నవతెలంగాణ – నాచారం: పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చర్లపల్లిలో ముకుల్ మాధవ్ ఫౌండేషన్ (ఎంఎంఎఫ్), ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో రేషన్ కిట్ విలువ రూ.1,500 కాగా, దీపావళి పండుగ సందర్భంగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యతతో ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ముకుల్ మాధవ్ ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో మొత్తం 11,295 రేషన్ కిట్లను పంపిణీ చేస్తూ లక్షకు పైగా పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ముకుల్ మాధవ్ ఫౌండేషన్ 1999 నుంచి ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో పేద ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేస్తోంది. పూణేలోని కేఈఎం ఆసుపత్రిలో చిన్నారుల కోసం పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు, పేద విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్కాలర్షిప్లు అందించడం, టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు మద్దతుగా పోషకాహార కిట్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చర్లపల్లి ప్రాంతంలో ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ పూణే, హైదరాబాద్ బృంద సభ్యులతో పాటు స్థానిక డిస్ట్రిబ్యూటర్ నల్లపాటి బసంత్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్ శ్రీనివాస్ రెడ్డి, చర్లపల్లి బీఆర్ఎస్ నాయకులు మహేష్, నాగారం బాబు, జీఎం జీఎల్‌వీ బాబు, చర్లపల్లి అసోసియేషన్ మాజీ చైర్మన్ రోషిరెడ్డి, దస్తగిరి రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)