- లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన – బహిరంగ సభ
- రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త ఉద్యమాలకు నిర్ణయం
- నవంబర్ 26న దేశవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు
- తెలంగాణ నుంచి ముగ్గురు కేంద్ర కమిటీకి, ఇద్దరు జాతీయ సహాయ కార్యదర్శులుగా ఎన్నిక
నవతెలంగాణ-హైదరాబాద్
అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభలు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డ నల్గొండ పట్టణంలో ఈ నెల 15 నుంచి 18 వరకు నాలుగు రోజులపాటు అత్యంత విజయవంతంగా జరిగాయి. నవంబర్ 15న నిర్వహించిన రైతాంగ ప్రదర్శన, బహిరంగ సభకు దాదాపు లక్ష మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ ప్రదర్శన, బహిరంగ సభ జరగడం విశేషమని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా రైతులు, మహిళలు, యువకులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగ ఉద్యమ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భజన కళాకారులు, కోలాట బృందాలు, వివిధ వాయిద్య కళాకారులు, గిరిజన నృత్య కళాకారులు తమ కళారూపాలతో ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు 5 వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రైతులు ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిరావడం వెనుక వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల ఆవేదన, కష్టాలు, నష్టాలు, సమస్యలు ప్రధాన కారణంగా ఉన్నాయి. పాలక ప్రభుత్వాలు రైతులకు అనేక హామీలు ఇస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదు. రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం సాధించగలిగేది రైతు సంఘాలేనని భావించి రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా మహాసభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రైతుల కోసం ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శన
నవంబర్ 14న ప్రారంభమైన వ్యవసాయ ప్రదర్శన 14, 15, 16 తేదీల్లో మూడు రోజులపాటు కొనసాగింది. మొత్తం 120 స్టాళ్లలో వివిధ కంపెనీలు రైతులకు ఉపయోగపడే నూతన వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను ప్రదర్శించాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడింది. ప్రతిరోజూ వేలాది మంది రైతులు ప్రదర్శనను సందర్శించి వివిధ అంశాలపై అవగాహన పొందారు. ఈ ప్రదర్శన రైతులకు మంచి వాతావరణాన్ని, కొత్త విషయాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది.
రైతాంగ సమస్యలపై విస్తృత చర్చలు – భవిష్యత్తు ఉద్యమాలకు కార్యాచరణ
నవంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజులపాటు ప్రతినిధుల సభ జరిగింది. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు.ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చట్టం తీసుకురావడం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అనివార్య కారణాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు తగిన నష్టపరిహారం అందించడం, రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉంచడం, నకిలీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన కల్తీలేని విత్తనాలు అందించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
వ్యవసాయ రంగం దెబ్బతింటే రైతులు మాత్రమే కాకుండా యావత్ సమాజం నష్టపోతుందని, దేశ అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని మహాసభ అభిప్రాయపడింది. వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని రక్షించేందుకు రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అఖిల భారత రైతాంగ ఉద్యమ నాయకుడు రాకేష్ తికాయత్ కూడా మహాసభలో పాల్గొని రైతాంగ సమస్యలు, ఉద్యమాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
రైతుల సహకారంతోనే మహాసభ విజయవంతం
నల్గొండలో తొలిసారిగా అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సన్నాహాలు చేపట్టాం. దాదాపు రెండు లక్షల రైతు కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకొని మహాసభ గురించి వివరించాం. రైతుల సభ రైతుల సహకారంతోనే జరగాలనే లక్ష్యంతో రైతులను భాగస్వాములను చేశాం. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభ నిర్వహణకు అన్ని విధాలా సహకరించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కదిలి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ మహాసభపై చర్చ జరిగేలా కృషి చేశారు. అందరి సమష్టి కృషితో మహాసభ విజయవంతమైంది.
