నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని నాచారం గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన (బొడ్రాయి) వేడుకలు ఈనెల 7వ తారీఖు బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజులు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు బుధవారం యాగశాల అలంకరణ, నాలుగు దిక్కుల తోరణాలు నిర్మాణం, జ్యోతి ప్రజ్వలన, విగ్నేశ్వర పుణ్యాహవాచనం ప్రసాదాలు కర్పూర హారతి కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు గురువారం సుప్రభాత సేవ, నిత్య పూజ కార్యక్రమాలు, నిత్య అగ్ని హోమాలు, క్షీరాదివాసం, జలాదిస్నానాలు, మంగళ హారతి ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులకు అమ్మవారి బోనాలు సమర్పించుట, నైవేద్యం, ముడుపులు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మూడవరోజు శుక్రవారం బొడ్రాయి (గ్రామదేవతల) ఉదయం వేద పండితులచే మంత్రోచ్ఛరణాల నడుమ ప్రతిష్టాపించారు. గ్రామ పెద్దల సమక్షంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అగ్ని,ప్రతిష్టాపన, హోమం, బొడ్రాయి, ఊరేగింపు, అభిషేకం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతితో ఊరేగిపుగా వెళ్లి గ్రామంలో ప్రతిష్టాపన చేసిన బొడ్రాయి దేవతమూర్తులకు నైవైద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 11న ఆదివారం హోమాలు, వసంతోత్సవం అష్టదిగ్బంధనం, ఊరడి (బలి పూజా) బోనాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అష్టదిగ్బంధనం బలి తిరుగుట కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామంలోని వారు బయటకు పోకూడదు, బయటివారు లోనికి రాకూడదని తెలిపారు.
నాచారంలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES