- సీపీఐ(ఎం) రౌండ్ టేబుల్ సమావేశం
సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూకట్ పల్లి హుడా ట్రక్ పార్క్ భూముల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి. సత్యం అధ్యక్షత వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత మాజీ మంత్రి టీ. హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్, సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సదానందం పాల్గొని ప్రసంగించారు.
కూకట్ పల్లి ట్రక్ పార్క్ స్థలం వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆపాలని లేకపోతే నవంబర్ 22, 23 తేదీల్లో నిరాహార దీక్షలు చేపడతామని అయినా ప్రభుత్వం స్పందించకపోతే 25న హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అయినా స్పందించకపోతే 27న జరిగే వేలంపాటను అడ్డుకుంటామని అన్ని పక్షాలు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కూకట్ పల్లి కూడా ట్రక్ పార్క్ స్థలం 3.15 ఎకరాల భూమి వేలం ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి హుడా ట్రక్ పార్కు 1980-81 లో నాటి ప్రభుత్వం రైతుల నుండి భూసేకరణ చేసి 33 ఎకరాలతో ఏర్పాటు చేసిందని, ఇది ప్రభుత్వ భూమి కాదని ప్రజా ప్రయోజనాల కోసం మూసా పేట, కూకట్ పల్లి రైతులు త్యాగం చేసి ఇచ్చిన భూములని వాటిని ప్రభుత్వం వేలం వేసే హక్కు ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఆ భూమిని ప్రజాప్రయోజనాలకు వినియోగించని యెడల తిరిగి రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూకట్ పల్లి ట్రక్ పార్కు భూములలో ఎకరానికి 99 కోట్లు కనీస ధర నిర్ణయించి వేలం వేస్తుందని ఆ తర్వాత అది రియల్ ఎస్టేట్ వ్యాపారం వందల కోట్లకి వెళుతుందని, దీనిలో దందా దాగి ఉందని పేర్కొన్నారు. భూముల అమ్మకాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం ఆ భూమిలో స్టేడియం గాని విద్యాసంస్థలు గాని ఆసుపత్రులు గాని నిర్మించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇండ్ల జాగాలు ఇవ్వడానికి లేదా ఇందిరమ్మ టవర్స్ కట్టడానికి భూములే లేవని అంటూ వేలాది ఎకరాలను ఎలా అమ్మకానికి పెడుతుందని ప్రశ్నించారు. భూములన్నీ ఇలా అమ్ముకుంటూ పోతే భవిష్యత్తు ప్రజా అవసరాలు, భవిష్యత్ తరాల అవసరాలు ఎలా అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసమే భూములు అమ్ముతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలు మాట్లాడుతుందని సంక్షేమం, అభివృద్ధికి వనరుల కోసం భూముల అమ్మకం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం అభివృద్ధి పై చిత్తశుద్ధి ఉంటే దానికి వనరులు రాబట్టేందుకు ఉత్పత్తులు పెంచాలని అందుకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
వనరులు రాబట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాగాని వాటివైపు ఆలోచించకుండా భూములు అమ్మడం వైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపటం అనేక అనుమానాలకు తావిస్తుందని భూ దందా లతో చేతులు మారడం జరుగుతుందని అనుమానించాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రంపై కొట్లాడ్డానికి చేతకాని రాష్ట్ర ముఖ్యమంత్రి భూములు అమ్మకానికి తెరలేపారని అన్నారు. మియాపూర్ లో కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణం వాటిని అమ్మకానికి పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటం, వివిధ ప్రాంతాల్లో ఉన్న హెచ్ఎండిఏ భూములను వేలానికి పెట్టడం దుర్మార్గమైన చర్యలని విమర్శించారు. 2008లో హుడా ట్రక్కు పార్కు భూములను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డిఎల్ఎఫ్ సంస్థకి అప్పజెప్పే ప్రయత్నం చేసినప్పుడు సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ (నాటి టిఆర్ఎస్) పెద్ద ఎత్తున ఉద్యమించి భూముల్ని కాపాడమని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములని అమ్మాలని చూస్తే ఊరుకోమని ఎంతటి ఉద్యమానికైనా సిద్ధపడతామని హెచ్చరించారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల్లో సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూకట్పల్లి వుడా ట్రాక్ పార్క్ స్థలాన్ని వేలం అమ్మకాల్ని వెంటనే ఆపాలని లేకపోతే సిపిఎం, సిపిఐ ఇతర వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అభినందనీయమని, ప్రభుత్వ భూ అమ్మకాలపై వారి పోరాటానికి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూముల అమ్మకాలపై దృష్టి పెట్టారని ఇప్పటివరకు 25వేల ఎకరాల భూములను అమ్మారని తెలిపారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఇలా భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తు ప్రజా అవసరాలకి భవిష్యత్ తరాలకి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటారు రేపు పోతారు కానీ ప్రజలు, ప్రజల ప్రయోజనాలు శాశ్వతం అని అన్నారు. కాప్రా లో ఉన్న 400 గజాలను కూడా వేలంకు పెట్టడం దుర్మార్గమని అక్కడ ఒక బస్తి దావకాన ఏర్పాటు చేయవచ్చునని బస్తి దౌఖానాలు ప్రైవేటు బిల్డింగులలో ఉన్నాయని అన్నారు. కూకట్పల్లి ట్రక్ పార్క్ ఇటీవల పరిశీలించడం జరిగిందని అక్కడ రోజుకి 500 తగ్గకుండా ట్రక్కులు పార్కు చేసి ఉంటున్నాయని ఈ వేలంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు.
