Monday, March 23, 2026
E-PAPER
Homeజాతీయంబ్లాక్‌ మార్కెట్‌ దందా

బ్లాక్‌ మార్కెట్‌ దందా

- Advertisement -

భారత్‌లో కొనసాగుతోన్న సంక్షోభం
మాటలకే పరిమితమైన ప్రభుత్వాలు
చర్యలు మాత్రం శూన్యం
కిలో రూ.500కు చేరిన గ్యాస్‌ ధరలు
ఉపాధి కోల్పోతున్న వలస కార్మికులు
స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం

న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా గొలుసు దెబ్బతింది. దీంతో భారత్‌లోనూ గ్యాస్‌ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని కొన్ని బ్లాక్‌మార్కెట్‌ శక్తులు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నాయి. బ్లాక్‌మార్కెట్‌లో గ్యాస్‌ ధరలను కిలోకు రూ.500 వరకు పెంచుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మార్కెట్‌లో గ్యాస్‌ కొరత లేదనీ, ప్రజలు భయపడవద్దని ఊరడిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితమవుతున్నాయనీ, బ్లాక్‌ మార్కెట్‌కు, గ్యాస్‌ కొరతకు పరిష్కారం చూపలేకపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల, ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధి మార్గం ప్రభావమవడంతో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారత్‌లోనూ దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. దేశంలో ఎల్పీజీ వినియోగం అధికంగా ఉండటం, సరఫరా తగ్గిన కారణంగా ధరలు పెరిగాయి. ఈ కొరతను కొందరు బ్లాక్‌మార్కెట్‌ వ్యాపారులు ఉపయోగించుకొని బ్లాక్‌ మార్కెట్‌లో గ్యాస్‌ను అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలో గ్యాస్‌ ధర రూ.500 వరకు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.

‘ఇలా అయితే మేం ఇంటికెళ్లాల్సిందే..’
ఈ బ్లాక్‌ మార్కెట్‌ దందా కారణంగా హౌటళ్లు, హాస్టళ్లు, చిన్న ఆహార వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు గ్యాస్‌ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట చేసుకోలేని పరిస్థితులు వారికి ఏర్పడ్డాయి. దీంతో వారంతా తమ గ్రామాల బాట పడుతున్నారు. ”నాలుగు రోజులుగా గ్యాస్‌ కోసం వెతుకుతున్నాం. దొరకడం లేదు. దొరికినా ధర చాలా ఎక్కువ. ఇలాగే ఉంటే మేం తిరిగి ఇంటికి వెళ్లాల్సిందే” అని ఓ వలస కార్మికుడు వాపోయాడు.

గ్యాస్‌ సరఫరాలో ఆలస్యం.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ కొనుగోళ్లు
ఓ సర్వే ప్రకారం.. దేశంలోని 68 శాతం గృహ వినియోగదారులు గ్యాస్‌ సరఫరాలో ఆలస్యాన్ని ఎదుర్కొంటున్నారు. గతవారం ఇది 57 శాతంగా ఉంది. అదే సమయంలో బ్లాక్‌ మార్కెట్‌ కొనుగోళ్లు కూడా 14 శాతం నుంచి 20 శాతానికి పెరిగాయి. భారత్‌లో ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతులపై ఆధారపడటం, అందులో 90 శాతం హార్ముజ్‌ మార్గం ద్వారా రావడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు.

కేంద్రం ‘ఆత్మనిర్భర్‌’ ఎక్కడ?
కాగా ప్రభుత్వం ఈ పరిస్థితిని నియంత్రించడానికి దేశీయ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని నిర్ణయించింది. అలాగే బ్లాక్‌ మార్కె టింగ్‌, నిల్వదాచుకోవడం వంటి అక్రమ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రభుత్వం ఇంత చెప్తున్నప్పటికీ.. దేశంలో బ్లాక్‌ మార్కెట్‌ దందా మాత్రం ఆగటం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తోందని అంటున్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. కానీ వాస్తవానికి ఎల్పీజీ వంటి కీలక అవసరాల్లో 60 శాతం దిగుమతులపై ఆధారపడటం ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పారదర్శకత లేమితో బ్లాక్‌ మార్కెట్‌కు రెక్కలు
దేశీయ ఉత్పత్తి విషయంలో కేంద్రానికి ముందస్తు ప్రణాళిక లోపించిందని చెప్తున్నారు. సరఫరా వ్యవస్థలో పారదర్శకత లేదనీ, దీంతో బ్లాక్‌ మార్కెట్‌ పెరిగిందని అంటున్నారు. పేదలు, కార్మికులపై ప్రభావం తగ్గించే ప్రత్యామ్నాయ విధానాలు కనిపించడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. ప్రభుత్వం సంక్షోభం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా.. ముందే ఒక స్థిరమైన ప్రణాళికలు చేసి ఉంటే దేశంలో ఇలాంటి సంక్షోభం ఉండేది కాదని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -