నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సెస్ ఉద్యోగ, విద్యుత్ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం 72 గంటల విధుల బహిష్కరణ చేశారు. తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో 72 గంటల విధుల బహిష్కరణ చేసి సెస్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అన్ని క్యాడర్ లలో గల ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (విఈడబ్ల్యూ) గా విధులు నిర్వహిస్తున్న సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇచ్చిన కారుణ్య నియామకాలను ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయలేదని, వాటిని వెంటనే రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేసారు.
సెస్ పరిధిలో గల కార్మికులకు ఉద్యోగులకు ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ గతంలో చెల్లించేవారని,ప్రస్తుతం ఇవ్వడం లేదని వాటిని మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. ప్రతి ఉద్యోగికి నాణ్యమైన రక్షణ పరికరాలు అందించాలని, అసిస్టెంట్ హెల్పర్ అనే పేరును జేఎల్ఎం గా మార్చాలన్నారు.2025 నవంబర్ నుండి అనువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు కే. ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, జిల్లా అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



