– ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి
– మృతుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు
– ఆయనపై రూ.1.50 కోట్ల రివార్డు..70 గంటల పాటు ఆపరేషన్
– కేశవరావు మృతిని ఎక్స్ ద్వారా ధ్రువీకరించిన కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా
– తాజా ఘటనతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ
ఛత్తీస్‌గఢ్‌లో పచ్చటి అడవులు రక్తమోడుతున్నాయి. తూటాల పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. భద్రతా దళాలు జరుపుతున్న వరుస ఎన్‌కౌంటర్‌లతో పలువురు మావోయిస్టులు చనిపోతున్నారు. 2026, మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా మావోయిస్టులకు పట్టున్న ఛత్తీస్‌గఢ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ‘ఆపరేషన్ కగార్’ పేరిట రెండువారాల క్రితమే తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నది. శాంతి చర్చలకు మావోయిస్టులు ముందుకొచ్చినా, మేధావులు, సామాజికవేత్తలు పిలుపునిచ్చినా.. మోడీ సర్కారు మాత్రం ససేమిరా అంటున్నది. కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్ జరిగిన కొన్నిరోజులకే.. ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 27 మంది చనిపోయినట్ట్టు సమాచారం. మావోయిస్టులపై వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్న తీరు పైనా పలు ఆందోళనలు, అనుమానాలు కలుగుతున్నాయి. అడవుల్లో ఉండే అమాయకపు ఆదివాసీలు భయాందోళనల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విలువైన అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టాలనేదే మోడీ సర్కారు అంతిమ లక్ష్యమనీ, ఇందులో భాగంగానే అడ్డుగా ఉన్న మావోయిస్టుల అంతమొందించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నదనే ఆరోపణలు వినబడుతున్నాయి.
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకున్న భీకరమైన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తున్నది. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ కూడా ఉన్నారు. ఆయనపై రూ.1 కోటికి పైగా రివార్డు ఉన్నది. పలువురు కీలక నాయకులు కూడా ఉన్నట్టు సమాచారం. నంబాల మృతిని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా.. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ధ్రువీకరించటం గమనార్హం. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా ఉన్న బసవరాజ్.. తాజా ఎన్‌కౌంటర్‌లో చనిపోవటం మావోయిస్టుల కు తీరని నష్టమని విశ్లేషకులు చెప్తున్నారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బసవరాజుతో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జెడ్‌సీ), పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) లకు చెందిన సీనియర్ క్యాడర్ ఉన్నదన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు అబూజ్‌మడ్ అడవుల్లో బుధవారం ఉదయం ఆపరేషన్‌ను ప్రారంభించాయి. మావోయిస్టులకు పట్టున్న ఈ అటవీ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో నారాయణ్‌పూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్(డీఆర్‌జీ) సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య తీవ్రస్థాయిలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. మృతి చెందిన మావోయిస్టుల్లో నంబాల కేశవరావుతో పాటు మధు (దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు అగ్ర నాయకుడు), మావోయిస్టు ప్రచురణ జంగ్‌తో సంబంధమున్న నవీన్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక జవాన్ మరణించారనీ, భద్రతా సిబ్బందిలో మరికొందరికి గాయాలయ్యాయని బస్తర్ రేంజ్ ఐజీ తెలిపారు. ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్, ఐఎన్‌ఎస్‌ఏఎస్, కార్బైన్‌తో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు దంతేవాడ ఎస్పీ గౌరవ్ రారు చెప్పారు. పలువురు సీనియర్ మావోయిస్టులు మరణించటం లేదా తీవ్రంగా గాయపడినట్టు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం వద్ద నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నదని నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ వివరించారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టుల పోరాటంలో ఉన్నారు. ఆయన కోసం భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా జల్లెడ పట్టాయి. చివరకు అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అంతమొందించాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలకు సమీపంలో రెండు వారాల క్రితం భద్రత బలగాల ఎన్‌కౌంటర్ జరిపిన విషయం విదితమే. బీజాపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇది జరిగిన దాదాపు రెండువారాలకే ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవటం గమనార్హం. వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు.
మావోయిజం అంతానికి కట్టుబడి ఉన్నాం : ప్రధాని మోడీ
అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోడీ స్పందించారు. భద్రతా దళాలు గణనీయమైన విజయాన్ని సాధించాయని ఆయన అభినందించారు. ప్రజలకు శాంతియుతమైన జీవితం, అభివృద్ధి అందించటం కోసం మావోయిజం ముప్పును అంతమొందించటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వివరించారు. ఎన్‌కౌంటర్‌పై అమిత్‌షా ట్వీట్‌ను కోట్ చేస్తూ ఆయన పైవిధంగా స్పందించారు.
