాత: బైరాగని జంగయ్య) బెస్ట్ షాటర్: శెట్టి నరసింహ యాదవ్ – నగదు బహుమతి బెస్ట్ సర్వీస్: రాయగిరి పాండు – నగదు బహుమతి అందచేశారు.