అక్కడ ట్రక్కులవాళ్లు, ఇతర వ్యాపారాలపై ఆధారపడిన వాళ్లు అనేకమంది రోడ్డున పడతారని అన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి నియోజకవర్గాలలో ఉన్న ఏకైక ఓపెన్ ఏరియా ఫుడ్ పార్క్ అని దానిని వేలం వేసి అమ్ముతే భవిష్యత్తులో ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాలు లేకుండా అవుతాయని ప్రజలకు గాలి పీల్చేందుకు కూడా అవకాశం లేకుండా పోతుందని తెలిపారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడన దానిని అమ్మేందుకు రేవంత్ రెడ్డి తహతలాడుతున్నాడని అన్నారు.
మియాపూర్ భూములపై కోర్టు తీర్పు వెలువడిన మరుక్షణమే వాటిని అమ్మకానికి పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. భూములను తనకా పెట్టిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీ భూములను బొంబాయిలో తనకా పెట్టి డబ్బులు తెచ్చారని అందుకు బ్రోకర్లకు 250 కోట్ల రూపాయలు అధికారికంగా ముడుపులు చెల్లించారని అన్నారు. రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అమ్మేలా ఉన్నాడని అన్నారు. ఎల్ ని నో ప్రమాదం కంటే ముఖ్యమంత్రి ప్రమాదం తీవ్రంగా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూసి ఊసరవెల్లులే ఆశ్చర్య పోతున్నాయని అన్నారు. కూకట్పల్లి కూడా ట్రక్ పార్క్ భూముల కోసం భూసేకరణ చేసినప్పుడు ప్రజా ప్రయోజనాల కోసమే చేసినట్టుగా వివిధ సందర్భాల్లో కోర్టులకి ప్రభుత్వం ఇచ్చిన అఫిడివెట్లలో ఉందని మరి ఇప్పుడు దాన్ని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కూకట్పల్లి ట్రక్ పార్కుల భూముల హుడా ట్రక్ పార్క్ భూముల వేలమును ప్రభుత్వము వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి సిపిఐ వ్యతిరేకమని తెలిపారు. ప్రభుత్వ భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో సీపీఐ సంపూర్ణ మద్దతునిస్తూ ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటుందని తెలిపారు. భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకు తీవ్ర హాని కలుగుతుందని తెలిపారు. స్థానిక బీఆర్ఎస్ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ పది లక్షల జనాభా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలో ఏకైక ఓపెన్ ఏరియా ఇది ఒకటే ఉందని దీన్ని కూడా అమ్మేస్తే ప్రజల భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించారు. ఈ స్థలంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, నర్సరీ, ఆర్టిఏ కార్యాలయం, ఏసిపి ఆఫీసు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అమ్మకానికి పెడితే ఎలా ప్రశ్నించారు.
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ.. భూముల వేలాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూ అమ్మకాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. సీపీఐ ఎంఎల్ ప్రజాబంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సదానందం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో పాల్గొంటామని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వి. ఉమా మహేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐలాపురం రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు శంకర్,సంతోష్, లింగస్వామి నాయకులు విజయ, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)