రెండేండ్లుగా చెల్లించని రాష్ట్ర సర్కార్
30 వేల మంది విద్యార్థుల ఇబ్బందులు
బకాయిల విడుదలకు ప్రభుత్వం సుముఖత
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
బెస్ట్ అవైలబుల్ స్కీం (బాస్)బకాయిలు రోజు రోజుకు పేరుకు పోతున్నాయి. ఏడాదికి రెండు పర్యాయాలు చెల్లించాల్సిన ఫీజులను రెండేండ్లయినా విడుదల చేయకపోవటంతో యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే రూ.180 కోట్లు బకాయి ఉంది. అంతేకాదు సుమారు 30వేల మంది విద్యార్థులు బాస్ కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. పండుగ నాటికి ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని యాజమాన్యాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఫీజు క్లియర్ కాకుండా తరగతి గదిలోకి రానియ్యమంటూ యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
చదువుకోసం అగచాట్లు
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బకాయిలు విడుదల చేసి, యదాతదంగా వారికి విద్యా బోధన అందించేందుకు కృషి చేయాల్సిన అవసరమున్నది. సర్కార్ కరుణించటంలేదని విద్యార్థి, యువజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకం పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పండుగ తర్వాత సగం బకాయిలు చెల్లించనున్నట్టు కూడా ప్రకటించారు. ఆచరణలో వాస్తవ రూపం దాల్చాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రజా ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంటున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద నిధులకు సంబంధించిన ఒప్పందం పాఠశాల యాజమాన్యాలు, జిల్లా యం త్రాంగం మధ్యన జరిగిందనీ, ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే అక్కడే పరిష్కారం చేసుకోవాలని ప్రభుత్వం సలహాలు ఇస్తున్నది.
జిల్లా స్థాయిలో ఒప్పందాలు జరిగాయి కాబట్టి అక్కడే తేల్చుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు ఈ స్కీం ద్వారా ప్రాథమిక తరగతిలో ఒక్కో విద్యార్థికి ఏటా రూ.28వేలు, ప్రాథమికోన్నత తరగతిలో వసతితో కలిపి రూ.42వేల చొప్పున చెల్లిస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 230 ప్రయివేట్ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులు 23వేల మంది, ఎస్టీ విద్యార్థులు ఏడు వేల మందికి ఉచిత విద్య, భోజనం, పుస్తకాలు, బట్టలు, వసతి కల్పించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిధులను చెల్లించడం వల్ల ఈ పథకం సజావుగా సాగేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పథకం అస్తవ్యస్తంగా మారిందని, దీన్ని గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.
చదువును దూరం చేయొద్దు..
బాస్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం వేల మంది విద్యార్థులను చదువుకు దూరం చేస్తోంది. ఏటా బకాయిలు పేరుకు పోతున్నాయే తప్ప, క్లియర్ చేయడం లేదు. ప్రభుత్వానికి కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ద విద్యార్థుల చదువుల మీద లేదు. ఇది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల చిన్న చూపు తప్ప మరొకటి కాదు.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. కుంటి సాకులు కట్టిపెట్టి విద్యార్ధుల భవిష్యత్‌కోసం తగిన నిర్ణయం తీసుకోవాలి.
టి నాగరాజు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి