Magazines

మొక్కజొన్న సాగు అభివృద్ధి కోసం భాగస్వామ్యం చేసుకున్న జీఐజెడ్‌, పెప్సికో ఇండియా, బేయర్‌

4 గంటల క్రితం

3M6A9581
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 5 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : జర్మన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ( డాయిష్‌ గెసెల్‌షాఫ్ట్‌ ఫ్యూర్‌ ఇంటర్నేషనాలే జుసామెనార్‌బైట్‌ (జీఐజెడ్‌))  జీఎంబీహెచ్‌, పెప్సికో ఇండియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బేయర్‌ ఏజీకి చెందిన క్రాప్‌ సైన్స్‌ విభాగంలు భారతదేశంలో పునరుత్పాదక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మొక్కజొన్న ఆధారిత వ్యవసాయంపై ఆధారపడిన రైతు సమాజాల్లో వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాల సాగు సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా రూపొందించిన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య కార్యక్రమం హార్వెస్ట్‌ (హోలిస్టిక్‌ అగ్రికల్చరల్‌ క్లైమేట్‌ రెసిలియెన్స్‌ అండ్‌ వెర్సటైల్‌ ఎకోసిస్టమ్‌ స్ట్రెంగ్థెనింగ్‌ టెక్నిక్స్‌)ను నేడు ప్రకటించాయి.

జర్మనీ ఫెడరల్‌ మినిస్ట్రీ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీఎంజెడ్‌) తరఫున డెవలప్‌పీపీపీ కార్యక్రమం కింద అమలయ్యే హార్వెస్ట్‌,  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని రైతు సమాజాలతో కలిసి పనిచేయనుంది. ఈ భాగస్వామ్యం మరింత పటిష్టమైన, సుస్థిరమైన వ్యవసాయ ఉత్పత్తికి తోడ్పడేందుకు శాస్త్రీయ నైపుణ్యం, రైతు సామర్థ్య నిర్మాణం, ఆచరణాత్మక క్షేత్రస్థాయి చర్యలు , విలువ ఆధారిత సరఫరా వ్యవస్థ భాగస్వామ్యాన్ని ఈ కార్యక్రమం సమన్వయం చేయనుంది. మూడేళ్ల పాటు అమలులో ఉండే ఈ భాగస్వామ్య వ్యవధిలో శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా 35,000 మంది రైతులకు చేరువ కావాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

బంగాళాదుంపల విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో పెప్సికో, బేయర్‌ రెండు దశాబ్దాలకు పైగా భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పుడు జీఐజెడ్‌ భాగస్వామిగా చేరడం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైజ్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌) పరిశోధన సహకారం అందించడంతో ఈ భాగస్వామ్యం మొక్కజొన్న సాగుకు కూడా విస్తరించింది. తద్వారా ఆహార వ్యవస్థ అంతటా పటిష్ఠత, సుస్థిరత, నూతన ఆవిష్కరణలకు బలం చేకూర్చటం లక్ష్యంగా పెట్టుకుంది. థాయ్‌లాండ్‌లో (2021-2025) బంగాళాదుంపలు, వరి విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలపై దృష్టి సారించిన ప్రాజెక్టులోనూ పెప్సికో, జీఐజెడ్‌ కలిసి పనిచేశాయి. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, పునరుత్పాదక వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఉద్గారాలను తగ్గించడం వంటి అంశాల్లో నిర్మాణాత్మక జోక్యాలు, సమష్టి చర్యలు గణనీయమైన ఫలితాలను అందించగలవని ఆ కార్యక్రమం నిరూపించింది. ప్రాజెక్ట్‌ హార్వెస్ట్‌ ఈ అభ్యాసాలు, నిరూపితమైన నమూనా ఆధారంగా భారతదేశంలో మరింత విస్తృత స్థాయిలో ప్రభావం చూపేలా రూపొందించారు.

భారతదేశంలో మొక్కజొన్న ఒక ముఖ్యమైన పంట. ఇది ఆహారంగా, పశువుల దాణాగా, పారిశ్రామిక ముడిసరుకుగా ఉపయోగపడటంతో పాటు, చిన్న కమతాల రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. అయితే, అస్తవ్యస్తంగా మారుతున్న వర్షపాతం, కరువు పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సహజ వనరులపై ఒత్తిడి వంటి అంశాలు రైతు సమాజాల్లో పంటల ఉత్పత్తి ప్రమాదాలను పెంచుతున్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించాలంటే, రైతుల జీవనోపాధికి మద్దతునిస్తూనే వ్యవసాయ క్షేత్రాల స్థిరత్వంను బలోపేతం చేసే పరిష్కారాలు అవసరం.

