ఎస్సీ, ఎస్టీ ఆక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లా ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం అధ్యక్షుడు గాండ్ల రామ్ చందర్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని బోరిగం గ్రామ సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి,ఎస్సీ ఎస్టీ ఆక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఆదివాసి నాయక పోడు సేవా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం అని జిల్లా ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం అధ్యక్షుడు గాండ్ల రామ్ చందర్ తెలిపారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో ఓటు వేయలేదన్న కక్షతో ఒక ఆదివాసి మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి నిర్ధాక్షణంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన సర్పంచ్ పై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ పోలీసు వారు డబ్బుకో, పలుకుబడికో అమ్ముడు పోయి, అధికారం డబ్బులు ఉన్నటువంటి సర్పంచికి సపోర్ట్ చేస్తూ కంప్లైంట్ చేసి రెండు నెలలు గడిచిన ఇప్పటివరకు సర్పంచ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఒక నిరుపేద ఒంటరి మహిళ ఆదివాసీ నాయకుడు కులానికి చెందిన మహిళపై అన్యాయంగా దాడి చేసి నానా హింసలు పెట్టినటువంటి సర్పంచ్ పై పోలీస్ శాఖ వారు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేక పోవడం వల్ల వాళ్ల నిర్లక్ష్యానికి అధికారానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థ మంట కలిసి పోతుందన్నదాంట్లో సందేహం లేదు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి అడుగడుగునా పేద ప్రజలను ఆదుకుంటామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఇలా జరగడం దురదృష్టకరం.
ఈ సంఘటనను ఆదివాసీ నాయకుడు సేవా సంఘం నిజామాబాద్ జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తూ,తక్షణమే సర్పంచ్ పై చర్యలు తీసుకొని నిర్లక్ష్యం వహిస్తున్న పోలీస్ శాఖ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోగలరని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆదివాసి మహిళకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో భూమేష్ పాల్గొన్నారు.



