ఆరు నెలల్లో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) లాభదాయకత భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి ఆరు నెలల్లో బ్యాంకుల మొత్తం నికర లాభం రూ.1,09,540 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16.9 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) వెల్లడించింది. ప్రభుత్వ బ్యాంకుల మొత్తం వ్యాపారం రూ.300 లక్షల కోట్ల మార్కును దాటి రూ.301.6 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపింది. 2026 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వ బ్యాంకుల మొత్తం డిపాజిట్లు రూ.275 లక్షల కోట్లకు చేరగా, రుణాల మొత్తం రూ.136.4 లక్షల కోట్లుగా నమోదైంది. మొత్తం బ్యాంకింగ్ వ్యాపారం ఏడాది ప్రాతిపదికన 15.5 శాతం వృద్ధిని సాధించింది. రుణాల పంపిణీలో రిటైల్ విభాగం 17 శాతం, వ్యవసాయ రంగం 19.5 శాతం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) విభాగం 20.4 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. మరోవైపు బ్యాంకుల ఆస్తుల నాణ్యతలోనూ మెరుగుదల కనిపించింది. సెప్టెంబర్ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 1.69 శాతానికి, నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌ఎన్‌పిఎ) నిష్పత్తి 0.33 శాతానికి తగ్గాయి. ఇవి చారిత్రక కనిష్ట స్థాయిలని ఆర్థిక శాఖ పేర్కొంది. రుణాల మంజూరులో మెరుగైన పరిశీలన, తక్కువ రుణాలు మొండి బకాయిలుగా మారడం, వసూళ్లపై దృష్టి పెట్టడం ఈ మెరుగుదలకు కారణమని తెలిపింది.







కామెంట్లు (0)