నవతెలంగాణ - మక్తల్ : అభివృద్ధి పనులకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని, మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మక్తల్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతానని అన్నారు. శనివారం మక్తల్ పట్టణంలోని 7వ వార్డు నుంచి గుర్లపల్లి వరకు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి పనులు చేస్తున్న వారిని విమర్శలతో వెనక్కి నెట్టే ప్రయత్నం చేయవద్దని, వ్యక్తులను మానసికంగా వేధించడం సరికాదని హితవు పలికారు. మక్తల్ అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పట్టణ అభివృద్ధికి రూ.45 కోట్లు
మక్తల్ పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.45 కోట్లు ఖర్చు చేశామని, నియోజకవర్గవ్యాప్తంగా సుమారు రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాల హయాంలో మక్తల్‌కు రూ.200 కోట్ల అభివృద్ధి నిధులు కూడా రాని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆశీస్సులతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో రూ.550 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు.
గత ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో కొబ్బరికాయలు కొట్టి వెళ్లాయే తప్ప, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన మక్తల్ నేడు అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కౌన్సిలర్లు ఆసక్తి చూపడం శుభపరిణామమని పేర్కొన్నారు.
అసత్య ఆరోపణలు మానుకోవాలి
నియోజకవర్గంలోని సహజ వనరులను అమ్ముకుంటున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు, ప్రభుత్వ అభివృద్ధి పనుల అవసరాల కోసమే ఇసుకను వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల్లోనూ తెలంగాణ ప్రజలు చెల్లించే పన్నుల వాటా ఉందనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని సూచించారు.మంత్రి హోదాను పక్కనపెట్టి ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మంచి పనులు ఎక్కడ జరిగినా గుర్తించాలని, అభివృద్ధిలో లోపాలుంటే నిర్మాణాత్మక సూచనలు చేయాలే తప్ప అసత్య ప్రచారాలకు పాల్పడటం సరికాదన్నారు. మన రాతలు మనమే మార్చుకోవాలని, ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
బహిరంగ చర్చకు సిద్ధం
మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మీడియా వేదికగా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని మంత్రి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఎవరైనా లక్ష ప్రశ్నలు అడిగినా ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధమని ప్రకటించారు. పట్టణంలోని ప్రతి వార్డుకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విమర్శలకు తన సమాధానం అభివృద్ధి పనులేనని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. మక్తల్‌ను అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించబోనని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు, 7వ వార్డు కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య, మార్కెట్ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డి, అమర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ. రవికుమార్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, మక్తల్ మున్సిపల్ కౌన్సిలర్లు సంబంధిత అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు






కామెంట్లు (0)