నిధులు ఇవ్వడంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – మదనాపురం
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైతులకు యూరియా ఇవ్వడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని దుప్పల్లి గ్రామంలో గురువారం విలేకరుల సమాy ేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి పంపిన బీసీ రిజర్వే షన్ల బిల్లు, ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని తుంగలో తొక్కిందన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీల సంక్షేమ పథకాలను కూడా నిర్వీర్యం చేసిందని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా, బడ్జెట్‌లో నిధులు, సంక్షేమ పథకాల విషయంపై ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 28 లక్షల కుటుంబా లకుపైగా ఇండ్లు లేని పేదలు ఉన్నారని తెలిపారు. వీళ్లందరికీ గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూనే అందరికీ ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గాల్లో ఊరికి మూడు నాలుగు, పది ఇందిరమ్మ ఇండ్లు తప్పితే ఎక్కడా ఎక్కువ ఇవ్వడం లేదని చెప్పారు.
ఆ ఇండ్ల నిర్మాణాల బిల్లులు కూడా రావడం లేదని పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, అలాంటి వ్యతిరేకత వచ్చినందుకే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయ కార్మికులకు రూ.12000, పింఛన్లు పెంచుతామనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని పేదలకు భూములు పంచకుండా.. ఉన్న కొద్దిపాటి భూములను కూడా లాక్కునే చర్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల నుంచి భూములను లాక్కోవడం సరైనది కాదని, హైదరాబాద్ చుట్టూ భూములను తీసుకోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఆర్.వెంకట్‌రాములు, డిజి.నర్సింహారావు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు ఎస్.రాజు, మేకల ఆంజనేయులు, అజయ్ తదితరులు ఉన్నారు.