ఆందోళనలో ఉద్యోగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల పరిధిలో బయోకెమిస్ట్ పదోన్నతులకు సంబంధించి అక్రమాలు జరిగినట్టు ఉద్యోగవర్గాల్లో చర్చ జోరుగా జరుగుతున్నది. నిబంధనలు బేఖాతరు చేసి, హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ పట్టించు కోకుండా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. పదోన్నతుల కోసం రూపొందించిన ప్రొవిజనల్ లిస్టులో కనబడని కొన్ని పేర్లు తుది జాబితాలో ప్రత్యక్షం కావడమే ఈ అనుమానాలకు తావిచ్చింది. బయోకెమిస్ట్‌గా పదోన్నతి పొందేందుకు ఎమ్మెస్సీ బయో కెమెస్ట్రీ పూర్తి చేసిన ల్యాబ్ టెక్నినిషన్ గ్రేడ్ 2 అభ్యర్థులు అర్హులని నిబంధన చెబుతున్నది. ఈ మేరకు గత అక్టోబర్‌లో అధికారులు అర్హుల నుంచి వివరాలు సేకరించారు. ఆ సేకరించిన వివరాల ఆధారంగా ఈ ఏదాడి మే నెలలో ప్రొవిజనల్ సీనియారిటి లిస్ట్‌ను తయారు చేశారు. అందులో ఒక ప్రొఫార్మను రూపొందించి ఎవరైతే ఇన్‌సర్వీస్‌లో ఉండి ఆ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని దూరవిద్య ద్వారా అర్హతకు అవసరమైన విద్యను పూర్తి చేశారో వారు అర్హులని పేర్కొన్నారు.
దాని ప్రకారం జాబితా తయారు చేశారు. అనంతరం ప్రకటించిన తుది జాబితాలో మాత్రం అనుమతి తీసుకోని అభ్యర్థుల పేర్లు ఉన్నట్టు కొంత మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొవిజన్ లిస్ట్‌లో లేని పేరు తుది జాబితాలో ఐదో స్థానంలో చేర్చడం పట్ల విస్మయం వక్తం చేశారు. ఆ శాఖలోని ఉన్నతధికారులను తప్పుదోవ పట్టించి నిబంధనలకు విరుద్దంగా వెబ్ అప్షన్లు కల్పించారని వారు ఆరోపించారు. గెజిటెడ్ పదోన్నతు లు ఇచ్చే ముందు కనీసం వారం రోజుల ముందు ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలో ఉద్యోగిపై ఏమైనా ఛార్జ్ మెమోలు పెండింగ్‌లో ఉన్నాయా? అనే అంశాలు కూడా పరిశీలించకుండా హడావుడిగా పాత తేదీలో డీసీపీ అనుమతి తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అభ్యంతరాలపై సమాధానమేది?
మే నెలలో విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేసి అభ్యంతరాల నమోదుకు అవకాశం కల్పించారు. దీంతో కొంత మంది ఉద్యోగులు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఆ అభ్యంతరాలపై తీసుకున్న చర్యలేంటో స్పష్టం చేయకుం డానే తుది జాబితా ప్రకటించినట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఉద్యోగుల పదోన్నతి సందర్భంగా ఒక నెల రోజుల ముందే యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఎసీఆర్) ఐదు సంవత్సరాలది తెప్పించుకోవాల్సి ఉండగా దాన్ని కూడా హడావుడీగా తెప్పించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ రిపోర్ట్ కూడా తెప్పిం చుకోకుం డానే ప్రమోషన్లు కల్పించారని ఉద్యోగుల్లో చర్చ జరుగు తున్నది. ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టిన అధికారులపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో డీఎంఈ పరిధిలో వారిదే ఇష్టారా జ్యంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నారు.