అదే బాటలో స్విగ్గీ, జెప్టో ?
న్యూఢిల్లీ : ఆర్డర్ చేస్తే పది నిమిషాలలో డెలివరీ చేస్తాం అంటూ ప్రచారం చేసిన క్విక్ కామర్స్ వేదిక బ్లింకిట్ ఆ పద్ధతికి గుడ్‌బై చెప్పింది. డెలివరీ సిబ్బంది భద్రత, సంక్షేమంపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘పది నిమిషాలలో పది వేలకు పైగా ఉత్పత్తుల డెలివరీ’ అనే ట్యాగ్‌లైన్‌ను సవరించి ‘మీ ఇంటికే 30 వేలకు పైగా ఉత్పత్తుల సరఫరా’గా మార్చేసింది. అంటే ఆర్డర్ చేసిన ఉత్పత్తుల సరఫరాకు ఇక నిర్దిష్ట కాలపరిమితి ఉండదన్న మాట. క్విక్ కామర్స్ సంస్థలకు, కార్మిక మంత్రిత్వ శాఖకు మధ్య జరిగిన చర్చల ఫలితంగా బ్లింకిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తుల డెలివరీకి కాలపరిమితి విధించడంతో గిగ్ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోందని మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. డెలివరీ భాగస్వాములకు సురక్షితమైన పని పరిస్థితులు, మెరుగైన భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరింది.
కాగా స్విగ్గీ, జెప్టో వంటి ఇతర క్విక్ కామర్స్ సంస్థలు కూడా బ్లింకిట్ బాట పట్టే అవకాశం ఉన్నదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ రెండు సంస్థలు కూడా ఉత్పత్తుల డెలివరీకి కాలపరిమితిని నిర్ణయించాయి. గత సంవత్సరం డిసెంబర్ 31న గిగ్ వర్కర్లు డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మె జరిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వారు పది నిమిషాల డెలివరీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైడర్ల ఆరోగ్యం, రోడ్డు భద్రత, ఆదాయం వంటి అంశాలకు సంబంధించి వ్యక్తమవుతున్న ఆందోళనలను ఈ సమ్మె ముందుకు తెచ్చింది. సమ్మెకు కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
టెన్ మినిట్ డెలివరీకి బ్లింకిట్ గుడ్‌బై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



