Magazines

National Sports Awards 2025 - క్రీడా తారలకు రాష్ట్రపతి పురస్కారాలు - అర్జున అవార్డులు

24 నిమిషాల క్రితం

National Sports Awards 2025 - Presidential Awards for Sports Stars - Arjuna Awards
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: వివిధ క్రీడా విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్‌లకు అందించే జాతీయ క్రీడా పురస్కారాలు-2025 ప్రదాన కార్యక్రమం శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మొత్తం 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులను అందుకున్నారు. వీరిలో డెకాథ్లాన్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, ఫిడే మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ ప్రముఖులున్నారు.


సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆగస్టు 18న అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది. సాధారణంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న ఈ పురస్కారాలను అందజేస్తారు. అయితే ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు జరిగే సంవత్సరాల్లో అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేస్తుంటారు. ఈ కారణంగా 2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను ఏడాదికి పైగా ఆలస్యంగా ఇప్పుడు అందజేశారు.

national sports awards

కామన్వెల్త్ క్రీడల్లో డెకాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయుడిగా తేజస్విన్ శంకర్ గుర్తింపు పొందారు. మరోవైపు ఫిడే మహిళల ప్రపంచకప్-2025 విజేతగా నిలిచిన తొలి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించారు. ఫైనల్ పోటీలో ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపిని ఓడించి ఆమె ఈ ఘనత సాధించారు. వీరితో పాటు అథ్లెట్ మహమ్మద్ అజ్మల్, బాక్సర్ నరేందర్, చెస్ క్రీడాకారుడు విదిత్ గుజరాతి, హాకీ ప్లేయర్లు లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్ తదితరులు అర్జున అవార్డులు స్వీకరించారు.

జపాన్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంటున్న కారణంగా బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణులు ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ అవార్డుల కార్యక్రమానికి హాజరు కాలేదు. సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు యెషయా అరుమైనియాగం అర్జున అవార్డు (జీవితకాల సాఫల్యం) అందుకున్నారు.

క్రీడాకారులకు శిక్షణ అందిస్తూ విశేష సేవలందించిన కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డులను అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్‌లు ఛోటే లాల్ యాదవ్, ధర్మేంద్ర సింగ్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్, రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర కుమార్ అందుకున్నారు. సాహస క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలను ప్రదానం చేశారు.

క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహానికి విశేష కృషి చేసిన పుణెలోని ఆర్మీ పారాలింపిక్ నోడ్‌కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించింది. ఈ అవార్డును లెఫ్టినెంట్ కల్నల్ దల్జీత్ సింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్