మొక్కజొన్న ఆధారిత వ్యవసాయ వ్యవస్థల్లో, పంట మార్పిడి కింద సాగు చేసే పంటలతో సహా స్థానిక పరిస్థితులకు అనుగుణమైన పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని హార్వెస్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. నేల ఆరోగ్యం, నీరు, వ్యవసాయ ఉత్పాదకాల సమర్థవంతమైన వినియోగం, పంటల వైవిధ్యీకరణ, వాతావరణ సంబంధిత ప్రమాదాలను రైతులు మెరుగ్గా ఎదుర్కొనేందుకు సహాయపడే వ్యవసాయ పద్ధతులపై ఈ కార్యక్రమం దృష్టి సారించనుంది.

ముఖ్యంగా, పునరుత్పాదక వ్యవసాయం వైపు పెద్ద ఎత్తున మారేందుకు రైతులకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడంతో పాటు, ఆ మార్పులో ఎదురయ్యే నష్టాల ముప్పును తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు కృషి చేయనుంది. సుస్థిర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడంతో పాటు, రైతుల పరిజ్ఞానం, సామర్థ్యాలను పెంపొందించడం పై దృష్టి సారిస్తుంది. అలాగే, స్థానిక వ్యవసాయ పరిస్థితుల్లో ఈ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించి, అంచనా వేసే అవకాశాలను కల్పించడంపై హార్వెస్ట్‌ దృష్టి సారించనుంది.

శాస్త్రీయ పరిజ్ఞానం, రైతుల అభ్యసనం, వ్యవస్థాగత అంశాల సమన్వయం

శాస్త్రీయ ఆధారాలను ఆచరణాత్మక రైతు అభ్యసనంతో సమన్వయం చేస్తూనే రైతులకు మద్దతునిచ్చే విస్తృత వ్యవస్థను హార్వెస్ట్‌ కార్యక్రమం బలోపేతం చేయనుంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైజ్‌ రీసెర్చ్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ సంస్థలు, స్వతంత్ర పరిశోధనా సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టు పనిచేయడంతో పాటుగా పరిశోధన, నేల, నీటి అంచనాలు, సాంకేతిక నైపుణ్యం ఆధారంగా స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సిఫారసులను రూపొందించనుంది.

ప్రదర్శనా వ్యవసాయ క్షేత్రాలు, రైతు నుంచి రైతుకు అభ్యసన కార్యక్రమాలు,  పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు, ఆచరణాత్మక అనుభవాల నుంచి నేర్చుకునేందుకు, పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకు రైతులకు సహాయపడతాయి. దీనితో పాటు ప్రభుత్వ విస్తరణ సేవలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ క్షేత్రాల నాయకుల సామర్థ్యాలను హార్వెస్ట్‌ పెంపొందించనుంది. స్థానిక సహాయక నెట్‌వర్క్‌లలో నైపుణ్యాన్ని అంతర్భాగం చేయడం ద్వారా విజయవంతమైన వ్యవసాయ పద్ధతులు కాలక్రమంలో మరింత ఎక్కువ మంది రైతులకు చేరేలా చేయనుంది. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తి, విలువ ఆధారిత సరఫరా వ్యవస్థ అవసరాల మధ్య మరింత మెరుగైన సమన్వయం, బలమైన మార్కెట్‌ అనుసంధానాలు, పునరుత్పాదక వ్యవసాయాన్ని స్వీకరించే రైతులకు ఎలా మెరుగైన అవకాశాలను కల్పించగలవన్న అంశాన్ని కూడా ఈ కార్యక్రమం పరిశీలించనుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులను పటిష్ఠమైన వ్యవసాయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా పర్యావరణ ఫలితాలతో పాటు రైతులకు, వ్యాపారాలకు దీర్ఘకాలిక విలువను అందించాలని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.

జీఐజెడ్‌ ఇండియా, భూటాన్ కంట్రీ డైరెక్టర్ ఉల్రికే ఎబెలింగ్ మాట్లాడుతూ, ‘ జీఐజెడ్‌ యొక్క అనుభవాన్ని, స్థానిక నెట్‌వర్క్‌లను, పెప్సికో మరియు బేయర్ యొక్క ఆవిష్కరణ, నైపుణ్యంతో హార్వెస్ట్ ఏకం చేస్తుంది. అభివృద్ధి లక్ష్యాలు, వ్యాపార ప్రయోజనాలు రెండూ కలిసి సాగగలవని మా భాగస్వామ్యం చూపిస్తుంది. సంయుక్తంగా, రైతుల జీవనోపాధి అవకాశాలను మేము మెరుగుపరచగలము, మరింత సుస్థిరమైన వ్యవసాయ విలువ గొలుసులను నిర్మించగలము. అదే సమయంలో ఒక బలమైన వ్యాపార అవకాశాన్ని కూడా కల్పిస్తాము. దీనివల్ల రైతులు, వినియోగదారులు, పర్యావరణం , వ్యాపార సంస్థలు సహా అందరికీ  ప్రయోజనం చేకూరనుంది’ అని అన్నారు. 

