నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్‌కు ఎమ్‌ఐఎమ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పాతబస్తీలో రోడ్లు విస్తరించాలి, ఆస్పత్రులు నిర్మించాలి, ఫ్లైఓవర్లు కట్టాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు పూర్తి చేయాలి. బాలకార్మికుల నియంత్రణకు కఠిన చర్యలు అమలు చేయాలని అన్నారు. పాఠశాల విద్యపై మరింత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని అక్బరుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో పరిశ్రమల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని అన్నారు. ఈ పరిశ్రమల వల్ల ప్రభుత్వానికి ఎంతమేర ఉపయోగం ఉందో తెలియదు కానీ.. ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.
మరోవైపు దేశంలో బీజేపీ వాషింగ్ మెషీన్‌లా మారిపోయిందరి విమర్శించారు. ఎంత దోచుకున్నా, ఎన్ని అక్రమాలు చేసినా శిక్ష పడకుండా ఉండాలంటే ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటే చాలని అన్నారు. బీజేపీ సభ్యత్వం ఉంటే చాలు ఎవరైనా క్లీన్‌గా మారిపోతారని చెప్పారు. దీనికి ముందు సభలో మజ్లిస్ వర్సెస్ బీజేపీగా చర్చ జరిగింది. బీజేపీ, ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేల విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్రం విధానాలను మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించగా.. విమర్శలకు అర్థం లేదని బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.



