నవతెలంగాణ మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం చౌరస్తా వద్ద శుక్రవారం తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ప్రమాదం జరిగింది. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు పాదయాత్ర సాగుతున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన చౌటుప్పల్ మండలం జై కేసారానికి చెందిన లారీ మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును బలంగా ఢీకొట్టింది.దీంతో ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ ప్రమాదంలో మరో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.వారిలో తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్,ఆయన భార్య చందనతో పాటు రెండేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే 108అంబులెన్స్‌లో నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్ కు తరలించారు.కారు డ్రైవర్ సురేష్‌కు కూడా గాయాలు కావడంతో మరో వాహనంలో దవాఖానకు తరలించారు.అలాగే తీన్మార్ మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు తెలిసింది.లారీ ఢీకొట్టిన తీవ్రతకు మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారు పూర్తిగా ధ్వంసమైంది.అయితే ప్రమాదం జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న కారులో కాకుండా పాదయాత్రలో ముందుకు సాగుతుండటంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.కాగా,ఈ ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.





కామెంట్‌లు (0)