Magazines

సోనియా పుస్తకావిష్కరణకు ఢిల్లీకి సీఎం విజయ్..

1 గంట క్రితం

Good news for Tamil movies.. permission for six shows per day
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆత్మకథ "బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్" పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరగనున్న ఈ వేడుకలో విజయ్ పాల్గొంటున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణికం ఠాగూర్ ధ్రువీకరించారు.

ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముఖ్య ఆహ్వానితులు హాజరుకానున్నారు. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా ముఖ్యమంత్రి విజయ్‌కు ఫోన్ చేసి వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఢిల్లీ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అయినప్పటికీ, ఈ పర్యటనలో ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ భేటీ జరిగితే, కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేఘధాతు డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు వాదనలను ఆయన మరోసారి వినిపించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు మంజూరు చేయవద్దని కోరుతూ నవంబర్ 7న విజయ్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందంటూ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ ఢిల్లీకి వెళ్లడం ఇది మూడోసారి. గత పర్యటనల్లో ఆయన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సోనియా గాంధీ వంటి అగ్రనేతలతో భేటీ అయ్యారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్