నవతెలంగాణ – నాచారం: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతలో తెలంగాణ పోలీస్ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు పోలీసులకు అవసరమైన వాహనాలు, ఇతర సదుపాయాల కల్పనలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు.చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ అవసరాల కోసం మరో వాహనం కావాలని పోలీసులు పారిశ్రామికవేత్తలను కోరగా, సానుకూలంగా స్పందించిన సాయి దీప రాక్ డ్రిల్స్ అధినేత రంగారావు, బీఈసీ అధినేత కేశవరావు రూ.18 లక్షల విలువైన నూతన పెట్రోలింగ్ వాహనాన్ని సమకూర్చారు. శుక్రవారం చర్లపల్లి పారిశ్రామికవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పారిశ్రామికవేత్తలతో కలిసి వాహనాన్ని ఉప్పల్ అడిషనల్ డీసీపీ వెంకటరమణకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో నిరంతర పోలీస్ నిఘా, పెట్రోలింగ్ ఎంతో అవసరమని, నూతన వాహనం పోలీసుల విధుల నిర్వహణకు మరింత ఉపయోగపడుతుందని అన్నారు. వాహనాన్ని సమకూర్చిన పారిశ్రామికవేత్తలకు అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ మోహన్, చర్లపల్లి సీఐ సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి ఐలా చైర్మన్ గోవిందరెడ్డి, టీఐఎఫ్ చైర్మన్ సుధీర్‌రెడ్డి, ఐలా మాజీ చైర్మన్ రోషిరెడ్డి, వైస్ చైర్మన్ తాటి శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)