ఈ మహాసభ విజయవంతానికి సహకరించిన రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు, వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, మీడియా మిత్రులు, కళాకారులు, వాలంటీర్లు, కార్యకర్తలు, నాయకులందరికీ ఆహ్వాన సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో రైతాంగ ఉద్యమాలకు కార్యాచరణ
మహాసభలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను కార్యరూపంలో పెట్టేందుకు రైతు సంఘం స్వతంత్రంగా నిర్వహించే పోరాటాలతోపాటు ఇతర రైతు సంఘాలు, ప్రజాసంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువచ్చి రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధించేందుకు మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం.
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి సమస్యలు, కరువు, పంట నష్టాలు తదితర అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వేలాది మంది రైతులతో అవసరమైతే కొన్ని రోజులపాటు, కొన్ని కిలోమీటర్ల మేర పాదయాత్రలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యలను పరిష్కరించుకునేందుకు పోరాటాలు చేపడతాం.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో వేలాది, లక్షలాది మంది రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడేందుకు మహాసభ రూపొందించిన కార్యాచరణను అమలు చేస్తాం.
టి. సాగర్ మాట్లాడుతూ...
అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డ నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు ఈ నెల 15 నుంచి 18 వరకు నాలుగు రోజులపాటు విజయవంతంగా జరిగాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, వ్యవసాయ రంగం పట్ల, రైతుల పట్ల అభిమానం ఉన్న మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన, బహిరంగ సభల్లో పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా వివిధ కళారూపాలు, గిరిజన నృత్యాలు, భజనలు, కోలాటాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారని పేర్కొన్నారు. దాదాపు 5 వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు.
తెలంగాణ నుంచి ఎనిమిది మంది జాతీయ కౌన్సిల్‌కు ఎన్నిక
మహాసభలో రాబోయే మూడు సంవత్సరాల కాలానికి నూతన జాతీయ కమిటీని ఎన్నుకున్నట్లు టి. సాగర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తీగల సాగర్, పోతినేని సుదర్శన్ రావు, జూలకంటి రంగారెడ్డి, పి. జంగారెడ్డి, మూడ్ శోభన్, బొంతు రాంబాబు, కందాల ప్రమీల, వీరేపల్లి వెంకటేశ్వర్లు జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు.
వీరిలో తీగల సాగర్, పోతినేని సుదర్శన్ రావు, జూలకంటి రంగారెడ్డి ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారని, తీగల సాగర్, పోతినేని సుదర్శన్ రావు ఇద్దరు జాతీయ సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారని వెల్లడించారు.
నవంబర్ 26న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు
భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని మహాసభ నిర్ణయించిందని టి. సాగర్ తెలిపారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, రైతులకు రుణమాఫీ చేయాలని, రైతులకు ఉపయోగపడే విధంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రధాన డిమాండ్లుగా నిర్ణయించినట్లు తెలిపారు.
అదేవిధంగా ఎస్ఐఆర్ను రద్దు చేయాలని, తొలగించిన 14 కోట్ల మంది ఓటర్ల ఓటు హక్కును పునరుద్ధరించాలని మహాసభ డిమాండ్ చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 93 లక్షల మంది ఓటర్లను ఇదే తరహా పరిస్థితుల్లోకి నెట్టారని, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో కార్మికుల నిరవధిక ధర్నాకు మద్దతు
డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో కార్మిక వర్గం నిర్వహించనున్న మూడు రోజుల నిరవధిక ధర్నాకు దేశవ్యాప్తంగా రైతాంగం మద్దతుగా నిలవాలని మహాసభ నిర్ణయించిందని టి. సాగర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై కూడా తీవ్ర దాడి చేస్తోందని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జరిగే పోరాటాల్లో రైతాంగం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిందని చెప్పారు.
రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలతోపాటు ఇతర సమస్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాలని, సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చోట భారీ ఎత్తున పాదయాత్రలు చేపట్టాలని మహాసభ నిర్ణయించిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తరహా మహోద్యమాలకు రూపకల్పన చేసి రైతులను పెద్ద ఎత్తున సమీకరిస్తామని తెలిపారు. రాబోయే పోరాటాల్లో రైతులతోపాటు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు పి. జంగారెడ్డి, మూడ్ శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉడత రవీందర్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)