ఈ ఏడాది 200 మంది మావోలు హతం
మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా పూర్తిగా అంతమొందిస్తామని కేంద్రంలోని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిపై కేంద్ర హౌం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఈ మేరకు మావోయిస్టులకు పట్టుండే ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రత దళాలు రంగలోకి దిగాయి. పలువురు మావోయిస్టులను మట్టుబెట్టాయి. కాగా, తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్‌లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 200కు చేరుకున్నది. ఇందులో బస్తర్ ప్రాంతం నుంచే అత్యధికంగా 183 మంది ఉండటం గమనార్హం. గతేడాది ఈ సంఖ్య 219గా ఉంటే.. బస్తర్ రీజియన్ నుంచే 217 మంది మావోయిస్టులు హతం కావటం గమనార్హం.
ఎవరీ నంబాల కేశవరావు?
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతితో ఈ ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా లు కూడా ఈ ఎన్‌కౌంటర్ గురించి స్పందించారు. ఈయనది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట గ్రామం. 1955లో ఆయన జన్మిం చారు. ఈయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెల్లు ఉన్నారు. వరంగల్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక మైన రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ (ఆర్‌ఈసీ)లో ఇంజినీరింగ్ చదివాడు. 1980లో విద్యార్థి ఉద్యమాల్లోకి వచ్చాడు. వరంగల్‌లో చదువుతున్న రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ)తో సంబంధం కలిగి ఉన్నాడు. అదే ఏడాది ఒక విద్యార్థి ఉద్యమ నిరసనల్లో అరెస్టయ్యాడు. 1984లో ఎంటెక్ చదువుతున్న పుడు సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్య మంలో చేరారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలుగా పలు బాధ్యతలు చేపట్టి కీలక నాయకుడిగా ఎదిగాడు. నంబాల కేశవరావు ప్రస్తుతం నిషేధిత సీపీఐ(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
గణపతి స్థానంలో కేశవరావు నియామకం
కేశవరావు గతంలో మిలిటరీ కమిషన్ (సీఎంసీ) చీఫ్‌గా ఉన్నారు. 2018లో మావోయిస్టు సెంట్రల్ కమిటీకి నాయకత్వం వహించిన అగ్రనేత గణపతి (ముప్పాల లక్ష్మణ్ రావు) స్థానంలో ఆయన నియమితులయ్యారు. అదే ఏడాది ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కె సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివారి సోమల హత్యతో పాటు అనేక హైప్రొఫైల్ దాడుల వెనక ఈయన హస్తమున్నదని సమాచారం. నంబాల కేశవరావు మృతి సీపీఐ (మావోయిస్టు) సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో పట్టును కోల్పోతుందని అంటున్నారు. సంప్రదాయకంగా, సీఎంసీ అధిపతిని పార్టీని నడిపిం చడానికి ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తారు. దేవూజీ ప్రస్తుతం సీఎంసీగా పని చేస్తున్నందున, బసవరాజ్ మరణం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. ఈ నష్టం మావోయిస్టుల పున్ణసమీకరణ, పునర్ వ్యవస్థీకరణ సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ఆపరే షన్ కగార్‌లో భాగమని ఉన్నతాధికారులు చెబుతు న్నారు. ఇది కర్రె గుట్టలు అబూజ్‌మడ్‌లో మునుపటి దాడుల తర్వాత చివరి దశ కార్యకలాపంగా వర్ణించబ డింది. ఆపరేషన్ సిందూర్ కోసం కొంతకాలం జమ్మూ కాశ్మీర్ వైపునకు మళ్లించిన కేంద్ర పారామిలిటరీ దళాలు ఇప్పుడు తిరిగి వచ్చి ఈ ప్రాంతంలో కూంబింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి.
సంచలన దాడుల్లో వ్యూహకర్త
మిలటరీ వ్యూహాల రూపకల్పన అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెర్పడం ఆయన ప్రత్యేకతలు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయనపై వందల కేసులు ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొన్ని అత్యంత ప్రధానమైన మావోయిస్టు దాడుల వెనక ఈయన కీలక వ్యూహకర్తగా ఉన్నారని సమాచారం. ఇందులో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన 2010 దంతేవాడ ఘటన, 2013లో ఛత్తీస్‌గఢ్‌లోని ఝీరామ్ ఘాటీలో కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకున్న సంచలన ఘటనలు ఉన్నాయి. ఈయనపై రూ.1.5 కోట్ల రివార్డు ఉన్నది. సీపీఐ(మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) కమాండర్- ఇన్-చీఫ్‌గా పని చేశారు. దాడులు, వ్యూహాత్మక ఆపరేషన్లు, సుదీర్ఘ మిలిటరీ వ్యూహాలు పర్యవేక్షించేవాడు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్య అటవీ డివిజన్‌కు ఆయన నేతృత్వం కూడా వహించారు. భద్రతా ఏజెన్సీల వద్ద కేశవరావుకు సంబంధించి పరిమిత సమాచారం మాత్రమే ఉండేది. ఈయనకు సంబంధించిన తాజా ఫోటోలు కానీ, వివరాలు కానీ లేకపోవటం గమనార్హం. ఎన్‌ఐఏ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న తరుణంలో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.