ఈసీ తీరును విమర్శించిన సీపీఐ(ఎం)
తిరువనంతపురం : కేరళ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన లేఖపై బీజేపీ పార్టీకి చెందిన ముద్ర ఉండటం సంచలనంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం 2019 ఎన్నికల మార్గదర్శకాలకు సంబంధించిన ఒక లేఖను ఇటీవల రాజకీయ పార్టీలకు ఈసీ పంపిణీ చేసింది. ఈ లేఖలో రాజకీయ పార్టీల ప్రచారం, అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన మార్గదర్శకాల గురించి ఇసి ప్రస్తావించింది. ఈ లేఖపైనే బీజేపీ సీల్ కనిపించింది. ఈ లేఖను సీపీఐ(ఎం) తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఇసి లేఖపై బీజేపీ సీల్ ఉండటాన్ని తీవ్రంగా విమర్శించింది.
ముద్రలను తేలిగ్గా మార్చేస్తున్నారని పోస్టులో వ్యాఖ్యానించింది. బీజేపీ ఇక అన్ని నాటకాలను వదిలేసిందా అని సీపీఐ(ఎం) ప్రశ్నించింది. ఇప్పటికే ఈసీ, బీజేపీ కుమ్మకయ్యారని ఆరోపణలు ఉండగా, ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్ లేఖపై బీజేపీ సీల్ కనిపించడం మరిన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ లేఖ వివాదంపై కేరళ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రతన్ యు.కెల్కర్ స్పందించారు. ఇది ‘క్లరికల్ పొరపాటు’గా పేర్కొన్నారు. ఇసి మార్గదర్శకాలపై వివరణ కోరుతూ బీజేపీ కేరళ విభాగం తమ కార్యాలయాన్ని సందర్శించిందని, ఈ సమయంలో దరఖాస్తుతో పాటు దాఖలు చేసిన ఈసీఐ లేఖపై బీజేపీ ముద్ర ఉందని, దీన్నే పొరపాటున రాజకీయ పార్టీలకు పంపిణీ చేసినట్లు కెల్కర్ వివరణ ఇచ్చారు. కాగా, కేరళలో సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.


