Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్‌

మార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్‌

- Advertisement -

ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌
వారంలో 3 వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకం
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: ట్రెసా డైరీ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రెవెన్యూ, స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌, సర్వే, భూమి రికార్డు విభాగాలను భూభారతి పోర్టల్‌లో ఒకే గొడుగు కిందకి తెస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మార్చినాటికి భూభారతి కొత్త పోర్టల్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లిలో రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) నూతన సంవత్సరం డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు, పారదర్శకంగా ఉండేలా ఈ పోర్టల్‌ను రూపొందించామని చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ఫ్‌ భూములు వంటి వివరాలు కనిపించేలా పోర్టల్‌లో పొందుపరి చామని వివరించారు. గత ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థలో ఎదుర్కొన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుందనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదేండ్ల కాలంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గ్రామస్థాయి వరకు బలోపేతం చేశామని చెప్పారు. ఎన్నో సంస్కరణలు తెచ్చామన్నారు. ఇవి సరిపోవనీ, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. దశాబ్ధాలుగా సాగుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం రెండేండ్లలో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని వివరించారు. భూభారతి పోర్టల్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 3,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను తీసుకున్నామని చెప్పారు.

వారంరోజుల్లో మరో మూడు వేల మందిని తీసుకోబోతున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం అర్థం చేసుకుందనీ, ఆర్థిక ఇబ్బందుల వల్లే కొంత ఆలస్యమైందని చెప్పారు. ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వాలి : వంగ రవీందర్‌రెడ్డి
రాష్ట్రంలోని తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి కోరారు. జీపీవోల సమస్యలను పరిష్కరించాలనీ, ఇతర నియోజకవర్గాలకు కేటాయించిన వారిని సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయాలని సూచించారు. కొత్త రెవెన్యూ చట్టం, భూ భారతి, భూ బంధు, గ్రామ పాలన వ్యవస్థ ఏర్పాటు చేసి రెవెన్యూ శాఖకి నూతన జనసత్వాలను ఈ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. జనన, మరణ ధ్రువ పత్రాలు జారీ చేసేది రెవెన్యూ ఉద్యోగులేనని వివరించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకంలో రెవెన్యూ ఉద్యోగులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
వీఆర్‌ఏల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌ 12 ఏండ్లుగా తహశీల్దార్లు పదోన్నతి లభించక మానసిక వేదన అనుభవిస్తున్నారనీ, వెంటనే వారికి పరిపాలన సౌలభ్యం కోసం పదోన్నతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, ట్రెసా రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షలు పడిగెల రాజ్‌కుమార్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నర్సింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రకళ, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఉపేందర్‌రెడ్డి, టీఎన్జీవో, టీజీవో ప్రధాన కార్యదర్శులు ముజీబ్‌ హుస్సేనీ, బి శ్యాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -