– పట్టించుకో ని సంబంధిత శాఖ..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలో వికలాంగుల కొరకు విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా సంబంధిత భవనంలో పలు పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలోని పైకప్పులు మరియు ఫ్లోరింగ్ , గోడలు, వాకింగ్ రోప్ మరమ్మత్తుల పనులకు గాను 10 లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్టు తెలిసింది. వీటి పనుల నిమిత్తం మండలానికి సంబంధించిన ముఖ్యదారుడు కాంట్రాక్టు పనులను చేజిక్కించుకొని పనులు నాసిరకంగా నిర్వహిస్తున్నాడు. తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు కాజేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఎవరూ పట్టించుకోరని పనులు చేపడుతున్నారు.
ఇప్పటికే పాత ఫ్లోరింగ్ ను తొలగించి కొత్త ఫ్లోరింగ్ వేయడానికి పనులు చేయడం జరిగింది. స్థానికంగా లభించే ఇసుకతో పాటు దొడ్డి ఇసుకను వాడి పనులు చేపడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడంతో గుత్తేదారు ఆడింది ఆట పాడింది పాటగా పనులు నిర్వహణ జరుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు భవిత కేంద్రంలో నిర్వహిస్తున్న పనులపై శ్రద్ధ వహించి నాణ్యముగా పనులు నిర్వహించాలని భవిత కేంద్రం కు వచ్చే పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.



