Tuesday, November 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బాలీవుడ్‌ హీమ్యాన్‌ ధర్మేంద్ర ఇకలేరు

బాలీవుడ్‌ హీమ్యాన్‌ ధర్మేంద్ర ఇకలేరు

- Advertisement -

అత్యద్భుతమైన నటనతో ఆరున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో, అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలీవుడ్‌ హీమ్యాన్‌ ధర్మేంద్ర (89) ఇకలేరు.
శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర అక్టోబర్‌ 31న ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ అస్పత్రిలో చికిత్స కోసం జాయిన్‌ అయ్యారు. అప్పట్నుంచి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ సోమవారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
తమ అభిమాన నటుడు ఇకలేరనే విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయనతో నటించిన దిగ్గజ నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం ధర్మేంద్రతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, కన్నీటి పర్యంతమవుతున్నారు.
రొమాంటిక్‌ హీరోగా, యాక్షన్‌ హీరోగా, బాలీవుడ్‌ హీ మ్యాన్‌గా వెండితెరపై తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్‌ క్రిషన్‌ దేవోల్‌.
పంజాబ్‌లోని లుథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో 1935 డిసెం బర్‌ 8న జన్మించిన ఆయనకు చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉండేది.
హ్యాండ్‌సమ్‌ మ్యాన్‌గా ఫిల్మ్‌ఫేర్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీ ఫొటోషూట్‌లతో పలు అవార్డులు అందుకున్న ధర్మేంద్ర 1960లో అర్జున్‌ హింగోరని నిర్మించిన రొమాంటిక్‌ డ్రామా ‘దిల్‌ భీ తేరా హమ్‌ భీ తేరా’ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు.
అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించ లేకపోవడంతో ధర్మేంద్ర ఎవరో ప్రేక్షకులకు అంతక తెలియలేదు. తరువాత రమేష్‌ సైగల్‌ ‘షోలా ఔర్‌ షబ్మనమ్‌’, మోహన్‌ కుమార్‌ ‘అన్‌పధ్‌’, బిమల్‌ రారు ‘బందినీ’ వంటి తదితర చిత్రాలు వరుస విజయాలుగా నిలిచి, ధర్మేంద్రని అందరూ గుర్తించేలా చేశాయి. వీటిల్లో ‘బందినీ’ జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డుని కైవసం చేసుకుంది.
1964లో సైరాభానుతో కలిసి నటించిన ‘ఆయే మిలన్‌ కి బేలా’ సినిమా ఘన విజయం సాధించడంతో కెరీర్‌ పరంగా ధర్మేంద్ర ఇక వెనుదిరిగి చూడలేదు. అంతేకాదు ఇందులో ఆయన పోషించిన పాత్రకి జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారాన్ని పొందారు.
‘హక్వీత్‌, ఖాజల్‌, ఫూల్‌ ఔర్‌ పత్తర్‌, మమతా, దేవర్‌, అనుపమ, షికార్‌, ఆంఖేన్‌, ఇజ్జత్‌, ఆయా సావన్‌ జూమ్‌ కే, యకీన్‌, ప్యార్‌ హై ప్యార్‌, అద్మీ ఔర్‌ ఇన్సాన్‌ తదితర చిత్రాలతో ధర్మేంద్ర రొమాంటిక్‌, యాక్షన్‌ హీరోగా తనదైన ముద్ర వేశారు.
హృషికేశ్‌ ముఖర్జీ తెరకెక్కించిన సోషల్‌ డ్రామా ‘సత్యకామ్‌’ కూడా జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నిలిచింది. 1970లో హేమామాలినితో నటించిన నాలుగు చిత్రాలు సూపర్‌ సక్సెస్‌తో సాధించడంతో వీరిద్దరి జోడీ హిట్‌ పెయిర్‌గా నిలిచారు.
‘జీవన్‌ మృత్యు’, ‘తుమ్‌ హసీన్‌ మై జవాన్‌’, ‘షరాఫత్‌’ తదితర చిత్రాలు వరుస విజయాల్ని సాధించడంతో ధర్మేంద్ర పాపులారిటీ మరింతగా పెరిగింది. ఈ క్రమంలో ఆయన నటించిన ‘జుగ్ను’ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ‘గురు’ చిత్రంగా రీమేక్‌ చేశారు. ‘చుప్కే చుప్కే’లో తొలిసారి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటిం చారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ హిట్‌ని సాధిస్తే, వీరిద్దరి కాంబినేషన్‌లో రమేష్‌ సిప్పి తెరకెక్కించిన యాక్షన్‌ సినిమా ‘షోలే’ ఓ ప్రభంజనం సృష్టించింది. ఒకే ఏడాది ఏడు హిట్‌ సినిమాల్లో నటించిన ఏకైక హీరోగా ధర్మేంద్ర సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. 1998 నుంచి 2025 వరకు పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ అలరించారు. హిందీతోపాటు బెంగాలీ, పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. దాాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు.
1983లో విజేత పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రం ‘బేతాబ్‌’తో పెద్ద కొడుకు సన్నీ డియోల్‌ని హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత తన కొడుకుతోనే తీసిన యాక్షన్‌ సినిమా ‘ఘాయల్‌’ సినిమా సైతం ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఆ ఏడాది బెస్ట్‌ పాపులర్‌ సినిమాగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇక తన రెండో తనయుడు బాబీ డియోల్‌ని వెండితెరకు హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘బర్సాత్‌’ చిత్రం సైతం మంచి విజయాన్ని సాధించింది.
ధర్మేంద్ర 1954లో ప్రకాష్‌కౌర్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి సన్నీడియోల్‌, బాబీ డియోల్‌ సంతానం. ఆమె మరణానంతరం హేమామాలిని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఈషాడియోల్‌, ఆహానా డియోల్‌ సంతానం. భారతీయ సినిమా పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన సేవలకుగాను కేంద్రప్రభుత్వం 2012లో ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో గౌరవించింది.
నటుడిగా, నిర్మాతగానే కాకుండా ప్రజా నాయకుడిగా రాజకీయాల్లోనూ ధర్మేంద్ర రాణించారు. 2004లో బికనీర్‌ నుంచి భాజాపా ఎంపీగా గెలుపొందారు. ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ‘ఇక్కీస్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒక శకం ముగిసింది..
లెజండరీ నటుడు ధర్మేంద్ర పార్దీవ దేహాన్ని ముంబయిలోని విల్లే పార్లీ శ్శశానవాటికకి తరలించారు. కడసారి తమ అభిమాన నటుడిని చూసేందుకు భారీ స్థాయిలో అభి మానులు తరలి వచ్చారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ధర్మేంద్ర భౌతికకాయాన్ని సందర్శించి, ఘననివాళి అర్పించారు.
‘భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది. తన నటనలతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారు. ఇది ఎంతో విచారకరమైన సమయం. చిత్ర పరిశ్రమకు తీరని లోటు’ అని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తీవ్ర బాధాకరం. బహుమఖ ప్రజ్ఞాశాలి, విశిష్ట నటుడిని కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. – తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
ధర్మేంద్ర మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దిగ్గజ నటుడు, తన అద్భుతమైన నటనతో లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి తరతరాలు గుర్తుండిపోతుంది.

  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
    ధర్మేంద్ర ఒక దిగ్గజ నటుడు మాత్రమే కాదు, సహృదయం కలిగిన వ్యక్తి. ఆయనను కలిసిన ప్రతిసారీ ఎంతో అప్యాయతతో పలకరించేవారు. మా మధ్య జరిగిన సంభాషణలు, జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోను. – చిరంజీవి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -