– లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ప్రజాందోళనలు
– బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నిప్పు
– భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మృతి, 30మందికి గాయాలు
– కర్ఫ్యూ విధింపు
– వాంగ్‌చుక్ దీక్షే హింసకు కారణం-కేంద్ర హోంశాఖ
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. అయితే లడఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ కొంతకాలంగా ఆ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ డిమాండ్ పరిష్కారంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. దీన్ని నిరసిస్తూ బుధవారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా లడఖ్ రాజధాని లేహ్ వీధుల్లో ప్రజాగ్రహం పెల్లుబికింది. కేంద్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వందలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాష్ట్ర హోదాతో పాటు, ఆరవ షెడ్యూల్ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. భద్రతాదళాలు ఎక్కడికక్కడ వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. దీనితో జనాగ్రహం పెల్లుబికి, హింసకు దారితీసింది. లడఖ్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలుచోట్ల రహదారుల్ని దిగ్బంధించారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాంతీయ భావోద్వేగాలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని నినదించారు. ఈ సందర్భంలో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య ఉద్రిక్తత పెరిగింది. భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేసి, కాల్పులకు దిగారు. దీనితో నలుగురు ఆందోళనకారులు మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు.
లడఖ్ రాష్ట్రహోదా, ఆరవ షెడ్యూల్ హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ జాప్యానికి వ్యతిరేకంగా లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ) పిలుపు మేరకు బుధవారం జరిగిన బంద్ ఉద్రిక్తంగా మారింది. ఈ ఆందోళనలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు, దానికి నిప్పుపెట్టారు. ముందుగా లేహ్‌లోని లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఏహెచ్‌డీసీ) కార్యాలయం ముందు ఆందోళనలు ప్రారంభమయ్యాయనీ, తర్వాత అవి లేహ్ పట్టణమంతా విస్తరించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. దీంతో భద్రతా దళాలు టియర్‌గ్యాస్, షెల్లింగ్ ప్రయోగించాయి. దీంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. లేహ్‌లోని ఒక ప్రాంతంలో పోలీసు వ్యాన్‌ను కూడా తగలబెట్టారు. ఎల్‌ఏహెచ్‌డీసీలో 2020 నుంచి బీజేపీ అధికారంలో ఉంది. 2020లో జరిగిన ఎన్నికల్లో 26 కౌన్సిల్ సీట్లకు గాను బీజేపీ 15 సీట్లను గెలుచుకుంది. వచ్చే నెలలో మళ్లీ ఎన్నికలు జరగడానికి ముందు ఈ నిరసనలు చోటు చేసుకున్నాయి. ఎల్‌ఏహెచ్‌డీసీ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీపై ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైగా బీజేపీనే 2019 ఆగస్టులో జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి లడఖ్, జమ్మూ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నుంచి రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతు న్నాయి. ఈ డిమాండ్లను పరిశీలించ డానికి కేంద్రం ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసినా, ఎలాంటి పురోగతి లేదు. అప్పటి నుంచి స్థానిక ప్రజల్లో ఉన్న నిరసనలు, ఆగ్రహం లడఖ్ రాజధాని లేహ్ వీధుల్లో వ్యక్తమైంది. మూడంతస్తుల బీజేపీ ప్రధాన కార్యాలయంపై నుంచి ఒక యువకుడు బీజేపీ జెండాను తొలగించి నేలపై విసిరేశాడు.
నిరాహార దీక్ష ముగించిన వాంగ్‌చుక్
లేహ్‌లోని ఎన్‌డీఎస్ గ్రౌండ్‌లో ఈ నెల 10 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను బుధవారం విరమించారు. లెహ్‌లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ నిరసనను ‘సామాజిక అశాంతి’గా అభివర్ణిస్తూ ప్రశాంతత కోసం విజ్ఞప్తి చేశారు. అలాగే, దీన్ని జెన్-జెడ్ విప్లవంగా పేర్కొన్నారు. తనతో పాటు నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఆస్పత్రి పాలయ్యారని, ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించిందని, దీని ఫలితంగా బుధవారం లడఖ్‌లో బంద్‌కు పిలుపునిచ్చారని తెలిపారు. ‘ఈ బంద్‌తో వేల మంది యువకులు బయటకు వచ్చారు. వారిని వీధుల్లోకి తీసుకువచ్చిన జెన్-జెడ్ విప్లవం ఇది. ఐదు సంవత్సరాలుగా, వారు నిరుద్యోగులుగా ఉన్నారు. సామాజిక అశాంతికి ఇదే అసలు కారణం’ అని ఆయన ఆ సందేశంలో తెలిపారు. జరిగిన హింసను ఆయన ఖండించారు. ‘లేహ్‌లో జరిగింది దురదృష్టకరం. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న లడఖ్, ఇప్పుడు బీజేపీ విఫల ప్రయోగం (కేంద్రపాలిత ప్రాంతం ప్రకటన) కారణంగా నిరాశ, అభద్రతతో నిండిపోయింది. కేంద్రానిదే బాధ్యత, చర్చలు తిరిగి ప్రారంభించండి’ అని కోరారు. ఈ ఘటనలతో గురువారం జరగాల్సిన కార్గిల్ పర్యటనను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా రద్దు చేసుకున్నారు. మరొకవైపు రాష్ట్రహోదా కోసం ఎల్‌ఏబీతో పాటు పోరాటం చేస్తున్న కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కేడీఏ) గురువారం లఢక్ పూర్తి బంద్‌కు పిలుపునిచ్చింది. లేహ్‌లో హింసకు నిరాహారదీక్ష చేస్తున్న వాంగ్ చుక్ ప్రధాన కారకుడని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. స్థానిక ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
భగ్గుమన్న లేహ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES