నవతెలంగాణ – హైదరాబాద్ : పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి మించి ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించిన నివేదిక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 14 నమూనాల్లో 11 శాంపిళ్లలో ఇథనాల్ శాతం 20 దాటినట్లు పరీక్షల్లో తేలిందని నివేదిక పేర్కొంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్‌లో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపింది. మరోవైపు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 63 నమూనాల పరీక్షల్లోనూ నిర్దేశిత పరిమితికి మించి ఇథనాల్ ఉన్నట్లు వెల్లడించిందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నివేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 20 శాతం పరిమితిని మించి ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను విక్రయిస్తూ ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధిక ఇథనాల్ మిశ్రమం వల్ల వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఇంజిన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న పెట్రోల్‌లో వాస్తవంగా ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నారో ప్రధాని మోడీ వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అయితే కర్ణాటక ప్రభుత్వ నివేదికలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వ్యతిరేకించాయి. ఇథనాల్ మోతాదు, పరీక్షల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.






కామెంట్‌లు (0)