నవతెలంగాణ-హైదరాబాద్ : కోలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ (76) అనారోగ్యంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తన ప్రత్యేకమైన గాత్రంతో తమిళ సినీ సంగీత ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇటీవల కన్నుమూసిన సంగీత దర్శకుడు దేవాకు కృష్ణరాజ్ ఎంతో ఇష్టమైన గాయకుడు కావడం గమనార్హం. తన సంగీత ప్రయాణంలో ఆయన తమిళంలో 300కు పైగా పాటలు ఆలపించారు. కృష్ణరాజ్ తన గాత్రంతో ఎన్నో మధురమైన పాటలకు ప్రాణం పోశారు. ఆయన పాడిన ‘తిరుపతి ఏళుమలై వెంకటేశా’, ‘కాత్తు అడిక్కుదు’, ‘సిరిచ్చిట్టు పోనాలుమ్’ వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మురళి కథానాయకుడిగా నటించిన ‘పొర్కాలం’ చిత్రంలోని ‘తంజావూరు మన్ను ఎడుత్తు’ పాట ఆయనకు మంచి పేరు, గుర్తింపును తీసుకొచ్చింది.
విభిన్నమైన గాత్రంతో పలు తరాల సంగీతాభిమానులను అలరించిన కృష్ణరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా నిలిచింది. కృష్ణరాజ్ భౌతికకాయాన్ని ప్రజలు, సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని వలసరవాక్కంలోని ఆయన నివాసంలో ఉంచారు. అనంతరం ఆయన స్వగ్రామమైన సేలం జిల్లాలోని వీరపాండి పంచాయతీ పరిధిలో ఉన్న వేంబడిదళం గ్రామానికి తరలించనున్నారు. శుక్రవారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
గాయకుడు కృష్ణరాజ్ మృతిపట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా సంతాప సందేశాన్ని పంచుకున్నారు.






కామెంట్లు (0)