పెప్సికో ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌, ఇండియా మార్కెట్‌ సప్లై ఆఫీసర్‌ అశోక్‌ రాయ్‌ మాట్లాడుతూ ‘‘ వ్యవసాయ రంగంలో భాగస్వామ్యాల ద్వారా ముందడుగు వేసినప్పుడే అత్యుత్తమ పురోగతి సాధ్యమవుతుందని పెప్సికో ఇండియా వద్ద మేము విశ్వసిస్తున్నాం. భారతదేశంలో బంగాళాదుంపల సాగు విషయానికి వస్తే ,  నేల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూనే దీర్ఘకాలిక వ్యవసాయ భాగస్వామ్యాలను పెంపొందించటంలో మేము నిరూపితమైన విజయాన్ని సాధించాము. ఇప్పుడు జీఐజెడ్‌, బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ భాగస్వామ్యంతో ప్రాజెక్ట్‌ హార్వెస్ట్‌ ద్వారా ఆ నైపుణ్యాన్ని మొక్కజొన్న సాగుకూ విస్తరిస్తున్నాం.

పెప్‌+ మార్గదర్శకత్వంలో, మా పాజిటివ్‌ అగ్రికల్చర్‌ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా,  మొక్కజొన్న రైతులు పునరుత్పాదక, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను అవలంబించేందుకు తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పద్ధతులు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతో పాటు, వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు, వారి వ్యవసాయ క్షేత్రాలు, జీవనోపాధికి మరింత పటిష్ఠతను కల్పించేందుకు సహాయపడతాయి. ప్రాజెక్ట్‌ హార్వెస్ట్‌,  పురోగతి కోసం భాగస్వామ్యం అనే మా తత్వానికి, అలాగే భారతదేశంలో మరింత పటిష్టమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడాలనే మా లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.

బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ విభాగం ఇండియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక కంట్రీ డివిజనల్‌ హెడ్‌ సైమన్‌ వైబుష్‌ మాట్లాడుతూ: ‘‘పునరుత్పాదక వ్యవసాయం విస్తరించాలంటే,  సుస్థిరత, రైతుల ఆర్థిక ప్రయోజనాలు రెండూ కలిసి ముందుకు సాగాలి. ఏ ఒక్క సంస్థా ఈ లక్ష్యాన్ని ఒంటరిగా సాధించలేదు. మన పరస్పర బలాలను సద్వినియోగం చేసుకుంటూ, సహకార, పర్యావరణ వ్యవస్థ విధానాన్ని అనుసరించడం ద్వారా రైతులకు మరింత విలువను సృష్టించడానికి మనం విజ్ఞానం, ఆవిష్కరణలు, రైతు సామర్థ్యాలు , విలువ-గొలుసు భాగస్వామ్యాలను ఏకతాటిపైకి తీసుకురాగలము. హార్వెస్ట్‌ ద్వారా ఈ సమష్టి విధానం మరింత పటిష్ఠమైన వ్యవసాయ క్షేత్రాలు, సుస్థిర ఆహార వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని అన్నారు.


ఈ పర్యావరణ వ్యవస్థ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ, వాస్తవ వ్యవసాయ పరిస్థితుల్లో పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను పరీక్షించి, మెరుగుపరిచేందుకు  రైతులు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ భాగస్వాములను హార్వెస్ట్‌ ఒకచోట చేర్చనుంది. స్వతంత్ర పరిశోధనను, క్షేత్రస్థాయిలో రైతుల భాగస్వామ్యాన్ని బలమైన విలువ ఆధారిత సరఫరా వ్యవస్థ అనుసంధానాలతో కలపడం ద్వారా ఆరోగ్యకరమైన నేలలకు, సహజ వనరుల సమర్థ వినియోగానికి, రైతుల్లో మరింత పటిష్ఠతకు ఈ భాగస్వామ్యం దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పంచుకోగలిగే, విస్తరించగలిగే ఒక నమూనాను అందించనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్