- Advertisement -
- బీఐఎస్ ధృవీకరణ లేని రూ.8 లక్షల విలువైన ఉత్పత్తుల జప్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఐఎస్ ధృవీకరించిన ఐఎస్‌ఐ మార్కు లేని ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హైదరాబాద్ శాఖ అధికారులు సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్‌లోని గోదాంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బీఐఎస్ ధ్రువీకరణ పొందని రూ.8 లక్షల విలువైన గృహౌపకరణాలు గుర్తించి సీజ్ చేశారు. బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ ఆదేశాలతో బీఐఎస్ హైదరాబాద్ శాఖ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, డిప్యూటీ డైరెక్టర్ కెవిన్, ఎస్పీవో అభిసాయి ఇట్ట, ఎస్‌ఎస్‌ఏ శివాజీ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 225 ఉత్పత్తులకు బీఐఎస్ ధృవీకరణ లేదని అధికారులు తెలిపారు. ఐఎస్‌ఐ మార్క్ లేని, నకిలీ ఐఎస్‌ఐ ముద్ర ఉన్న ఉత్పత్తులను జప్తు చేసినట్లు వారు వెల్లడించారు. వీటిలో మిక్సర్లు, ప్రెజర్ కుక్కర్లు, సీలింగ్ ఫ్యాన్లు, హీట్ ప్లేట్లు, ఇస్త్రీ పెట్టెలు తదితర వస్తువుల్నన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధృవీకరణ తప్పనిసరి. ఐఎస్‌ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా ఉత్పత్తులు తయారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా మొదటిసారి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండోసారి అదే తప్పు చేస్తూ దొరికితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా, తదుపరి దీనికి పదిరెట్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
- Advertisement -