నవతెలంగాణ - హైదరాబాద్ : నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించిన కేసులో పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. పదవీ విరమణ తర్వాత మరణించిన ఉద్యోగి సర్వీసులో ఉండగానే చనిపోయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
శాలిగౌరారం పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న పదవీ విరమణ చేయగా, అదే ఏడాది నవంబర్ 17న అనారోగ్యంతో మృతి చెందారు. అయితే, ఆయన మే 28నే మరణించినట్లు నకిలీ రికార్డులు సృష్టించి, మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఈ పత్రాల ఆధారంగా ఆయన కుమారుడు రాజుకు దామరచర్ల పీహెచ్‌సీలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించారు.
ఈ వ్యవహారంలో సుమారు రూ.13 లక్షల ఒప్పందం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి భార్య, కుమారుడు, బంధువులు, సంబంధిత అధికారులతో సహా 14 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.





కామెంట్‌లు (0)