నవతెలంగాణ-హైదరాబాద్: లోక్సభ ప్రస్తుత స్థానాల సంఖ్యను పెంచొద్దని.. రాష్ట్రాల వారీగా సీట్ల వాటాను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని ఇండియా బ్లాక్ కూటమి డిమాండ్ చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండీ కూటమి భేటీ అయ్యింది. డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాంపై కూటమి నేతలు చర్చించారు. కేంద్ర ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని భేటీలో నిర్ణయించారు. నియోజకవర్గాల పునర్విభజన తాజా జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలని డిమాండ్ చేసింది. మహిళా రిజర్వేషన్లు ప్రస్తుత సీట్లలోనే అమలు చేయాలని పేర్కొంది.
ఇండీ కూటమి భేటీ అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకించాలని ఇండియా బ్లాక్ నాయకులు సమిష్టిగా నిర్ణయించుకున్నారని తెలిపారు. డీలిమిటేషన్ పేరుతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని చూస్తోందని ఆరోపించారు.






కామెంట్లు (0)