ప్రపంచంలోని అంధుల విద్యాభివృద్ధికి నిరంతరం కృషిచేసిన నవయుగ వైతాళికుడు లూయిస్ బ్రెయిలీ. వారికోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా తనలాంటి అంధులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా ప్రత్యేక లిపి కోసం పాటుపడ్డాడు. 1809 జనవరి 4న ప్రాన్స్‌లోని క్రూవే గ్రామంలో జన్మించిన ఆయన బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కండ్లు కోల్పోయి అంధుడిగా మారాడు. పారిస్‌లో 1784లో వాలెంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలలో చేరాడు. ఆయనుకున్న తెలివితేటలను చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయారు. అప్పటికే అమలులో ఉన్న ‘లైన్ టైపు’ పద్ధతిలో పట్టుదలతో చదువుకుని పదిహేండ్ల వయసులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు. పగలు పాఠశాలలో విద్యార్థులకు చదువు చెబుతూ, రాత్రి సమయంలో అంధులు చదవ గలిగే, రాయగలిగే లిపి తయారీ కోసం అహర్నిషలు కృషి చేశాడు. అంధులు పుస్తకాలను స్పర్శతో గుర్తుపట్టి చదివేందుకు వీలుగా చుక్కలు ఉండాలనే నిర్ణయానికి వచ్చాడు.
1821లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి, తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు పన్నెండు ఉబ్బెత్తు చుక్కలతో ఉన్న లిపిని బ్రెయిలీ ఆరు చుక్కలకు తగ్గించాడు. స్పెయిన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ పదహారవ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బివుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు. పారదస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతని మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ఫ్రింటు చేసే విధానం రూపొందించారు. తర్వాత ఎంతోమంది పరిశోధనలు కొనసాగించారు. అయితే అవి గుడ్డివారికి చదువు నేర్చుకొనడానికి అంత సులభంగా వుండేవి కావు.బ్రెయిలీ మాత్రం తన నూతన పద్ధతి సిద్ధాంతీకరించాడు. ఐదేండ్ల పరిశోధనలో సంపూర్ణత సాధించాడు. ఆరు చుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవాత్మకమైన మార్పు. ఆరుపాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు. ఒక చుక్కనుండి ఆరు చుక్కల్లోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు.
ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు ఈ ఆరుచుక్కలలో బ్రెయిలీ రూపొందించాడు. దీంతో గుడ్డివారికి ఇతరుల సహాయం అక్కరలేదు బ్రెయిల్‌లో రాయగలరు, చదవగలరు. అంధులకు అతను కనుగొన్న లిపికి గుర్తింపు అతని మరణానంతరమే వచ్చింది. సంగీతాన్ని కూడా తన లిపిలో రాయడం అతని విశిష్టత. ఆధునికయుగంలో అందులు చదువుకునే పుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో ఉంటున్నాయి. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పు సాధించి దీన్ని కనుగొన్న వ్యక్తిగా బ్రెయిలీగా చరిత్రకెక్కాడు. ఆయన 1852 జనవరి 6న నలభైమూడేండ్ల పిన్న వయసులో మరణించాడు. నేడు ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారు.వీరిలో ఒక బిలియన్ మందికి శాస్త్ర చికిత్స అవసరం ఉంది. వక్రీభావన లోపం కారణంగా అధత్వలోపం ఉన్న వారితో 36 శాతం మందికి కళ్లద్దాలు అందుబాటులోకి వచ్చాయి. శుక్లం కారణంగా అంధత్వం ఏర్పడిన పదిహేడు శాతం మందికి వైద్యం అందుబాటులో లేదు.
నివారించగల అంధత్వం, దృష్టిలోపంతో సహా సమీకృత, ప్రజల కేంద్రీకృత కంటి సంరక్షణపై 2020లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 73వ ప్రపంచ ఆరోగ్యసభ అమోదించింది. 2023 నాటికి కంటి సంరక్షణపై ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలని డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయించింది. దేశంలో 550 మిలియన్స్ మందికి కంటి చూపు సమస్య ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. దీనివలన యేటా 37 బిలియన్ డాలర్స్ ఉత్పదాకతలో నష్టం కలుగుతుంది. దేశంలో తీవ్రమైన కంటి చూపు సమస్య ఉందని అర్థమవుతుంది. మధుమేహం కారణంగా 21మిలియన్స్ మందికి దృష్టిలోపం ఉంటే వీరిలో 2.4 మిలియన్స్ మంది అంధులున్నారు. వక్రీభావన లోపాల కారణంగా అంధత్వం ఉన్న వారిలో 41 శాతం మంది కళ్లద్దాలు వాడడం లేదు. మహిళల్లో 67 శాతం మందికి దృష్టిలోపం ఉంటే నలభై శాతం మందికి వైద్యమందడం లేదు. దీంతో ప్రతిఏడాది 30వేల మంది బాధపడుతున్నారు.
ప్రతి పదివేల మంది కి ఒక్క కళ్లద్దాల షాప్ అవసరం ఉంటే ప్రస్తుతం 70వేల మందికి ఒక్క షాప్ మాత్రమే అందుబాటులో ఉంది. దేశంలో పద్దెనిమిదేండ్లలోపు వయస్సు ఉన్న పిల్లలలో 41 శాతం మందికి ఉద్యోగుల్లో 42 శాతం, డ్రైవర్స్‌లో 42 శాతం, వృద్ధులలో 45 శాతం మందికి దృష్టి లోపాన్ని సరిచేయడానికి వైద్యం అవసరం ఉందని తెలుస్తోంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధత్వానికి కారణమవుతున్న కంటిశుక్లం, వక్రీభవన లోపం,గ్లాకోమా వంటి వాటితో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్యం చేయాలి.కంటి సంరక్షణ కోసం నాణ్యమైన వైద్య సేవలందించాలి. జిల్లా కేంద్రాల్లో నాణ్యత కలిగిన సమగ్ర నేత్ర సంరక్షణను అందించడానికి మానవ వనరులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి.కంటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలి. బ్రెయిలీ లిపిని విస్తృతం చేసి, ప్రభుత్వ సమాచారం ఆ లిపిలో అందుబాటులోకి తేవాలి.
(జనవరి 04 లూయిస్ బ్రెయిలీ జయంతి)
యం.అడివయ్య
9490098713



