గౌరవం లేకనే, అవమానంతో రాజీనామా
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కాంగ్రెస్ పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి, రాజీనామా చేస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు భూపెళ్లి శ్రీధర్ ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. 2001 సంవత్సరం నుండి 2025 ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా ఉంటూ పని చేసినట్లు పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు అనేకమైన పదవుల్లో ఉన్నానన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఐదు సంవత్సరాల వరకు పాదాలకు పాదరక్షలు కూడా వేసుకోకుండా కఠిన దీక్ష కూడా చేశామన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే వరకు నా పాదాలకు పాద రక్షలు వేసుకోను అని కఠోర మైన దీక్ష చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశానన్నారు. తన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానంతో కొడుకుకు రాజీవ్ గాంధీ అని, కూతురికి ఇందిరా ప్రియదర్శిని అని నామకరణం చేసి కాంగ్రెస్ పార్టీ అభిమానం చాటుకున్నామన్నారు. అయినా తమకు అవమానమే జరుగుతుందని అందుకే మనస్థాపం చెంది ఎంతో అభిమానించే నాయకులను, కాంగ్రెస్ పార్టీని సైతం వదులుకుంటున్నానని పేర్కొన్నారు.